emergency number 911
-
US : అమెరికాలో 911.. అదో పెద్ద హడావిడి!
‘‘మొదటిసారి నేను అమెరికా వెళ్ళింది 2006 లో, అడుగు పెట్టింది టెక్సస్ రాష్ట్రంలోని హ్యూస్టన్ సిటీలో. అదొకప్పుడు ఆ రాష్ట్ర తాత్కాలిక రాజధాని కూడా, 1846లోనే అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో భాగమైందట. హ్యూస్టన్‌లో చాలా చమురు కంపెనీలు, పనివారిలో మెక్సికో నుంచి వచ్చినవారు ఎక్కువ. గ్యాస్ స్టేషన్ వ్యాపారంలో పాకిస్తానీలు బాగా సెటిల్ అయినట్లు కనబడుతుంది. సాఫ్ట్వేర్ పుణ్యమా ! అని ఉద్యోగాలు, చదువుల పేర మనవాళ్ళు ముఖ్యంగా తెలుగువాళ్ళ సంఖ్య ఇప్పుడు బాగా పెరుగుతుంది. అమెరికా వెళ్లినవారు ముందుగా తప్పనిసరి తెలుసుకువాల్సిన ఎమర్జెన్సీ నెంబర్ 911 (ఇండియాలో 112 లాగా). ఏ అత్యవసర పరిస్థితి ఏర్పడినా ఈ 3 డిజిట్ నెంబర్కుకు ఫోన్ చేస్తే పది నిమిషాల వ్యవధిలో పోలీసులు వచ్చేస్తారు. అవసరమైన సహాయం అది పోలీసు, ఫైర్, మెడికల్ ఏదైనా అందిస్తారు. ఆరోగ్య సమస్యలైతే హాస్పిటల్లో చేర్పిస్తారు, లా అండ్ ఆర్డర్ అయితే రక్షణ కల్పిస్తారు, భార్యాభర్తల గొడవలు, పిల్లల వేధింపులైనా చేయగలిగింది చేస్తారు. అమెరికాలో ఇళ్లకు సెక్యూరిటీ సర్వీసెస్ వారి రక్షణ కూడా ఉంటుంది. దొంగతనం వంటివి జరిగినప్పుడు అలారం మోగడం ద్వారా పోలీసులను అలెర్ట్ చేస్తుంది. దాని లాకింగ్ సిస్టం కూడా పకడ్బందిగా ఉంటుంది. రాత్రి భోజనాల తర్వాత మన తెలుగు సాఫ్ట్వేర్ దంపతులు, పిల్లలు ఇంట్లో ఆడుకుంటుంటే, తలుపు దగ్గరకు వేసి బయట లాన్లోకి వెళ్లి కూర్చున్నారట. లోపలి వైపు లాక్ పొజిషన్లో ఉండడంతో అది క్లోజ్ అవడమే కాకుండా డోర్ లాక్ కూడా అయిపోయిందట. తల్లిదండ్రులు బయట, ఏడుస్తున్న చిన్న పిల్లలు లోపల, చేతిలో ఫోన్ కూడా లేకపోవడంతో పక్కవాళ్ళ సహాయంతో వారు 911కు ఫోన్ చేయడంతో పోలీసులు వచ్చి ఇంటి వెనక వైపు తలుపు అద్దాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి , పరిస్థితి చక్కదిద్ది, పేరెంట్స్ నిర్లక్ష్యానికి హెచ్చరించి మరీ వెళ్లారట. 911 తో నాకూ ఓ స్వీయ అనుభవం ఉంది. అమెరికా నుంచి ఇండియాకు ఫోన్ చెయాలంటే ముందుగా 011 ఇది యూఎస్ నుండి బయటి దేశాలకు చేసే డయలింగ్ కోడ్, దాని తర్వాతనే ఇండియా నెంబర్ STDతో సహా చేయాలి. అలా ప్రయత్నిస్తున్న సమయంలో నేను పొరపాటున 011 కు