nuclear arms
-
భారత్ కన్నాపాక్ వద్దే ఎక్కువ అణ్వస్త్రాలు!
న్యూఢిల్లీ: న్యూక్లియర్ వార్‌హెడ్స్ లెక్కలో మనకన్నా చైనా, పాకిస్థాన్ ముందంజలో ఉన్నాయని సిప్రి(స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్) నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నాటికి చైనా వద్ద 350, పాక్ వద్ద 165 అణ్వాస్త్రాలుండగా, భారత్ వద్ద 156 అణ్వాస్త్రాలున్నాయని తెలిపింది. మూడు దేశాలు తమ అణ్వస్త్ర సామర్ధ్యాన్ని పెంచుకునే పనిలో ఉన్నాయని వివరించింది. గతేడాది జనవరిలో చైనా, పాక్, భారత్ వద్ద వరుసగా 320, 160, 150 న్యూక్లియర్ వార్‌హెడ్స్ ఉన్నాయి. వీటిలో చైనా అణ్వాస్త్రాల ఆధునీకరణ, పెంపుదలలో ముందువరుసలో ఉందని నివేదిక తెలిపింది. సిప్రి ఇయర్ బుక్ 2021 ముఖ్యాంశాలు ► ప్రపంచంలో ప్రస్తుతం 9 దేశాలకు అణ్వస్త్ర సామర్ధ్యం ఉంది. అమెరికా, రష్యా, యూకే, ఫ్రాన్స్, చైనా, ఇండియా, పాకిస్తాన్, ఇజ్రాయెల్, ఉత్తరకొరియాల వద్ద అణ్వాయుధాలున్నాయి. ► ప్రపంచంలోని మొత్తం అణ్వాయుధాలు దాదాపు 13,080 కాగా, వీటిలో 90 శాతం పైగా అణ్వాయుధాలు అమెరికా, రష్యా వద్దనే ఉన్నాయి. ► అణ్వాయుధాల తయారీకి అవసరమైన ముడి పదార్ధంను ఫిస్సైల్ మెటీరియల్ అంటారు. అత్యంత శుద్ధిచేసిన యురేనియం లేదా సెపరేటెడ్ ప్లుటోనియంను మిస్సైల్ మెటీరియల్‌గా వాడతారు. ► ఇండియా, ఇజ్రాయెల్ ఎక్కువగా ప్లుటోనియంను ఉత్పత్తి చేస్తుండగా, పాకిస్తాన్ యురేనియం ఉత్పత్తి చేసుకుంటూ ప్లుటోనియం ఉత్పత్తి సామర్థ్యం పెంచుకునే పనిలో ఉంది. ► చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకే, యూఎస్‌లు రెండు రకాల మిస్సైల్ మెటీరియల్‌ను ఉత్పత్తి చేయగలవు. ► 13,080 అణ్వాయుధాల్లో సుమారు 2వేల అణ్వాయుధాలు వెనువెంటనే వాడేందుకు తయారుగా ఉండే స్థితిలో ఉన్నాయి. ► 2016–20 మధ్య కాలంలోమొత్తం ఆయుధాల దిగుమతుల పరంగా చూస్తే సౌదీ అరేబియా, ఇండియా, ఈజిప్టు, ఆస్ట్రేలియా, చైనాలు టాప్ 5 దిగుమతిదారులుగా ఉన్నాయి. ► ప్రపంచ ఆయుధ దిగుమతుల్లో సౌదీ వాటా 11 శాతం కాగా, భారత్ వాటా 9.5 శాతం. -
అణ్వాయుధాల విషయమై ఇమ్రాన్ ఖాన్ కీలక భేటీ!
