
ప్యాంగ్‌యాంగ్: ఉత్తర కొరియా అగ్రరాజ్యం అమెరికాను మళ్లీ రెచ్చగొట్టింది. ఈసారి క్షిపణి పరీక్షతో కాదు.. అంతకు మించిన చర్యతో. అణ్వాయుధ బలగాలను విపరీతంగా పెంచుకునేలా ఏకంగా ఓ ప్రత్యేక చట్టాన్ని రూపొందించుకుంది. తద్వారా ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోసింది.
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా నిరాయుధీకరణ పిలుపు తుంగలో తొక్కి.. అణు ఆయుధాలను అపరిమితంగా తయారు చేసుకునే చట్టాన్ని రూపొందించారు. తద్వారా.. ప్యాంగ్‌యాంగ్‌తో ఆర్థిక సాయం విషయంలో నిలిచిపోయిన చర్చల పునరుద్దరణకు అమెరికా చేసిన అభ్యర్థనను ఆయన తేలికగా తీసుకున్నట్లు అయ్యింది.
గురువారం ఉత్తర కొరియా పార్లమెంట్ ప్రత్యేక సెషన్ జరిగింది. ఈ సమావేశంలో.. కిమ్ జోంగ్ ఉన్ అమెరికా, దాని మిత్ర పక్షాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్యాంగ్‌యాంగ్ అణు ఆశయాలను అణిచివేసేందుకు, దాని వ్యవస్థను నాశనం చేసేందుకు అమెరికా, దాని భాగస్వాముల నుంచి వచ్చే బెదిరింపులను ఎదుర్కోవడానికి తాను ఈ చర్య తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు డీపీఆర్‌కే న్యూక్లియర్ ఫోర్స్ బిల్డింగ్ పాలసీ చట్టాన్ని ప్రవేశపెట్టారు.
ఈ కొత్త చట్టం ద్వారా ఉత్తర కొరియా అపరిమితంగా అణ్వాయుధాల్ని తయారు చేసుకోవచ్చని ఆయన వెల్లడించారు. అణ్వాయుధాల ఉత్పత్తిని విపరీతంగా పెంచడం, వాటిని వివిధ సేవల్లో ఉపయోగించుకోవడం లాంటి అవసరాన్ని ఈ సందర్భంగా ఆయన వివరించారు. మరోవైపు ఈ చర్యపై అమెరికా స్పందన తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment