ప్రజాసేవే అమరులకు నిజమైన నివాళి
పోలీస్ అమరవీరుల సంస్మరణ సభలో కలెక్టర్
నెల్లూరు(క్రైమ్): అవినీతి, అక్రమాలకు దూరంగా ఉంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే పోలీస్ అమరవీరులకిచ్చే నిజమైన నివాళి అని కలెక్టర్ ఎన్.శ్రీకాంత్ అన్నారు. జిల్లా పోలీసు కవాతు మైదానంలో మంగళవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం కూడా పోలీసుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని చెప్పారు.
ఎస్పీ ఎస్.సెంథిల్‌కుమార్ మాట్లాడుతూ సమాజంలో శాంతిభద్రతలను మెరుగుపరిచి, ప్రజలకు చేరువకావడమే అమరవీరులకిచ్చే నిజమైన నివాళి అన్నారు. ఏఎస్పీ రెడ్డి గంగాధర్ విధి నిర్వహణలో ఈ ఏడాది దేశవ్యాప్తంగా మృతిచెందిన 643 మంది పోలీసు అమరవీరుల పేర్లను చదివి వారికి నివాళులర్పించారు. అనంతరం జిల్లాలో ఈ ఏడాది మృతి చెందిన ఎనిమిది మంది అమరుల కుటుంబాలకు, పోలీసు బాయిస్ హాస్టల్లోని విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేశారు.
ఘన నివాళి
పోలీసు కవాతు మైదానంలోని అమరవీరుల స్తూపం వద్ద కలెక్టర్ శ్రీకాంత్, ఎస్పీ ఎస్.సెంథిల్‌కుమార్, మేయర్ అబ్దుల్ అజీజ్, నెల్లూరు నగర, గ్రామీణ, సూళ్లూరుపేట, గూడూరు శాసనసభ్యులు పోలుబోయిన అనీల్‌కుమార్‌యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, పాశం సునీల్‌కుమార్, ఏఎస్పీ గంగాధర్ , నెల్లూరు నగర, గ్రామీణ, హోమ్గార్డ్స్, ఎస్బీ డీఎస్పీలు పి.వెంకటనాథ్‌రెడ్డి, వి.ఎస్.రాంబాబు, శ్రీనివాసరావు, బి.వి రామారావు, పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు మద్దిపాటి ప్రసాదరావు తదితరులు పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించారు.
అనంతరం అమరవీరుల స్మృత్యర్థం పెరేడ్ నిర్వహించారు. పెరేడ్ గ్రౌండ్ నుంచి గాంధీబొమ్మ వరకు ర్యాలీ చేపట్టారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖన తదితర పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను దక్కించుకున్న సాంబశివరావు(ఎస్సై,నెల్లూరు రెండో నగరం), బి.శ్రీనివాసరావు(ఎస్సై, ఎస్బీ), జి.అజయ్‌కుమార్(ఎస్సై, గూడూరు ఒకటో పట్టణం)కు కలెక్టర్ నగదు పురస్కారాలు, ప్రశంసా పత్రాలను అందజేశారు. విద్యార్థులు వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచి కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందుకున్నారు.