సియోల్: తమ అణ్వాయుధ సంపత్తి గణనీయంగా పెంచుకున్న నేపథ్యంలో అమెరికాతో పోరాటంలో గెలిచి తీరుతామని ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ప్రతినబూనారు. వరుస అణ్వాయుధ పరీక్షలతో ఉత్తర కొరియా అంతర్జాతీయంగా ఉద్రిక్తతలను పెంచిపోస్తున్న సంగతి తెలిసిందే. గత నెల 29న అత్యంత దూరం ప్రయాణించగల ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ఐసీబీఎం)ని పరీక్షించడంతో అగ్రదేశాలు.. ఉత్తర కొరియాపై గుర్రుగా ఉన్నాయి. తాజా క్షిపణి అమెరికాలోని అన్ని నగరాలను చేరుకోగలదు.
ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించిన నేపథ్యంలో ఇందులో పాల్గొన్న సిబ్బందితో కిమ్ మాట్లాడారు. ‘మన దేశం ప్రపంచంలోనే బలమైన అణ్వాయుధ శక్తిగా, సైనిక శక్తిగా అతిపెద్ద ముందడుగు వేసింది’ అని ఆయన అన్నారు. దేశ రక్షణ పరిశ్రమ అభివృద్ధి కొనసాగుతూనే ఉంటుందని, అమెరికాతో, సామ్రాజ్యవాదులతో పోరాటంలో మనం దేశం గెలిచి తీరుతుందని ఆయన చెప్పుకొచ్చారు. జీవన్మరణ పోరాటంలో ఎంతో మూల్యం చెల్లించి అణ్వాయుధ శక్తిగా ఎదిగేందుకు చేసిన ప్రయత్నం పూర్తయిందని తెలిపారు.
ఉ. కొరియా తాజా చర్యలపై అంతర్జాతీయంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. కొరియా అణ్వాయుధ పరీక్షలకు బ్రేక్ పడేలా ఆ దేశంపై అత్యంత కఠినతరమైన ఆర్థిక, దౌత్యపరమైన ఆంక్షలు విధించాలని అమెరికా కోరుతోంది. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో బేషరతుగా ఉత్తర కొరియాతో చర్చలకు తాము సిద్ధమని ఆమెరికా విదేశాంగమంత్రి రెక్స్ టిల్లర్సన్ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment