ntr death day ceromany
-
టీడీపీ నాయకుల మధ్య వాగ్వాదం
కూడేరు : మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు వర్ధంతి కార్యక్రమంలో టీడీపీ నాయకుల మధ్య విబేధాలు బయటపడ్డాయి. ఎన్టీఆర్ చిత్రపటానికి టెంకాయ కొట్టమని కూడేరు సర్పంచ్ ఓబుళపతిని ఆ పార్టీ బీసీ సెల్ మాజీ జిల్లా కార్యదర్శి బాస్కర్‌గౌడ్, మరి కొందరు సూచించారు. దీనిపై తెలుగు యువత జిల్లా కార్యదర్శి కుసాల నాగరాజు అభ్యంతరం తెలిపారు. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం కుసాలు నాగరాజు పార్టీ జెండా ఆవిష్కరణకు సిద్ధం కాగా భాస్కర్ గౌడ్ అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారి మధ్య వాగ్వాదం పెరిగి కొట్టుకునే స్థాయికి చేరుకుంది. వెంటనే నాయకులు కల్పించుకొని వారిని శాంతింపచేశారు. -
కదిరిలో ‘తమ్ముళ్ల’ గొడవ
కదిరి టౌన్ : అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గ టీడీపీ సమన్వయ కమిటీ సమావేశ ఫ్లెక్సీలో స్థానిక ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా ఫొటో లేకపోవడం గొడవకు దారి తీసింది. ఫ్లెక్సీలో ఎమ్మెల్యే ఫొటో ఎందుకు వేయలేదని అడిగినందుకు మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అనుచరులు అత్తార్ వర్గీయుడిపై దాడి చేశారు. ఈమేరకు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాలిలా ఉన్నాయి. కదిరి బైపాస్‌రోడ్డులోని ఓ ప్రైవేటు భవనంలో బుధవారం టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఇందుకు ఎమ్మెల్యే చాంద్‌బాషాను కూడా ఆహ్వానించారు. అత్తార్ వచ్చి కాసేపు ఉండిపోయారు. సమావేశం ముగియగానే బయటకు వచ్చిన అత్తార్ అనుచరుడు గురురాజు ఫ్లెక్సీలో ఎమ్మెల్యే ఫొటో ఎందుకు వేయలేదని అనడంతో నల్లచెరువుకు చెందిన రాజు, నాగరాజు వాగ్వాదానికి దిగారు. ఇది తారస్థాయికి చేరి గురురాజుపై వారిద్దరూ దాడికి దిగారు. అక్కడే ఉన్న కొందరు టీడీపీ కార్యకర్తలు గొడవను సద్దుమణిచేందుకు ప్రయత్నించారు. చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి అందరినీ పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మరోవైపు ఈ ఘటనపై కేసులు లేకుండా ఇరువర్గాలను రాజీ చేసేందుకు నాయకులు ప్రయత్నిస్తున్నారు.