nri telugu people
-
US : అమెరికాలో 911.. అదో పెద్ద హడావిడి!
‘‘మొదటిసారి నేను అమెరికా వెళ్ళింది 2006 లో, అడుగు పెట్టింది టెక్సస్ రాష్ట్రంలోని హ్యూస్టన్ సిటీలో. అదొకప్పుడు ఆ రాష్ట్ర తాత్కాలిక రాజధాని కూడా, 1846లోనే అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో భాగమైందట. హ్యూస్టన్‌లో చాలా చమురు కంపెనీలు, పనివారిలో మెక్సికో నుంచి వచ్చినవారు ఎక్కువ. గ్యాస్ స్టేషన్ వ్యాపారంలో పాకిస్తానీలు బాగా సెటిల్ అయినట్లు కనబడుతుంది. సాఫ్ట్వేర్ పుణ్యమా ! అని ఉద్యోగాలు, చదువుల పేర మనవాళ్ళు ముఖ్యంగా తెలుగువాళ్ళ సంఖ్య ఇప్పుడు బాగా పెరుగుతుంది. అమెరికా వెళ్లినవారు ముందుగా తప్పనిసరి తెలుసుకువాల్సిన ఎమర్జెన్సీ నెంబర్ 911 (ఇండియాలో 112 లాగా). ఏ అత్యవసర పరిస్థితి ఏర్పడినా ఈ 3 డిజిట్ నెంబర్కుకు ఫోన్ చేస్తే పది నిమిషాల వ్యవధిలో పోలీసులు వచ్చేస్తారు. అవసరమైన సహాయం అది పోలీసు, ఫైర్, మెడికల్ ఏదైనా అందిస్తారు. ఆరోగ్య సమస్యలైతే హాస్పిటల్లో చేర్పిస్తారు, లా అండ్ ఆర్డర్ అయితే రక్షణ కల్పిస్తారు, భార్యాభర్తల గొడవలు, పిల్లల వేధింపులైనా చేయగలిగింది చేస్తారు. అమెరికాలో ఇళ్లకు సెక్యూరిటీ సర్వీసెస్ వారి రక్షణ కూడా ఉంటుంది. దొంగతనం వంటివి జరిగినప్పుడు అలారం మోగడం ద్వారా పోలీసులను అలెర్ట్ చేస్తుంది. దాని లాకింగ్ సిస్టం కూడా పకడ్బందిగా ఉంటుంది. రాత్రి భోజనాల తర్వాత మన తెలుగు సాఫ్ట్వేర్ దంపతులు, పిల్లలు ఇంట్లో ఆడుకుంటుంటే, తలుపు దగ్గరకు వేసి బయట లాన్లోకి వెళ్లి కూర్చున్నారట. లోపలి వైపు లాక్ పొజిషన్లో ఉండడంతో అది క్లోజ్ అవడమే కాకుండా డోర్ లాక్ కూడా అయిపోయిందట. తల్లిదండ్రులు బయట, ఏడుస్తున్న చిన్న పిల్లలు లోపల, చేతిలో ఫోన్ కూడా లేకపోవడంతో పక్కవాళ్ళ సహాయంతో వారు 911కు ఫోన్ చేయడంతో పోలీసులు వచ్చి ఇంటి వెనక వైపు తలుపు అద్దాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి , పరిస్థితి చక్కదిద్ది, పేరెంట్స్ నిర్లక్ష్యానికి హెచ్చరించి మరీ వెళ్లారట. 911 తో నాకూ ఓ స్వీయ అనుభవం ఉంది. అమెరికా నుంచి ఇండియాకు ఫోన్ చెయాలంటే ముందుగా 011 ఇది యూఎస్ నుండి బయటి దేశాలకు చేసే డయలింగ్ కోడ్, దాని తర్వాతనే ఇండియా నెంబర్ STDతో సహా చేయాలి. అలా ప్రయత్నిస్తున్న సమయంలో నేను పొరపాటున 011 కు బదులు 911 చేశాను. వెంటనే నాకు ఎమర్జెన్సీ పోలీసు రెస్పాన్స్ వచ్చింది, సారీ రాంగ్ నెంబర్ అని నేను ఠకీమని ఫోన్ పెట్టేశాను. ఎంతైనా అమెరికా పోలీసులు కదా! పోలీసు వ్యాన్ సైరన్ చేసుకుంటూ మేమున్న ఇంటి ముందుకు వచ్చేసింది. అందులోనుండి ఓ లేడీ ఇన్స్పెక్టర్ దిగింది. ఇరుగు పొరుగులు ఏమైందా అని బయటకు వచ్చి చూస్తున్నారు. పోలీసువాళ్ళ హడావిడి చూసి నేనూ షాక్ తిన్నాను. వాళ్ళు అడిగేదేమిటో నేను చెప్పేదేమిటో ఒకరిదొకరికి అర్థం కాని పరిస్థితి. మా వాళ్లు వచ్చి అసలు విషయం చెప్పినా, ఇంటి లోపలికి వెళ్లి అంతా చెక్ చేసుకొన్నాక గాని వాళ్ళు వెళ్ళిపోలేదు. అవతలిపక్క పోలీసుల రెస్పాన్స్ వచ్చినప్పుడు నేను జరిగిన పొరపాటును వాళ్లకు వివరించకుండా రాంగ్ నెంబర్ అని ఫోన్ కట్ చేయడం అనుమానానికి తావిచ్చింది. అక్కడ పోలీసులు ఇంత ఖచ్చితంగా ఉంటారని నాకు మాత్రం ఏం తెలుసు.? చివరగా 911 గురించిన ఒక జోక్. ఇద్దరు మిత్రులు కారులో మందు కొడుతూ చాలా స్పీడ్ గా వెళుతుంటే ఆ కారుకు ప్రమాదమైందట. అదే దారిలో వెళ్తున్న మన తెలుగు దానయ్య వచ్చి వాళ్లకు సహాయం చేశాడట. ప్రమాదానికి గురైనా తాము క్షేమంగా ఉండడమే కాకుండా చేతులోని మందు బాటిల్ కూడా సేఫ్‌గా ఉన్నందుకు సంతోషిస్తూ దానయ్యకు కృతజ్ఞతగా ఓ పెగ్ తీసుకొమ్మన్నారట మిత్రులు ఇద్దరు. దానయ్య అశ్చర్యపడుతూ ‘ తొందరెందుకూ 911 పోలీస్ కూడా వస్తున్నారు, అంతా కలిసి తాగొచ్చు ’ అన్నాడట , అదీ సంగతి! వేముల ప్రభాకర్ (చదవండి: అమెరికాలో మన రైతుబజార్లకు సమానంగా ఏమున్నాయి) -
పీవీకి భారతరత్న ఇవ్వాల్సిందే..!
వాషింగ్టన్: భారత మాజీ ప్రధాని.. మన తెలుగు జాతి ముద్దు బిడ్డ పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని ప్రవాస భారతీయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలోని తెలుగువారంతా పీవీకి భారతరత్న ఇవ్వాలంటూ రిమెంబరింగ్ పీవీ, రిమైండ్ పీపుల్, రిక్వెస్ట్ ఇండియన్ గవర్నమెంట్ భారతరత్న ఫర్ పవీ అంటూ మూడు ఆర్ల సిరీస్‌తో ఉద్యమంతో ముందుకు కదులుతున్నారు. ఈ మేరకు పీవీ శతాబ్ది జన్మదినం సందర్భంగా రిమెంబరింగ్ పీవీ నరసింహా రావు, రిమైండ్ పీపుల్, రిక్వెస్ట్ భారత ప్రభుత్వం భారతరత్నఫర్ పీవీ అని డిమాండ్ చేస్తు ప్రవాస భారతీయ సంఘాలు కార్యక్రమాన్ని చేపట్టాయి. అంతేగాక ఆన్లైన్ ద్వారా కూడా ఈ సంఘాలు భారతీయుల మద్దతును కోరుతున్నాయి. అనేక ప్రవాస భారతీయ సంఘాలు, సంస్థలు పీవీ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అక్టోబర్ 2020 నుంచి డిసెంబర్ 2020 వరకు పీవీ ఘనతను స్మరించుకుంటూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి ఈ కార్యక్రమాల ద్వారా పీవీకి భారతరత్న ఇవ్వాలనే డిమాండ్‌కు మద్దతు కూడగడుతున్నాయి. అమెరికాలోని వివిధ రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా పీవీ నరసింహారావు గురించి తెలిసిన ప్రముఖులు, మేధావులు నాయకులు కూడా ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. అమెరికాలోని అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్( ఏఏపీఐఆర్) ఉత్తర అమెరికా తెలుగు సంఘము (టీఏఎన్‌ఏ), అమెరికా తెలుగు సంఘం (ఏటీఏ) ఉత్తర అమెరికా తెలుగు సంఘం (ఎన్ఏటీఎస్), ఉత్తర అమెరికా తెలుగు సమితి (ఎన్ఏటీఏ) సిలికాన్ ఆంధ్ర తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ (టీడీఎఫ్), సెయింట్ లూయిస్ గుజరాత్ సమాజ్‌లతో పాటు అమెరికాకు చెందిన 81 భారతీయ సంఘాలన్నీ ముక్తకంఠంతో పీవీకి భారతరత్న ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళుతున్నాయి. భారతరత్న ఫర్ పీవీ అనే అభ్యర్థనను భారత ప్రభుత్వం గుర్తించేలా చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాలు కూడా చేపడుతున్నాయి. పీవీ శత జయంతోత్సవాలు జరుగుతున్న ఈ తరుణంలో ఆయనకు భారతరత్న వచ్చే వరకు తెలుగు సంఘాలు తమ వంతు కృషి చేస్తామని స్పష్టం చేస్తున్నాయి. అంతేగాక పీవీ ప్రాముఖ్యత, భారతీయ చరిత్రలో ఆయన స్థానం వివరిస్తూ... పీవీకి భారతరత్న అనే వినతి పత్రంపై ప్రవాస సంఘాలు సంతకాలు చేశాయి. అక్టోబర్ 2న ప్రారంభించిన ఈ సంతకాల సేకరణ ఇప్పటికీ దిగ్విజయంగా కొనసాగుతోంది. ఈ కార్య నిర్వాహక బృంద సభ్యులు స్వర్ణ ప్రసాద్, గుళ్ళపల్లి శ్రీనివాస్, డాక్టర్ అశోక్ కుమార్, చింతా ప్రవీణ్, తాళ్లూరి శ్రీధర్, అశ్విన్ పటేల్, కాజా విశ్వేశ్వర రావు (సెయింట్ లూయిస్ ఎమ్ఓ), బడ్డి అశోక్, దేవబత్తిని హరి (డెట్రాయిట్, ఎమ్ఐ), మేడిచెర్ల మురళీకృష్ణ, కపిల ప్రకాష్, శరత్ చంద్ర (ఎడిసన్, ఎన్జే), పురం ప్రవీణ్ (అట్లాంటా, జీఏ), కొండెపు సుధ (డీసీ), చల్లా కవిత( వాషింగ్టన్ డీసీ),అట్లూరి శ్రీహరి (ఎల్ఏ) కల్వకోట సరస్వతి (ఓహెచ్) ఇలా చాలా మంది ప్రవాస భారతీయ సంఘాల ప్రతినిధులు పీవీకి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళుతున్నారు. అంతేకాదు ఈ సంద్భంగా పీవీ నరసింహారావు మీద ప్రత్యేక సంచికను కూడా వెలువరించనున్నారు. తమ ఉద్యమానికి ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి మద్దతుకై ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని వివరాలూ సోషల్ మీడియాలో ప్రచురిస్తున్నారు. సాధారణ పౌరులు కూడా (petition at: https://www.change.org/CTIPetitionBharatRatna4PV) ఈ లింక్ ద్వారా సంతకం చేసి తమవంతుగా మద్దతుగా ఈ ఉద్యమంలో పాల్గొనాలని ఎన్ఆర్ఐ సంస్థలు కోరుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని సోషల్ మీడియాలో చూడాలంటే ఈ కింది లింక్‌లు క్లిక్ చేయండి BharatRatna4PV YouTube Channel Facebook: https://m.facebook.com/BharatRatna4PV-104140028106254 YouTube: https://youtube.com/channel/UCM3UlMkHF6rWH_KEPiCnZ6A BharatRatna4PV Short Film Teaser: https://youtu.be/KTTU2cJ9ENE -
వైఎస్ జగన్ దీక్షకు మద్దతుగా ఎన్ఆర్ఐల ర్యాలీలు
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు మద్దతుగా అమెరికాలోని ఎన్ఆర్ఐలు శాంతిర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. అమెరికాలోని పలు నగరాల్లో నివసిస్తున్న తెలుగువారు శాంతిర్యాలీల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వాషింగ్టన్ డీసీ నగరంలో నిర్వహించిన ర్యాలీలో వైఎస్సార్ సీపీ సెంట్రల్ రీజనల్ కొ- ఆర్డినేటర్ సురేంద్రతోపాటు రమేష్, రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. డల్లాస్‌లోని థామస్ జఫర్సన్ పార్కులో నిర్వహించిన ప్రదర్శనలో పలువురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, అభిమానులతోపాటు వివిధ విశ్వవిధ్యాలయాల విద్యార్థులూ పాల్గొని జగన్‌కు మద్దతు ప్రకటించారు. యూఎస్ వైసీపీ విభాగం కో-కన్వినర్ గురువారెడ్డి ర్యాలీలకు మద్దతు తెలిపారు.