బదులు 911 చేశాను. వెంటనే నాకు ఎమర్జెన్సీ పోలీసు రెస్పాన్స్ వచ్చింది, సారీ రాంగ్ నెంబర్ అని నేను ఠకీమని ఫోన్ పెట్టేశాను. ఎంతైనా అమెరికా పోలీసులు కదా! పోలీసు వ్యాన్ సైరన్ చేసుకుంటూ మేమున్న ఇంటి ముందుకు వచ్చేసింది. అందులోనుండి ఓ లేడీ ఇన్స్పెక్టర్ దిగింది. ఇరుగు పొరుగులు ఏమైందా అని బయటకు వచ్చి చూస్తున్నారు. పోలీసువాళ్ళ హడావిడి చూసి నేనూ షాక్ తిన్నాను. వాళ్ళు అడిగేదేమిటో నేను చెప్పేదేమిటో ఒకరిదొకరికి అర్థం కాని పరిస్థితి. మా వాళ్లు వచ్చి అసలు విషయం చెప్పినా, ఇంటి లోపలికి వెళ్లి అంతా చెక్ చేసుకొన్నాక గాని వాళ్ళు వెళ్ళిపోలేదు. అవతలిపక్క పోలీసుల రెస్పాన్స్ వచ్చినప్పుడు నేను జరిగిన పొరపాటును వాళ్లకు వివరించకుండా రాంగ్ నెంబర్ అని ఫోన్ కట్ చేయడం అనుమానానికి తావిచ్చింది. అక్కడ పోలీసులు ఇంత ఖచ్చితంగా ఉంటారని నాకు మాత్రం ఏం తెలుసు.? చివరగా 911 గురించిన ఒక జోక్. ఇద్దరు మిత్రులు కారులో మందు కొడుతూ చాలా స్పీడ్ గా వెళుతుంటే ఆ కారుకు ప్రమాదమైందట. అదే దారిలో వెళ్తున్న మన తెలుగు దానయ్య వచ్చి వాళ్లకు సహాయం చేశాడట. ప్రమాదానికి గురైనా తాము క్షేమంగా ఉండడమే కాకుండా చేతులోని మందు బాటిల్ కూడా సేఫ్‌గా ఉన్నందుకు సంతోషిస్తూ దానయ్యకు కృతజ్ఞతగా ఓ పెగ్ తీసుకొమ్మన్నారట మిత్రులు ఇద్దరు. దానయ్య అశ్చర్యపడుతూ ‘ తొందరెందుకూ 911 పోలీస్ కూడా వస్తున్నారు, అంతా కలిసి తాగొచ్చు ’ అన్నాడట , అదీ సంగతి! వేముల ప్రభాకర్ (చదవండి: అమెరికాలో మన రైతుబజార్లకు సమానంగా ఏమున్నాయి) -
చుట్టూ పదుల కొద్ది జనాలు.. రైలులో మహిళపై అత్యాచారం
వాషింగ్టన్: ఆడవారి మీద అకృత్యాలు రోజురోజుకు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. అగ్రరాజ్యం హోదాను మోస్తున్న అమెరికాలో కూడా ఈ దారుణాలు నిత్యకృత్యంగా మారాయి. అయితే నిర్మానుష్య ప్రాంతంలో ఇలాంటి దారుణాలు చోటు చేసుకుంటే.. సాయం చేయలేకపోవచ్చు.. కానీ చుట్టూ జనాలు ఉన్నప్పటికి కూడా మృగాడి బారి నుంచి మహిళను కాపాడలేకపోవడం నిజంగా సిగ్గు చేటు. కళ్ల ముందే దారుణం జరుగుతుంటే.. చుట్టూ ఉన్న వారు చేష్టలుడిగి చూస్తూంటే.. తనపై జరిగిన అత్యాచారం కన్నా.. జనాల నిస్సహాయత బాధితురాలిని అధికంగా బాధిస్తుంది. ఇలాంటి సంఘటనే ఒకటి అమెరికాలో చోటు చేసుకుంది. కదులుతున్న రైలులో ఓ మృగాడు మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో రైలులో పదుల కొద్ది జనాలు ఉన్నారు.. కానీ ఒక్కరు కూడా దారుణాన్ని ఆపలేకపోయారు. కనీసం ఎమర్జెన్సీ నంబర్‌కు కూడా కాల్ చేయలేదు. ఆ వివరాలు.. (చదవండి: మీరొస్తే కూత.. మేమొస్తే కోత: కబడ్డీ ఆడిన భారత్-అమెరికా సైనికులు) కొన్ని రోజుల క్రితం బాధితురాలు 69 వ వీధి రవాణా కేంద్రం వైపు మార్కెట్-ఫ్రాంక్‌ఫోర్డ్ లైన్ మీదుగా రైలు ప్రయాణం చేస్తుంది. అదే ట్రైన్లో నిందితుడు ఫిస్టన్ ఎన్‌గోయ్ కూడా ఉన్నాడు. బాధితురాలి పక్కనే కూర్చుని ఉన్నాడు. రాత్రి పద గంటల ప్రాంతంలో ఈ ప్రయాణం చోటు చేసుకుంది. బాధితురాలి పక్కన కూర్చున్న ఫిస్టన్ పలుమార్లు ఆమెను అసభ్యకరంగా తాకాడు. ఆమె ప్రతిఘటించినప్పటికి అతడి తీరు మార్చుకోలేదు. ఆ సయమంలో ట్రైన్లో బాధితురాలితో పటు కొద్ది మంది ప్రయాణికులు కూడా ఉన్నారు. రైలులో ఉన్న ప్రయాణికులు ఫిస్టన్ అనుచిత చర్యలను చూస్తూ ఉన్నారు కానీ.. ఎవరు ముందుకు వచ్చి అతడిని వారించే ప్రయత్నం చేయలేదు. దాంతో మరింత రెచ్చిపోయిన ఫిస్టన్ ప్రయాణికులందరూ చూస్తుండగానే.. వారి ముందే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తనను కాపాడాల్సిందిగా ఎంత ప్రాధేయపడినా.. ఎవరు ఆమెకు సాయం చేయడానికి ముందుకు రాలేదు. చివరకు రైల్వే ఉద్యోగులు కూడా ఆమెకు సాయం చేయలేదు. కనీసం ఎమర్జెన్సీ నంబర్‌కు కూడా కాల్ చేయలేదు. ఆ తర్వాత రైలులోకి వచ్చిన ఓ వ్యక్తి జరిగిన దారుణాన్ని గుర్తించి పోలీసులకు కాల్ చేశాడు. (చదవండి: ఒంటరి మహిళలే టార్గెట్.. అలా 100 మందికి పైగా.. చివరికి ఇలా చిక్కాడు) ప్రస్తుతం పోలీసులు ఫిస్టన్‌ని అరెస్ట్ చేశారు. బాధితురాలిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ‘‘రైలులో ఈ దారుణం జరుగుతున్న సమయంలో అక్కడ డజన్ల కొద్ది ప్రయాణికులు ఉన్నారు. వారు కాస్త ధైర్యం చేసి ముకుమ్మడిగా ముందుకు వచ్చి ఉంటే నిందితుడు భయపడేవాడు.. బాధితురాలికి ఇంత అన్యాయం జరిగి ఉండేది కాదు. ఈ సంఘటన పట్ల మనందరం సిగ్గుపడాలి. ఒక్కడిని చూసి ఇంతమంది భయపడటం చాలా అవమానకరం’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. చదవండి: రన్నింగ్ ట్రైన్లో మహిళపై సామూహిక లైంగికదాడి.. అడ్డొచ్చినవారిని.. -
పాల కోసం ఎమర్జెన్సీ నెంబర్‌కు కాల్ చేసింది!
