NSP lands
-
‘ఎన్నెస్పీ’ స్పీడు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం నగర నడిబొడ్డున గల ఎన్నెస్పీ భూముల విక్రయ ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. నెల రోజుల క్రితం ఖమ్మంలోని ఎన్నెస్పీ కాలనీలో గల భూములను విక్రయించాలని భావించిన అధికారులు దీనికి సంబంధించి సమగ్ర సమాచారాన్ని ప్రభుత్వానికి పంపే పనిలో నిమగ్నమయ్యారు. ఈ భూములను ఏ విధంగా ఎవరికి విక్రయించాలనే అంశంపై ప్రభుత్వ స్థాయిలో ఇప్పటి వరకు విధి విధానాలు ఖరారు కానప్పటికీ ఎన్నెస్పీ అధికారులు మాత్రం క్షేత్రస్థాయి నివేదికలను సిద్ధం చేసి, భూముల విక్రయానికి అవసరమైన నివేదికను ఉన్నతాధికారులకు అందజేశారు. ఎన్నెస్పీ క్యాంప్‌లో ‘ఏ’ నుంచి ‘ఎఫ్’ టైపు వరకు గల దాదాపు 450 క్వార్టర్లలో ఇప్పటి వరకు ఎవరెవరు నివసిస్తున్నారు.. ఎవ రి పేరుతో క్వార్టర్ కేటాయించారు.. అందులో నడుస్తున్న సేవా సంస్థలు, నివసిస్తున్న ప్రజాప్రతినిధులు.. వారు చెల్లించాల్సిన అద్దె బకాయిలు వంటి పూర్తి వివరాలను ఎన్నెస్పీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. ఇందులో జిల్లాలోని పలు నియోజకవర్గాలకు ప్రాతి నిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు, జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలకు క్వార్టర్లు కేటాయించారని, వారు సక్రమంగానే అద్దె చెల్లిస్తున్నందున పెద్దగా బకాయిలు లేవని నివేదికలో పేర్కొన్నారు. ప్రభుత్వం ఎన్నెస్పీ భూముల విక్రయానికి నిర్ణయం తీసుకుంటే.. ప్రస్తుతం క్వార్టర్లలో ఉన్న వారికే తొలి ప్రాధాన్యం దక్కేలా నివేదిక రూపొందించినట్లు ఉందని కొందరు రిటైర్డ్ ఉద్యోగులు, మరికొందరు ఎన్నెస్పీ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, రిటైర్డ్ అధికారుల ఆధీనంలో న్యూ క్యాంప్ కాలనీలో 11 ‘సి’ టైపు క్వార్టర్లు, 71 ‘డి’ టైపు క్వార్టర్లు, 77 ‘ఇ’ టైపు క్వార్టర్లు ఉన్నట్లు గుర్తించారు. అలాగే ఓల్డ్ క్యాంప్ కాలనీలో సైతం టైప్ల వారీగా రిటైర్డ్ ఉద్యోగులు, ప్రస్తుత ఉద్యోగులు, రాజకీయ నేతలు ఎవరెవరు ఉంటున్నది సమగ్రంగా వివరించారు. అయితే రిటైర్డ్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నట్లుగా ఈ భూములను విక్రయిస్తే వారికి తొలి ప్రాధాన్యత ఇస్తారా.. లేదా అనే అంశం మాత్రం ప్రభుత్వ స్థాయిలో తేల్చాల్సి ఉంది. ఈ కాలనీలో 7 ప్రైవేట్సంస్థలు, 22 మంది ప్రైవేట్ వ్యక్తులు, నాలుగు ప్రభుత్వ కార్యాలయాలు, 37 మంది ఇతర శాఖలకు సంబంధించిన వారు, 77 మంది ఎన్నెస్పీ ఉద్యోగులు పనిచేస్తున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. ఇందులో ఉన్న క్వార్టర్లలో 54 పూర్తిగా శిథిలమైనట్లు నివేదించిన అధికారులు దాదాపు 237 క్వార్టర్లు ఖాళీగా ఉన్నాయని వివరించారు. కాగా, ఎన్నెస్పీ భూములను విక్రయించడం దాదాపు ఖాయమన్న భావన కలిగించేలా ఈ నివేదిక ఉండటంతో ఆ భూములను సేవా రూపంలో కాజేసేందుకు బడాబాబుల అండదండలున్న కొందరు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. -
‘క్యాంప్’పై కన్ను
