కళాకారుల్లోని ప్రతిభను గుర్తించాలి
► రాష్ట్ర మహిళా కమిషన్ చైన్పర్సన్ నన్నపనేని రాజకుమారి
► పలువురికి ఎన్టీఆర్ పురస్కారాల ప్రదానం
విజయవాడ కల్చరల్: కళాకారులలోని ప్రతిభను గుర్తించాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైన్ పర్సన్ నన్నపనేని రాజకుమారి సూచించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఎన్టీఆర్ పురస్కారాల సభను శ్రీసోమనాథ కల్చరల్ ఆర్ట్స్, ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ, దేశికా ఆర్ట్స్, అక్కినేని ఫౌండేషన్ సంస్థలు దుర్గాపురంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో నిర్వహించాయి. ముఖ్య అతిథి రాజకుమారి మాట్లాడుతూ సాంస్కృతిక సంస్థలు కళాకారులలోని ప్రతిభను ప్రోత్సహించాలని సూచించారు. శాసనసభ్యుడు గద్దే రామ్మోహనరావు మాట్లాడుతూ సుదీర్ఘకాలం సినీ రంగంలో అద్భుతాలు సృష్టించిన ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రదానం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సభకు సీనియర్ పాత్రికేయుడు తుర్లపాటి కుటుంబరావు అధ్యక్షత వహించారు.
రీకనక దుర్గాసేవాసమితి వ్యవస్థాపకుడు కోగంటి సత్యం, దేశికా ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకులు మాసాబత్తుల శ్రీనివాస్, విద్యావేత్త డాక్టర్ ఎంసీ.దాస్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ అచ్చిరెడ్డి, సినీనటులు(లవకుశ ఫేమ్) నాగరాజు, నాగ సుబ్రహ్మమణ్యం, కొమ్మినేని భావన్నారాయణ, ప్రభల శ్రీనివాస్, తల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి, శింగంశెట్టి పెదబ్రహ్మం, మల్లాది రామకృష్ణ, అల్లూరి సత్యనారాయణరాజు, వెలిశెట్టి వెంకటేశ్వర్లు, మిమిక్రీ కళాకారుడు చందు, చప్పిడి సత్యనారాయణ తదితరులకు ఎన్టీఆర్ పురస్కారాలను ప్రదానం చేశారు. ఘంటసాల పవన్‌కుమార్ బృందం కూచిపూడి అంశాలను, మధిర రోజా ప్రసన్న ఈల ద్వారా పలు తెలుగు, హిందీ చిత్రగీతాలను ఆలపించారు. చందు మిమిక్రీతోనూ, ఆదినారాయణ శాస్త్రి పద్యాలతోనూ అలరించారు. కార్యక్రమాలను శ్రీసోమనాథ్ కల్చరల్ ఆర్ట్స్ వ్యవస్థాపకులు బోలిశెట్టి రాధాకృష్ణ పర్యవేక్షించారు.