వాషింగ్టన్ : శాంతి భద్రతలు, పౌరులకు మెరుగైన రక్షణ, క్విక్ రెస్పాన్స్ విషయంలో అమెరికా పోలీసులు వహ్వా అనిపించారు. అర్ధరాత్రి సమయంలో ఓ మహిళ విన్నపాన్ని మన్నించి.. ఆమె బుజ్జి పాపాయికి పాలు, బేబీ ఫార్ములా తీసుకెళ్లి అందించారు. అమెరికాలో ఎమర్సెన్సీ నెంబర్ 911. ఆపత్కాలంలో ఈ నెంబర్‌కు డయల్ చేసి పోలీసుల సాయంతో బయటపడొచ్చు. యూఎస్‌లోని ఉత రాష్ట్రానికి చెందిన షానన్ బర్డ్‌కు జనవరి 28, అర్ధరాత్రి 2 గంటల సమయంలో తలెత్తిన పరిస్థితి కూడా అలాంటిదే. స్పందన కరువైంది..! నెలల తన బుజ్జి పాపాయికి బ్రెస్ట్ ఫీడ్ చేద్దామంటే షానన్ దగ్గర పాలు లేవు. ఇంట్లో ఉన్న పాలు కూడా అయిపోయాయి. పనిమీద వేరే ప్రాంతానికి వెళ్లిన భర్త కూడా ఆ సమయంలో అందుబాటులో లేడు. సమయమేమో అర్ధరాత్రి రెండవుతోంది. తన మిగతా పిల్లలు (నలుగురు) నిద్రిస్తూ ఉన్నారు. ఇక ఇరుగుపొరుగు వారి సాయం అడుగుదామంటే ఎవరూ స్పందించలేదు. అప్పటికే తన చిన్నారి కూతురు ఆకలితో గుక్కపెట్టి ఏడుస్తోంది. దాంతో, షానన్‌కు ఏం చేయాలో పాలు పోలేదు. ఇలా కాసేపు మానసిక వేదనకు గురైన ఆమెకు ఆపత్కాలంలో ఆదుకునే 911 గుర్తుకు వచ్చింది. వెంటనే 911కు కాల్ చేసి.. తన పరిస్థితిని పోలీసులకు విన్నవించింది. స్పందించిన లోన్ పీక్ ప్రాంత పోలీసులు ఓ పాల డబ్బా, బేబీ ఫార్ములాను తీసుకెళ్లి ఇచ్చారు. పోలీసుల సాయానికి కృతజ్ఞతలు తెలిపిన షానన్ తన బ్లాగులో ఈ వివరాలు వెల్లడించింది. ఇక అమెరికన్ పోలీసుల ఔదార్యం, షానన్ తెలివైన పనిపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. చిన్నారి ఆకలి తీర్చిన పోలీసులు సంతోష పడి ఉంటారని కొందరు, ‘మనసు’పెట్టి పనిచేసిన పోలీసులకు సెల్యూట్ అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. కష్టకాలంలోనూ బిడ్డ ఆకలి తీర్చగలిగిన అమ్మకు సలాం అని కొందరు నెటిజన్లు పేర్కొన్నారు. -
కలలో భార్యను చంపేశాడు.. కానీ!
