అత్యంత వేగంగా స్పందించే 911
క్షణక్షణాల్లో బాధితులను చేరుకునే అమెరికా సర్వీసు
పోలీసులు, ఫైర్, అంబులెన్స్ ఏదైనా..
తేడా వస్తే హెలికాప్టర్ కూడా తెస్తారు
‘‘మొదటిసారి నేను అమెరికా వెళ్ళింది 2006 లో, అడుగు పెట్టింది టెక్సస్ రాష్ట్రంలోని హ్యూస్టన్ సిటీలో. అదొకప్పుడు ఆ రాష్ట్ర తాత్కాలిక రాజధాని కూడా, 1846లోనే అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో భాగమైందట. హ్యూస్టన్లో చాలా చమురు కంపెనీలు, పనివారిలో మెక్సికో నుంచి వచ్చినవారు ఎక్కువ. గ్యాస్ స్టేషన్ వ్యాపారంలో పాకిస్తానీలు బాగా సెటిల్ అయినట్లు కనబడుతుంది. సాఫ్ట్‌వేర్ పుణ్యమా ! అని ఉద్యోగాలు, చదువుల పేర మనవాళ్ళు ముఖ్యంగా తెలుగువాళ్ళ సంఖ్య ఇప్పుడు బాగా పెరుగుతుంది.
అమెరికా వెళ్లినవారు ముందుగా తప్పనిసరి తెలుసుకువాల్సిన ఎమర్జెన్సీ నెంబర్ 911 (ఇండియాలో 112 లాగా). ఏ అత్యవసర పరిస్థితి ఏర్పడినా ఈ 3 డిజిట్ నెంబర్‌కుకు ఫోన్ చేస్తే పది నిమిషాల వ్యవధిలో పోలీసులు వచ్చేస్తారు. అవసరమైన సహాయం అది పోలీసు, ఫైర్, మెడికల్ ఏదైనా అందిస్తారు. ఆరోగ్య సమస్యలైతే హాస్పిటల్లో చేర్పిస్తారు, లా అండ్ ఆర్డర్ అయితే రక్షణ కల్పిస్తారు, భార్యాభర్తల గొడవలు, పిల్లల వేధింపులైనా చేయగలిగింది చేస్తారు.
అమెరికాలో ఇళ్లకు సెక్యూరిటీ సర్వీసెస్ వారి రక్షణ కూడా ఉంటుంది. దొంగతనం వంటివి జరిగినప్పుడు అలారం మోగడం ద్వారా పోలీసులను అలెర్ట్ చేస్తుంది. దాని లాకింగ్ సిస్టం కూడా పకడ్బందిగా ఉంటుంది. రాత్రి భోజనాల తర్వాత మన తెలుగు సాఫ్ట్‌వేర్ దంపతులు, పిల్లలు ఇంట్లో ఆడుకుంటుంటే, తలుపు దగ్గరకు వేసి బయట లాన్లోకి వెళ్లి కూర్చున్నారట. లోపలి వైపు లాక్ పొజిషన్లో ఉండడంతో అది క్లోజ్ అవడమే కాకుండా డోర్ లాక్ కూడా అయిపోయిందట. తల్లిదండ్రులు బయట, ఏడుస్తున్న చిన్న పిల్లలు లోపల, చేతిలో ఫోన్ కూడా లేకపోవడంతో పక్కవాళ్ళ సహాయంతో వారు 911కు ఫోన్ చేయడంతో పోలీసులు వచ్చి ఇంటి వెనక వైపు తలుపు అద్దాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి , పరిస్థితి చక్కదిద్ది, పేరెంట్స్ నిర్లక్ష్యానికి హెచ్చరించి మరీ వెళ్లారట.
911 తో నాకూ ఓ స్వీయ అనుభవం ఉంది. అమెరికా నుంచి ఇండియాకు ఫోన్ చెయాలంటే ముందుగా 011 ఇది యూఎస్ నుండి బయటి దేశాలకు చేసే డయలింగ్ కోడ్, దాని తర్వాతనే ఇండియా నెంబర్ STDతో సహా చేయాలి. అలా ప్రయత్నిస్తున్న సమయంలో నేను పొరపాటున 011 కు బదులు 911 చేశాను. వెంటనే నాకు ఎమర్జెన్సీ పోలీసు రెస్పాన్స్ వచ్చింది, సారీ రాంగ్ నెంబర్ అని నేను ఠకీమని ఫోన్ పెట్టేశాను. ఎంతైనా అమెరికా పోలీసులు కదా! పోలీసు వ్యాన్ సైరన్ చేసుకుంటూ మేమున్న ఇంటి ముందుకు వచ్చేసింది. అందులోనుండి ఓ లేడీ ఇన్స్‌పెక్టర్ దిగింది.
ఇరుగు పొరుగులు ఏమైందా అని బయటకు వచ్చి చూస్తున్నారు. పోలీసువాళ్ళ హడావిడి చూసి నేనూ షాక్ తిన్నాను. వాళ్ళు అడిగేదేమిటో నేను చెప్పేదేమిటో ఒకరిదొకరికి అర్థం కాని పరిస్థితి. మా వాళ్లు వచ్చి అసలు విషయం చెప్పినా, ఇంటి లోపలికి వెళ్లి అంతా చెక్ చేసుకొన్నాక గాని వాళ్ళు వెళ్ళిపోలేదు. అవతలిపక్క పోలీసుల రెస్పాన్స్ వచ్చినప్పుడు నేను జరిగిన పొరపాటును వాళ్లకు వివరించకుండా రాంగ్ నెంబర్ అని ఫోన్ కట్ చేయడం అనుమానానికి తావిచ్చింది. అక్కడ పోలీసులు ఇంత ఖచ్చితంగా ఉంటారని నాకు మాత్రం ఏం తెలుసు.?
చివరగా 911 గురించిన ఒక జోక్.
ఇద్దరు మిత్రులు కారులో మందు కొడుతూ చాలా స్పీడ్ గా వెళుతుంటే ఆ కారుకు ప్రమాదమైందట. అదే దారిలో వెళ్తున్న మన తెలుగు దానయ్య వచ్చి వాళ్లకు సహాయం చేశాడట. ప్రమాదానికి గురైనా తాము క్షేమంగా ఉండడమే కాకుండా చేతులోని మందు బాటిల్ కూడా సేఫ్గా ఉన్నందుకు సంతోషిస్తూ దానయ్యకు కృతజ్ఞతగా ఓ పెగ్ తీసుకొమ్మన్నారట మిత్రులు ఇద్దరు. దానయ్య అశ్చర్యపడుతూ ‘ తొందరెందుకూ 911 పోలీస్ కూడా వస్తున్నారు, అంతా కలిసి తాగొచ్చు ’ అన్నాడట , అదీ సంగతి!
వేముల ప్రభాకర్
Comments
Please login to add a commentAdd a comment