ఇస్లామాబాద్: భారత వైమానిక దళం మెరుపుదాడులతో తీవ్ర ఇరకాటంలో పడిన పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ బుధవారం అణ్వాయుధాల విషయమై చర్చించడానికి.. ఆ దేశంలో అత్యున్నత నిర్ణాయక సంస్థ అయిన నేషనల్ కమాండ్ అథారిటీ (ఎన్సీఏ)తో భేటీ కాబోతున్నారు. అణ్వాయుధాల ప్రయోగం, వినియోగం, మోహరింపు, అణ్వాయుధాల పరిశోధన, అభివృద్ధి, వినియోగం.. అవసరాలకు తగినట్టు వాడుకోవడం తదితర వ్యవహారాలన్నింటినీ ఎన్సీఏ పర్యవేక్షిస్తుంది. భారత వైమానిక దాడుల నేపథ్యంలో మంగళవారం సమావేశమైన పాక్ జాతీయ భద్రతా కమిటీ (ఎన్ఎస్ఏ).. ఎన్సీఏ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రధాని ఇమ్రాన్‌ఖాన్.. అణ్వాయుధాల విషయమై ఎన్సీఏతో సమావేశం కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. పూల్వామా ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం మంగళవారం తెల్లవారుజామున మెరుపు దాడులు జరిపి.. పెద్ద ఎత్తున ఉగ్రవాదులను మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. -
అమెరికాపై ముషారఫ్ తీవ్ర వాఖ్యలు
వాషింగ్టన్: అమెరికాపై పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ తీవ్రంగా మండిపడ్డారు. తమ దేశాన్ని అమెరికా అవసరానికి వాడుకోని వదిలేస్తోందని దుయ్యబట్టారు. అణు ఆయుధాల విషయంలో కూడా భారత్, పాకిస్తాన్ మధ్య పక్షపాతం చూపుతోందని ఆరోపించారు. ‘వాయిస్ ఆఫ్ అమెరికా’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా భారత్‌తో కలిసి అమెరికా పనిచేస్తోందన్నారు. అణు కార్యక్రమాలను నియంత్రించమని చేయమని ఏ దేశం ఇండియాను అడగడంలేదని మండిపడ్డారు. భారత్‌ను ఎదుర్కొనడానికే పాకిస్తాన్ అణు దేశంగా మారిందని పేర్కొన్నారు. పాక్, భారత్ మధ్య శాంతికి నరేంద్ర మోదీ కృషి చేయడం లేదని లేదని దుయ్యబట్టారు. ‘నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు భారత్ ప్రధానులు అటల్ బిహార్ వాజ్‌పేయి, మన్మోహన్ సింగ్‌లతో మాట్లాడాను. వివాదాలను పరిష్కరించడానికి వారు, నేను కృషి చేశామ’ని ముషారఫ్ వెల్లడించారు. అమెరికా-పాకిస్తాన్ మధ్య సంబంధాలు ఎందుకు ఈ స్థాయిలో దిగజారాయని ముషారఫ్‌ను అడిగినపుడు ఆయన స్పందిస్తూ.. యుద్ధ కాలం నుంచి భారతదేశానికి అమెరికా బహిరంగంగానే మద్దతు పలుకుతోందన్నారు. ఇప్పుడు కూడా పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా అమెరికా తనంతట తాను భారతదేశం వైపు మొగ్గుతోందన్నారు. దీని వల్ల పాకిస్థాన్‌పై ప్రత్యక్ష ప్రభావం పడుతోందన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో భారతదేశం పాత్రను ఐక్యరాజ్యసమితి పరిశీలించాలని కోరారు. దేశ ద్రోహం కేసు ఎదుర్కొంటున్న ముషారఫ్ ప్రస్తుతం దుబాయ్‌లో ఉంటున్నారు. -
అమెరికాతో పోరాటం: కిమ్ జోంగ్ ఉన్ ప్రతిజ్ఞ..
సియోల్: తమ అణ్వాయుధ సంపత్తి గణనీయంగా పెంచుకున్న నేపథ్యంలో అమెరికాతో పోరాటంలో గెలిచి తీరుతామని ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ప్రతినబూనారు. వరుస అణ్వాయుధ పరీక్షలతో ఉత్తర కొరియా అంతర్జాతీయంగా ఉద్రిక్తతలను పెంచిపోస్తున్న సంగతి తెలిసిందే. గత నెల 29న అత్యంత దూరం ప్రయాణించగల ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ఐసీబీఎం)ని పరీక్షించడంతో అగ్రదేశాలు.. ఉత్తర కొరియాపై గుర్రుగా ఉన్నాయి. తాజా క్షిపణి అమెరికాలోని అన్ని నగరాలను చేరుకోగలదు. ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించిన నేపథ్యంలో ఇందులో పాల్గొన్న సిబ్బందితో కిమ్ మాట్లాడారు. ‘మన దేశం ప్రపంచంలోనే బలమైన అణ్వాయుధ శక్తిగా, సైనిక శక్తిగా అతిపెద్ద ముందడుగు వేసింది’ అని ఆయన అన్నారు. దేశ రక్షణ పరిశ్రమ అభివృద్ధి కొనసాగుతూనే ఉంటుందని, అమెరికాతో, సామ్రాజ్యవాదులతో పోరాటంలో మనం దేశం గెలిచి తీరుతుందని ఆయన చెప్పుకొచ్చారు. జీవన్మరణ పోరాటంలో ఎంతో మూల్యం చెల్లించి అణ్వాయుధ శక్తిగా ఎదిగేందుకు చేసిన ప్రయత్నం పూర్తయిందని తెలిపారు. ఉ. కొరియా తాజా చర్యలపై అంతర్జాతీయంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. కొరియా అణ్వాయుధ పరీక్షలకు బ్రేక్ పడేలా ఆ దేశంపై అత్యంత కఠినతరమైన ఆర్థిక, దౌత్యపరమైన ఆంక్షలు విధించాలని అమెరికా కోరుతోంది. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో బేషరతుగా ఉత్తర కొరియాతో చర్చలకు తాము సిద్ధమని ఆమెరికా విదేశాంగమంత్రి రెక్స్ టిల్లర్సన్ ప్రకటించారు. -
ఏ క్షణమైనా అణు యుద్ధం: కొరియా
ఐక్యరాజ్యసమితి: అమెరికా, ఉత్తర కొరియా మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఏ క్షణమైనా అణు యుద్ధం ముంచుకొస్తుందని ఐక్యరాజ్యసమితి ఉత్తర కొరియా డిప్యూటీ అంబాసిడర్ హెచ్చరించారు. తమ అణు, క్షిపణి కార్యకలాపాలు వ్యూహాత్మకంగా చేపడుతున్నవని, వీటిని నిలిపివేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. అమెరికా నుంచి అణు ముప్పు పూర్తిగా తొలిగేవరకూ తాము అణ్వాయుధాలు, బాలిస్టిక్ రాకట్లను వీడబోమని స్పష్టం చేశారు.మరోవైపు కొరియా అణు సంపత్తిని, క్షిపణి ప్రయోగాలను అధ్యక్షుడు కిమ్ సమర్థించుకున్నారు. 1970 నుంచి ప్రపంచంలో కేవలం ఉత్తర కొరియా మాత్రమే అమెరికా నుంచి నేరుగా అణు దాడులకు టార్గెట్‌గా ఉందని, ఆత్మరక్షణ కోసం తాము అణ్వాయుధాలను కలిగిఉండటం తమ హక్కని కిమ్ ఐరాస నిరాయుధీకరణ కమిటీకి స్పష్టం చేశారు. అణు పరీక్షలు ఏటా తాము నిర్వహించే మిలటరీ ఎక్సర్సైజ్ల్లో భాగమేనని, అయితే తమ అగ్రనాయకత్వాన్ని తొలగించేందుకు అమెరికా నిర్వహించే సీక్రెట్ ఆపరేషనే అన్నింటికన్నా ప్రమాదకరమని కిమ్ ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తం అమెరికా భూభాగం తమ ఫైరింగ్ రేంజ్లో ఉందని, తమ భూభాగంలో ఓ అంగుళంపైనా దండెత్తే దుస్సాహసానికి అమెరికా పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. -
భారత్‌పై అణుబాంబులతో పాక్ గురి!
న్యూఢిల్లీ : పాకిస్తాన్ భారీగా అణు ఆయుధాలు సిద్ధం చేసినట్లు రిపోర్టులు వస్తున్నాయి. దాదాపు 140 అణు ఆయుధాలను తయారు చేసిన పాకిస్తాన్ వాటిని దాచేందుకు రహస్య ప్రదేశంలో సొరంగాన్ని నిర్మిస్తున్నట్లు ఓ అంతర్జాతీయ వెబ్సైట్ పేర్కొంది. పాకిస్తాన్‌లోని మియన్‌వాలీ పట్టణంలో ఈ సొరంగాన్ని నిర్మించబోతున్నారని చెప్పింది. 10 మీటర్ల ఎత్తు, వెడల్పు కలిగిన మూడు సొరంగాలు పాకిస్తాన్ నిర్మణాల్లో ఉంటాయని తెలిపింది. ఈ ప్రదేశానికి లాంచర్లను తీసుకెళ్లేలా భారీ రోడ్లతో కలుపుతున్నట్లు వెల్లడించింది. మియన్‌వాలీ పట్టణాన్ని స్థావరంగా ఎంచుకోవడం వెనుక పెద్ద ఆలోచన ఉందని పేర్కొంది. మియన్‌వాలీ నుంచి పంజాబ్‌లోని అమృతసర్‌కు దూరం కేవలం 350 కిలోమీటర్లు. అదే న్యూఢిల్లీకైతే 750 కిలోమీటర్లు. తక్కువ దూరంలో అణు ఆయుధాలను అందుబాటులో ఉంచుకోవడం ద్వారా శత్రువును చావుదెబ్బ కొట్టాలనే వ్యూహం పాకిస్తాన్ పన్నినట్లు తెలుస్తోంది. -
కిమ్, ట్రంప్‌లు మరీ చిన్న పిల్లలా...