* ఖరీదైన భూములపై పెద్దల చూపు * ఎన్నెస్పీ స్థలాల కోసం యత్నం * తమకే కేటాయించాలని ఉద్యోగుల డిమాండ్ * బహిరంగ వేలం వేస్తామంటున్న ఇరిగేషన్ అధికారులు * ‘సేవా’ ముసుగులో తన్నుకు పోయే కుట్రలు * రాష్ట్రస్థాయిలో కేటాయింపుల కోసం రియల్టర్ల ఎత్తులు సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం నగర నడిబొడ్డున ఉన్న ఖరీదైన ప్రభుత్వభూములపై బడాబాబుల కన్నుపడింది. రాజకీయ నేతల తో ఉన్న కాస్తోకూస్తో పరిచయాలనే పెట్టుబడిగా ఎన్నెస్పీ భూములను కొల్లగొట్టేందుకు కొందరు పెద్దలు, మరికొందరు రియల్టర్లు విశ్వయత్నాలు చేస్తున్నారు. చేతికి మట్టి అంటకుండా సేవా ముసుగులో ఎన్నెస్పీ భూములను హస్తగతం చేసుకునేందుకు కుటిలయత్నాలు చేస్తున్నారు. నగరంలోని ఎన్నెస్పీ క్యాంపులో గల క్వార్టర్స్ భూములను విక్రయించాలని ప్రభుత్వ అధికారులు నుంచి ప్రకటన వెలువడిందో లేదో ఈ రాబందులు తమ యత్నాలను ముమ్మరం చేశారు. కోట్లాది రూపాయల విలువ చేసే భూములను కారుచౌకగా కొట్టేసేందుకు మంత్రాంగం మొదలుపెట్టారు. రాజకీయ అండ తోడైతే తిరుగులేదన్న భావనతో రియల్టర్లు అందివచ్చిన అవకాశాన్ని తమకు అనుకూలంగా మల్చుకునేందుకు యత్నిస్తున్నారు. సేవా ముసుగులో... బహిరంగవేలమైతే తమ ఆటలు సాగుతాయో, లేదోననే ఉద్దేశంతో కొందరు రియల్టర్లు నిబంధనలను తమకు అనుకూలంగా మల్చుకునేందుకు పాట్లు పడుతున్నారు. సేవా సంస్థలు, సామాజిక సేవా సంఘాల పేరుతో వేలానికి ముందే ప్రభుత్వం నుంచి జీవోలు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. తమ సేవా కార్యక్రమాలను గుర్తుచేస్తూ ఎప్పుడో రిజిస్టరైన తమ సేవా సంస్థల కాగితాల దుమ్ముదులుపుతున్నారు. ఈ ధూళి కాగితాలే కోట్ల రూపాయల విలువైన భూమిని తెచ్చిపెడతాయనే విశ్వాసంతో కొందరు బడాబాబులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. తమ అర్జీలు కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్నాయనే పేరుతో వాటికి సత్వరం మోక్షం లభించేలా చూడాలని రాజధానికి వెళ్లి అధికార పార్టీ నేతల చుట్టూ తిరుగుతున్నారు. విధివిధానాలు ఖరారు కాకముందే... ఎన్నెస్పీ భూముల విక్రయానికి ప్రభుత్వం విధివిధానాలను ఖరారు చేయకముందే మొదలైన ఈ హడావిడిని చూసి క్వార్టర్లలో ఉంటున్న ఉద్యోగులు కంగారు పడుతున్నారు. దశాబ్దాల పాటు ఎన్నెస్పీకి సేవలందించిన తమకు ఎక్కడా సొంత గూడులేదని, తాము నివసిస్తున్న క్వార్టర్లను తమకే ఇవ్వాలని రిటైర్డ్ ఉద్యోగులు కోరుతున్నారు. ప్రస్తుత ఉద్యోగులు కూడా ఇదే విషయమై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వాల హామీలపై ప్రశ్నిస్తున్నారు. క్వార్టర్లను కాజేసే యత్నం... ఖమ్మం కార్పొరేషన్ నడిబొడ్డున నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు సంబంధించి 94 ఎకరాల 29 కుంటల భూమి ఉంది. సాగర్ కాలువల నిర్మాణాన్ని పురస్కరించుకొని దాదాపు 50 సంవత్సరాల క్రితం ఈ భూమిని ప్రభుత్వం ఇరిగేషన్ శాఖకు కేటాయించింది. ఖమ్మం కేంద్రంగా సాగర్ కాలువల నిర్మాణంలో పాల్గొన్న ఉద్యోగులు, కార్మికులకు ఇందులో కొన్ని క్వార్టర్లను నిర్మించి ఇచ్చారు. మొత్తం 722 క్వార్టర్లను నిర్మించారు. వీటిలో ఇప్పటికే 512 క్వార్టర్లు శిథిలావస్థకు చేరాయి. మరో 8 క్వార్టర్లు పూర్తిగా శిథిలమయ్యాయి. మిగిలిన 202 క్వార్టర్లలో మాత్రమే ఉద్యోగులు నివసిస్తున్నారు. వీటిలో ఇప్పటికే దాదాపు 10 క్వార్టర్లలో పలు పార్టీలకు