స్నేహితులే.. ప్రాణం తీశారు
ఎన్టీపీసీ ఆటోనగర్‌కు చెందిన ఇప్ప చక్రధర్ హత్యకేసులో మిస్టరీ వీడింది. ఓ అమ్మాయిని ప్రేమించిన ‘పాపానికి’ అతడి నిండు జీవితం బలైంది. తన కుమార్తెను చక్రధర్ ప్రేమించడం ఇష్టం లేని అమ్మాయి తండ్రే కిరాయి హంతకుల చేత అతడి ప్రాణాలు తీయించాడు. డబ్బులకు లొంగిపోయి చక్రధర్ స్నేహితులే దగ్గరుండి అతడిని దారుణంగా హత్యచేయించారు. జిల్లాలో సంచలనం సృష్టించిన ఈ హత్యకేసును పోలీసులు పది రోజుల్లో ఛేదించారు. మొత్తం తొమ్మిది మంది నిందితులను ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్‌లో శనివారం అరెస్టు చూపించారు. గోదావరిఖని డీఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి వెల్లడించిన వివరాలు..
గోదావరిఖని, న్యూస్‌లైన్ : గోదావరిఖని అశోక్‌నగర్‌లో నివాసముండే డెల్టా సెక్యూరిటీ సర్వీసెస్ సంస్థను నిర్వహించే వాహెద్‌బేగ్ కుమార్తె అస్మా ఎన్టీపీసీలోని సచ్దేవ పాఠశాలలో చదివేది. అదే పాఠశాలలో ఎన్టీపీసీ ఆటోనగ ర్లో నివాసముండే ఇప్ప చక్రధర్ ఉరఫ్ కన్నయ్య(22) చదివేవాడు. ఇద్దరు ఒకే తరగతి కాకపోయినప్పటికీ వీరిమధ్య స్నేహం ఏర్పడి ప్రేమగా మారింది.
చక్రధర్ తండ్రి పెంటయ్య సింగరేణిలో కార్మికుడిగా పనిచేస్తూ అనారోగ్యంతో మరణించగా, 2011లో ఆయన ఉద్యోగాన్ని కుమారుడికి ఇచ్చారు. చక్రధర్ బెల్లంపల్లిలోని శాంతిగనిలో ఉద్యోగం చేస్తుండగా.. అస్మా గోదావరిఖనిలోని ఓ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. 2012 సెప్టెంబర్ 14న అస్మాను తీసుకుని చక్రధర్ వెళ్లగా ఆమె తండ్రి వాహెద్‌బేగ్ ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్‌లో కిడ్నాప్ కేసు పెట్టాడు. అదే నెల 25న చక్రధర్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపించగా, కొద్ది రోజుల తర్వాత బెయిల్‌పై వచ్చాడు. 2014 జనవరి 20న ఆస్మా
మైనారిటీ తీరుతుండగా ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని వీరిద్దరు నిర్ణయించుకున్నారు. తరచుగా ఫోన్లో మాట్లాడుకోవడంతో ఇది తండ్రి వాహెద్బేగ్కు నచ్చక వీరికి పెళ్లి అయితే తన పరువు పోతుందని భావించి చక్రధర్‌ను హత్య చేయించాడు.
కిరాయి హంతకులు..
చక్రధర్‌ను చంపేందుకు వాహెద్‌బేగ్ ఎన్టీపీసీలో నివాసముండే దాసరి ఆనంద్ సహకారంతో అదే ఏరియాలో ఉండే తమిళనాడుకు చెందిన మణి అనే వ్యక్తికి కొంత డబ్బు ముట్టజెప్పాడు. కొద్దిరోజుల తర్వాత తాను ఈ హత్య చేయలేనని మణి చెప్పడంతో వాహెద్‌బేగ్ ఓ పత్రికలో(సాక్షి కాదు) విలేకరిగా పనిచేస్తూ పంచాయితీలు చేస్తున్న సంగెపు రాంచంద్రంను సంప్రదించాడు. ఈ హత్యకు మొత్తం రూ.4లక్షలు సుఫారీ ఇచ్చేందుకు మాట్లాడుకున్నారు. అందులో హత్య చేసిన వారికి రూ.2లక్షలు, పథకం రచించిన వారికి రూ.2 లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. ముందుగా చక్రధర్ స్నేహితులైన కంది గాంధీ, కె.విజయ్తకు కొంత డబ్బు ఇచ్చి హత్యకు పురమాయించారు. వీరితో ఆ పని సాధ్యపడకపోవడంతో చక్రధర్‌ను ప్రాణాలతో అప్పగించాలని కోరగా.. ఆ ఇద్దరు అంగీకరించారు.
పథకం ప్రకారం దారుణం..
చక్రధర్ నెల రోజులుగా ఇంటివద్దే ఉంటూ డ్యూటీకి వెళ్లకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. చేతిలో డబ్బులు లేకపోవడంతో సెల్‌ఫోన్ అమ్మివేయడంతోపాటు బైక్‌ను అమ్మివేసేందుకు సిద్ధమయ్యాడు. ఈక్రమంలో ఈ నెల 18న చక్రధర్‌ను విజయ్, గాంధీ గోదావరి ఖని బస్టాండ్ వద్దనున్న మద్యం దుకాణం వద్ద కు తీసుకొచ్చి మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అతిగా మద్యం తాగించారు. తర్వాత బస్టాండ్ సమీపంలోని చెట్లపొదల్లో చీకటిపడే వరకు మళ్లీ మద్యం తాగించారు. ఈలోగా హత్యా పథకం వ్యూహకర్త రాంచంద్రం బెల్లంపల్లికి చెందిన తన స్నేహితుడైన బండి రాజుకు పనిని అప్పగించాడు. రాజు తన స్నేహితులైన బెల్లంపల్లికే చెందిన గుర్రం అశోక్, సుల్తానాబాద్‌కు చెందిన చెల్ల రమేష్, అదే మండలం నీరుకుల్లకు చెందిన వనపర్తి సతీష్‌ను ఫోన్ ద్వారా సంప్రదించి పథకం గురించి చెప్పాడు. వెంటనే వీరంతా ఎన్టీపీసీకి చేరుకున్నారు.
చక్రధర్ మ ద్యం మత్తులో ఉండడంతో అతడిని ఆదిలాబా ద్ జిల్లా శ్రీరాంపూర్ ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేయడానికి పథకం వేశారు. అది సాధ్యం కాకపోవడంతో తిరిగి ఎన్టీపీసీ వద్దనే హత్యకు వ్యూ హం పన్నారు. చక్రధర్‌ను అక్కడికి తీసుకురావాలని గాంధీ, విజయ్‌లకు సూచించారు. ఎన్టీపీసీ మార్కెట్ వెనకాల వ్యభిచారం చేస్తూ ఓ జంట ఉందని, వారిని బెదిరించి మనం కూడా ఎంజాయ్ చేద్దామని గాంధీ, విజయ్ తన స్నేహితుడైన చక్రధర్‌ను నమ్మించారు. రాత్రి 9.30 గంటల సమయంలో అతడిని తీసుకుని మార్కెట్ గోడ వెనుకవైపు తీసుకెళ్లి.. అక్కడున్న బండి రాజు, గుర్రం అశోక్, చెల్ల రమేష్, వనపర్తి సతీష్‌లకు అప్పగించారు. అక్కడ జంట ఉందని నమ్మించేందుకు వీరిలో ఒకరు అమ్మా యి మాదిరిగా చున్నీ ధరించాడు. అనంతరం అదే చున్నీని చక్రధర్ గొంతుకు బిగించారు. అక్కడే ఏదైనా చెట్టుకు ఉరివేసుకుని చనిపోయాడని నమ్మించాలనుకునే క్రమంలో ‘ఏందిరా గాంధీ ఇది... నన్ను చంపొద్దు’ అంటూ చక్రధర్ గట్టిగా అరిచాడు. దీంతో రాజు, సతీష్ కలిసి మరింత గట్టిగా గొంతుకు ఉరివేసి, ఆ తర్వాత కత్తితో గుండెభాగంలో పొడిచి, గొంతుకోశారు. తర్వాత అక్కడున్న సిమెంట్ ఇటుకలతో తలపై మోదారు. చక్రధర్ చనిపోయాడని నిర్ధారించుకుని పరారయ్యారు.
తొమ్మిది మంది అరెస్ట్... రిమాండ్
చక్రధర్ హత్యకు వాహెద్‌బేగ్ సుపారీ (కిరాయి హత్య) మాట్లాడుకోగా, అందులో చక్రధర్ స్నేహితులైన గాంధీ, విజయ్‌లకు మొదటగా రూ.38 వేలు, తర్వాత రూ.8 వేలు ఇచ్చాడు. ఈ హత్యకు పథకం పన్నిన రాంచంద్రంకు రూ.50 వేలు ఇచ్చాడు. మిగతా డబ్బులను శనివారం ముట్టజెపుతానని చెప్పడంతో నిందితులు గోదావరిఖని ప్రాంతానికి వచ్చారు. వీరిలో వాహెద్‌బేగ్, ఆనంద్‌ను ఎన్టీపీసీలో, గాంధీ, విజయ్‌లను గోదావరిఖని బస్టాండ్ వద్ద, రాజు, సతీష్‌లను రామగుండం బీ-పవర్‌హౌస్ వద్ద, రాంచంద్రంను పవర్‌హౌస్‌కాలనీలోని అతడి ఇంట్లో అరె స్ట్ చేసినట్లు డీఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
వీరిలో సుల్తానాబాద్‌కు చెందిన సతీష్‌పై ఇరవై దొంగతనం కేసులున్నాయని, ఆనంద్, గాంధీలపై రౌడీషీట్ ఉందని చెప్పారు. నిందితులందరిపై రౌడీషీట్ నమోదు చేస్తామని డీఎస్పీ పేర్కొన్నారు. చిన్నపాటి డబ్బుకోసమే స్నేహితుడి హత్యకు సహకరించడం అత్యంత హేయమైన చర్య అని అన్నారు. ఈ హత్యకు రాజకీయ రంగుపులిమి పోలీసులను ఇబ్బందులపాలు చేయడానికి ప్రయత్నించారని, ఇది సరైంది కాదని అన్నారు. నేరం చేసిన వారికి చట్టప్రకారం శిక్ష తప్పదన్నారు. పది రోజుల్లోనే ఈ హత్య కేసు మిస్టరీని ఛేదించేందుకు కృషి చేసిన రామగుండం సీఐ నారాయణ, మంథని ఎస్సై ఉపేందర్, రామగుండం ఎస్సై ఎల్.శ్రీను, కానిస్టేబుళ్లు దుబాసి రమేష్, దేవేందర్, కనకయ్య, హోంగార్డులు శ్రీను, కిష్టయ్యలను డీఎస్పీ అభినందించారు.