డిజిటల్ చెల్లింపులకు హెల్ప్‌లైన్ 14444
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపులు పెంచే దిశగా కేంద్ర సర్కారు తన చర్యలను వేగిరం చేస్తోంది. ఇప్పటికే డిజిటల్ చెల్లింపులపై ప్రజల్లో అవగాహన కోసం టీవీ చానల్‌ను, వెబ్‌సైట్‌ను తీసుకురాగా... ఈ విషయంలో అవసరమైన సహకారం అందించేందుకు టోల్‌ఫ్రీ నంబర్‌ను కూడా ప్రకటించనుంది. డిజిటల్ చెల్లింపుల విషయంలో ప్రజలకు పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చేందుకు ప్రభుత్వం తమ సాయం కోరినట్టు నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్. చంద్రశేఖరన్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఒకే హెల్ప్‌లైన్ నంబర్‌ను తీసుకురావాలని సూచించామని, ఇందుకోసం టెలికం శాఖ 14444 నంబర్‌ను కేటాయించినట్టు ఆయన తెలిపారు. తాము బ్యాక్ ఎండ్ కాల్ సెంటర్ సహకారం అందించనున్నట్టు చంద్రశేఖరన్ చెప్పారు.