వాషింగ్టన్: అమెరికాకు చెందిన ఓ వ్యక్తి చాలా విచిత్రంగా తన భార్యను హత్య చేశాడు. అయితే తాను మాత్రం కలలో భార్యను హత్య చేసి ఉండొచ్చునంటూ కథలు అల్లాడు. చివరికి కటకటాల పాలయ్యాడు. ఆ వివరాలిలా.. నార్త్ కరోలినాకు చెందిన మాథ్యూ జేమ్స్ ఫెల్ప్స్ కు గతేడాది నవంబర్‌లో లారేన్ ఫెల్ప్స్ (29)తో వివాహం జరిగింది. గత శుక్రవారం అర్ధారత్రి ఎమర్జెన్సీ నెంబర్ 911కు కాల్ చేసిన జేమ్స్.. తన భార్యను హత్య చేసినట్లుగా అనిపిస్తుందని అక్కడికి రావాలని దాదాపు ఆరు నిమిషాలు ఫోన్లో మాట్లాడాడు. అనంతరం ఎమర్జెన్సీ సర్వీస్ అధికారులతో పాటు పోలీసులు అక్కడికి వచ్చి లారెన్ మృతిచెందినట్లు నిర్ధారించారు. అనంతరం జేమ్స్‌ను అరెస్ట్ చేసి వేక్ కౌంటీ జైలులో హాజరు పరిచారు. పోలీసుల విచారణలో జేమ్స్ పలు ఆశ్చర్యకర విషయాలు వెల్లడించాడు. దగ్గు సమస్యతో ఉన్న తాను కొరిసిడిన్ టాబ్లెట్ వేసుకుని నిద్రపోయానని కొన్ని గంటల తర్వాత మెలకువ వచ్చి లైట్ ఆన్ చేసినట్లు చెప్పాడు. బెడ్ మీద రక్తపు మరకులున్నాయని, పక్కనే కత్తి ఉందని, తన భార్య లారేన్ రక్తపు మడుగులో పడి ఉందని విచారణలో వెల్లడించాడు. భార్య అంటే తనకు చాలా ఇష్టమని, ఆమెను హత్య చేయాల్సిన అవసరం లేదన్నాడు. టాబ్లెట్ డోస్ ఎక్కువైందని, దాని ప్రభావం వల్ల తనకు తెలియకుండా కలలోనే భార్యను హత్య చేసి ఉండొచ్చునని, ఇదే విషయాన్ని ఎమర్జెన్సీ సర్వీస్‌కు కాల్ చేసి చెప్పినట్లు వివరించాడు. ఉద్దేశపూర్వకంగా భార్యను హత్యచేసి జేమ్స్ కట్టుకథలు చెబుతున్నాడని పోలీసులు వివరించారు. -
ఓనర్ ప్రాణాలు కాపాడిన సూపర్ డాగ్ !
ఫిలడెల్ఫియా: విశ్వాసం అనే పదం వినగానే శునకం గుర్తొస్తుంది. ఎందుకుంటే వాటి యజమాని, వారి కుటుంబసభ్యులకు ఆపద తలెత్తితే అవి చురుకుగా స్పందిస్తాయన్న విషయం తెలిసిందే. తాజాగా అలాంటి సంఘటన ఒకటి ఫిలడెల్ఫియాలో చోటుచేసుకుంది. అంధుడైన యజమానిని రక్షించి ఒక్కసారిగా ఓ శునకం హీరో అయింది. ఫిలడెల్ఫియాకు చెందిన ఓ వ్యక్తి ఇంటికి ప్రమాదవశాత్తూ నిప్పంటుకుంది. అంధుడు, వృద్ధుడైన ఆ వ్యక్తి ఇంట్లో చిక్కుకుపోయాడు. ఆ సమయంలో కుటుంబసభ్యులు ఇంట్లో లేరు. విషయాన్ని గమనించిన అతడి పెంపుడు కుక్క యోలాండా వెంటనే స్పందించింది. ఎమర్జెన్సీ నెంబర్ 911కు కాల్ చేసి మొరగటం ప్రారంభించింది. ఏదో జరిగి ఉంటుందని అనుమానం వచ్చిన ఫైర్ సిబ్బంది సమయానికి ఘటనా స్థలానికి చేరుకుని అంధుడైన యజమానిని రక్షించారు. తన పెంపుడు శునకం తనను కాపాడటం ఇందో మూడోసారి అని ఓనర్ తెలిపాడు. 2013లో దొంగల బారినుంచి ఒకసారి, 2015లో టూర్‌కు వెళ్లగా స్పృహతప్పి పడిపోగా, అప్పుడు కూడా ఎమర్జెన్సీ నెంబర్ 911కు కాల్ చేసి యజమాని ప్రాణాలు రక్షించింది. మరోసారి ఓనర్‌ను కాపాడి స్థానికులతో శభాష్ అనిపించుకుంది యోలాండా.