మాస్కో : అమెరికా, ఉత్తరకొరియా అద్యక్షులు డొనాల్డ్ ట్రంప్, కిమ్ జాంగ్ ఉన్‌ల మధ్య మాటల తుటాలు పేలుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో బిగ్ కంట్రీ రష్యా స్పందించింది. వారిద్దరూ మరీ చిన్నపిల్లలా ప్రవర్తిస్తున్నారని రష్యా విదేశాంగ మంత్రి సర్గెయ్ లవరొవ్ తెలిపారు. శుక్రవారం బీబీసీ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ట్రంప్, కిమ్‌లు స్కూల్ పిల్లలా కొట్టేసుకుంటున్నారు. ఈ వ్యవహారంలో ఐరాస భద్రతా మండలిలో రాజకీయ దౌత్యం అవసరమన్న ఆయన.. ఇరు దేశాలను శాంతిపజేసేందుకు తాము చైనాతో కలిసి ముందుకు సాగేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ‘కొరియా అణు పరీక్షలను మౌనంగా చూస్తు ఉండాల్సిన పని లేదు. అలాగని వారిపై మాటికి మాటికి యుద్ధం చేస్తామని ప్రకటించం సరికాదు అని అమెరికాను ఉద్దేశించి’ సర్గెయ్ తెలిపారు. మరోవైపు ప్రపంచ దేశాలు కూడా వీరిద్దరి మధ్య వాదనలు ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయోనని భయపడుతున్నాయి.
ఇంతకు ముందు ఐక్యరాజ్య సమితిలో తొలిసారి మాట్లాడిన ట్రంప్.. ఉత్తరకొరియాకు హెచ్చరిక ఇచ్చాడు. కిమ్ అణుబాంబులు చేతపట్టుకొన్న పిచ్చోడు అని.. తాను తల్చుకుంటే ఉత్తరకొరియాను నాశనం చేస్తానని ట్రంప్ పేర్కొన్నాడు. తాజాగా ఆ వ్యాఖ్యలకు కౌంటర్‌గా ట్రంప్ కుక్కలా మొరుగుతున్నాడంటూ కిమ్ తీవ్ర పదజాలంతో విమర్శించాడు. ట్రంప్ ఒక పిచ్చోడు.. మతిపోయి మాట్లాడుతున్నాడు అంటూ కిమ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆంక్షలు ఎన్ని విధించినా.. అణ్వాయుధాల విషయంలో వెనకకు తగ్గేది లేదని అతను తెగేసి చెప్పాడు. తమ దేశం జోలికి వస్తే అమెరికా తగిన మూల్యం చెల్లించుకుంటోంది అని కిమ్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. మళ్లీ ఇప్పుడు ‘కిమ్ భరతం ఎప్పుడో పట్టి ఉండాల్సిందన్న’ అభిప్రాయం ట్రంప్ వ్యక్తం చేశాడు కూడా.