ట్రంప్‌ను ఢీకొట్టేందుకు అణ్వాయుధాలు!
చైనా సైనిక వ్యయం, అణ్వాయుధాలు పెంచాలి
జాతీయవాద పత్రికలో సంచలన సంపాదకీయం
బీజింగ్: అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు దీటుగా సమాధానం ఇచ్చేందుకు చైనా తన సైనిక వ్యయాన్ని, అణ్వాయుధాలను గణనీయంగా పెంచాల్సిన అవసరముందని జాతీయవాద పత్రిక గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.
ట్రంప్ ఏదో ఒక రీతిలో చైనాను ఇరుకున పెట్టే అవకాశముందని, ఈ నేపథ్యంలో తన ప్రయోజనాలు కాపాడుకునేందుకు చైనా తన వ్యూహాత్మక అణ్వాయుధాల తయారీని పెంచాలని, డీఎఫ్-41 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిల మోహరింపును ముమ్మరం చేయాలని గ్లోబల్ టైమ్స్ తన సంపాదకీయంలో పేర్కొంది.
2017లో చైనా సైనిక వ్యయం గణనీయంగా పెరుగాల్సిన అవసరముందని ఇంగ్లిష్, చైనీస్ భాషల్లో వెలువడే తన సంచికల్లో ప్రధాన సంపాదకీయాన్ని ప్రచురించింది. గ్లోబల్ టైమ్స్ చైనా ప్రభుత్వ మీడియా కాకపోయినప్పటికీ దీనికి అధికార కమ్యూనిస్టు పార్టీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. చాలా సందర్భాల్లో ప్రభుత్వ గొంతుకనే ఈ పత్రిక వినిపిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మాత్రం ప్రభుత్వం విషయంలో సంచలన వ్యాఖ్యలు చేస్తుండటం గమనార్హం. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో చైనాపై ట్రంప్ తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అమెరికాకు చైనా బద్ధ విరోధి అని ప్రకటించారు. ఆయన అధ్యక్షుడు అయిన తర్వాత అమెరికా-చైనా సంబంధాల్లో మరింత ఉద్రిక్తతలు చోటుచేసుకునే అవకాశముందని పరిశీలకులు భావిస్తున్నారు.