చెందిన నేతలు క్యాంపు కార్యాలయాల పేరుతో తిష్టవేశారు. వీరిని ఖాళీ చేయించే విషయంలో ఎన్నెస్పీ, రెవెన్యూ అధికారులు చేతులు ఎత్తేశారు. తాజాగా ఎన్నెస్పీ అధికారుల చేతుల్లో ఉన్న భూములను కాపాడుకోవడం వారికి తలకుమించిన భారంగా మారింది. కోట్ల రూపాయల విలువైన ఈ స్థలాల్లో ఇప్పటికే 5 ఎకరాల 31 కుంటల భూమి ఆక్రమణకు గురైనట్లు అధికారికంగా చెబుతున్నారు. ఇవి కాకుండా 39 ఎకరాల 2 గుంటల భూమి పలు కారణాలు చూపి ప్రభుత్వం నుంచి ఇతరులు కేటాయింపులు చేయించుకున్నారు. నగరం విస్తరించడం.. ఎన్నెస్పీ క్యాంప్ నగరం నడిబొడ్డు అవడంతో ఈ స్థలాలపై బడాబాబుల కన్ను పడింది. ఏదో రకంగా వీటిని దక్కించుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఏకంగా ఈ స్థలాలను వేలం వేయడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుందనే ప్రతిపాదనలు ఇరిగేషన్ అధికారులు ముందుకు తీసుకువచ్చారు. ఎటువంటి ఆక్రమణలు లేకుండా ఉన్న 40 ఎకరాల భూమిని వేలం వేసేందుకు కూడా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీనివల్ల సుమారు రూ.400 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని వారు భావిస్తున్నారు. అయితే ఈ నిర్ణయాన్ని అన్ని ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. తెరచాటు యత్నాలు... ఎన్నెస్పీ స్థలాలపై ఎప్పటినుంచో కన్ను వేసిన పెద్దలు ఇప్పుడు వేలం ప్రతిపాదనలతో ఒకింత ఆందోళనకు గురవుతున్నారు. బహిరంగ వేలంలో దక్కించుకోవడం కన్నా చక్రం తిప్పి ఏదో ఒక రకంగా కేటాయింపులు చేసుకోవచ్చుననే భావన పలువురిలో వ్యక్తమవుతోంది. ఈ మేరకు జిల్లాకు చెందిన కొందరు రాజకీయ నేతలు, బడా కాంట్రాక్టర్లు ఓ మంత్రి సహకారాన్ని కోరుతూ మంతనాలు కూడా ప్రారంభించినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఓ బడా కార్పొరేట్ సంస్థ, అలాగే రియల్ఎస్టేట సంస్థలు కూడా రంగంలోకి దిగాయి. ఉన్నతస్థాయిలో ఈ భూములను తమకు కేటాయించేలా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదే క్వార్టర్లలో సుమారు 50 ఏళ్లుగా ఉంటూ పద వీ విరమణ పొందిన ఉద్యోగులు, మాజీ కార్మికు లు మాత్రం ఈ క్వార్టర్స్‌ను తమకే కేటాయించాలని పట్టుబడుతున్నారు. ఇప్పటికే శిథిలావస్థకు చేరిన క్వార్టర్లను తమకు కేటాయిస్తే ఆ స్థలంలో ఇళ్లు నిర్మించుకుంటామని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజోపయోగం పక్కదోవ... ఖమ్మంలోని విలువైన ప్రభుత్వ భూములను ప్రజోపయోగ కార్యక్రమాలకు వినియోగించాలని గతంలో అనేకమంది కలెక్టర్లు ప్రయత్నించారు. కానీ పై స్థాయి నుంచి ఒత్తిడి రావడం వల్ల అది కార్యరూపం దాల్చలేదు. ఆర్టీసీ బస్టాండ్ ఇరుకుగా ఉండటంతో దానిని ఎన్నెస్పీ క్యాంప్‌లోకి మార్చాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉన్నా.. దాన్ని ఆచరణలో పెట్టలేదు. ఖమ్మం మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ స్థాయికి విస్తరించడంతో నగరపాలక సంస్థ కార్యాలయాన్ని కూడా ఇక్కడే నిర్మించాలని గత కలెక్టర్ భూములను పరిశీలించారు. కానీ అది కూడా కార్యరూపం దాల్చకుండా బడాబాబులు పావులు కదిపారు. ఇలా ఏదో ఒక ప్రజపయోగ కార్యక్రమం చేపడుదామన్న ప్రతిసారీ వివిధ కారణాలను చూపి పెద్దలు అడ్డుకుంటున్నారు.