మాస్కో : అమెరికా, ఉత్తరకొరియా అద్యక్షులు డొనాల్డ్ ట్రంప్, కిమ్ జాంగ్ ఉన్‌ల మధ్య మాటల తుటాలు పేలుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో బిగ్ కంట్రీ రష్యా స్పందించింది. వారిద్దరూ మరీ చిన్నపిల్లలా ప్రవర్తిస్తున్నారని రష్యా విదేశాంగ మంత్రి సర్గెయ్ లవరొవ్ తెలిపారు. శుక్రవారం బీబీసీ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రంప్, కిమ్‌లు స్కూల్ పిల్లలా కొట్టేసుకుంటున్నారు. ఈ వ్యవహారంలో ఐరాస భద్రతా మండలిలో రాజకీయ దౌత్యం అవసరమన్న ఆయన.. ఇరు దేశాలను శాంతిపజేసేందుకు తాము చైనాతో కలిసి ముందుకు సాగేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ‘కొరియా అణు పరీక్షలను మౌనంగా చూస్తు ఉండాల్సిన పని లేదు. అలాగని వారిపై మాటికి మాటికి యుద్ధం చేస్తామని ప్రకటించం సరికాదు అని అమెరికాను ఉద్దేశించి’ సర్గెయ్ తెలిపారు. మరోవైపు ప్రపంచ దేశాలు కూడా వీరిద్దరి మధ్య వాదనలు ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయోనని భయపడుతున్నాయి. ఇంతకు ముందు ఐక్యరాజ్య సమితిలో తొలిసారి మాట్లాడిన ట్రంప్.. ఉత్తరకొరియాకు హెచ్చరిక ఇచ్చాడు. కిమ్ అణుబాంబులు చేతపట్టుకొన్న పిచ్చోడు అని.. తాను తల్చుకుంటే ఉత్తరకొరియాను నాశనం చేస్తానని ట్రంప్ పేర్కొన్నాడు. తాజాగా ఆ వ్యాఖ్యలకు కౌంటర్‌గా ట్రంప్ కుక్కలా మొరుగుతున్నాడంటూ కిమ్ తీవ్ర పదజాలంతో విమర్శించాడు. ట్రంప్ ఒక పిచ్చోడు.. మతిపోయి మాట్లాడుతున్నాడు అంటూ కిమ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆంక్షలు ఎన్ని విధించినా.. అణ్వాయుధాల విషయంలో వెనకకు తగ్గేది లేదని అతను తెగేసి చెప్పాడు. తమ దేశం జోలికి వస్తే అమెరికా తగిన మూల్యం చెల్లించుకుంటోంది అని కిమ్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. మళ్లీ ఇప్పుడు ‘కిమ్ భరతం ఎప్పుడో పట్టి ఉండాల్సిందన్న’ అభిప్రాయం ట్రంప్ వ్యక్తం చేశాడు కూడా. -
ట్రంప్‌ను ఢీకొట్టేందుకు అణ్వాయుధాలు!
చైనా సైనిక వ్యయం, అణ్వాయుధాలు పెంచాలి జాతీయవాద పత్రికలో సంచలన సంపాదకీయం బీజింగ్: అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు దీటుగా సమాధానం ఇచ్చేందుకు చైనా తన సైనిక వ్యయాన్ని, అణ్వాయుధాలను గణనీయంగా పెంచాల్సిన అవసరముందని జాతీయవాద పత్రిక గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. ట్రంప్ ఏదో ఒక రీతిలో చైనాను ఇరుకున పెట్టే అవకాశముందని, ఈ నేపథ్యంలో తన ప్రయోజనాలు కాపాడుకునేందుకు చైనా తన వ్యూహాత్మక అణ్వాయుధాల తయారీని పెంచాలని, డీఎఫ్-41 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిల మోహరింపును ముమ్మరం చేయాలని గ్లోబల్ టైమ్స్ తన సంపాదకీయంలో పేర్కొంది. 2017లో చైనా సైనిక వ్యయం గణనీయంగా పెరుగాల్సిన అవసరముందని ఇంగ్లిష్, చైనీస్ భాషల్లో వెలువడే తన సంచికల్లో ప్రధాన సంపాదకీయాన్ని ప్రచురించింది. గ్లోబల్ టైమ్స్ చైనా ప్రభుత్వ మీడియా కాకపోయినప్పటికీ దీనికి అధికార కమ్యూనిస్టు పార్టీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. చాలా సందర్భాల్లో ప్రభుత్వ గొంతుకనే ఈ పత్రిక వినిపిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మాత్రం ప్రభుత్వం విషయంలో సంచలన వ్యాఖ్యలు చేస్తుండటం గమనార్హం. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో చైనాపై ట్రంప్ తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అమెరికాకు చైనా బద్ధ విరోధి అని ప్రకటించారు. ఆయన అధ్యక్షుడు అయిన తర్వాత అమెరికా-చైనా సంబంధాల్లో మరింత ఉద్రిక్తతలు చోటుచేసుకునే అవకాశముందని పరిశీలకులు భావిస్తున్నారు.