‘చకింగ్’ పరీక్షకు మరో కేంద్రం
లాఫ్బారోలో ఏర్పాటు
దుబాయ్: అనుమానాస్పద బౌలింగ్ యాక్షన్‌ను పరిశీలించి, సరిదిద్దేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఏర్పాటు చేసిన అధికారిక పరీక్షా కేంద్రాల సంఖ్య నాలుగుకు చేరింది. తాజాగా ఇంగ్లండ్‌లోని లాఫ్బారో యూనివర్సిటీ (లీసెస్టర్‌షైర్)లో దీనిని ఏర్పాటు చేస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది. ప్రస్తుతం కార్డిఫ్, బ్రిస్బేన్, చెన్నైలలో ఈ కేంద్రాలు ఉన్నాయి.
‘నిబంధనల మేరకు తగిన రనప్ ఏరియా, కనీసం 12 హైస్పీడ్ కెమెరాలతో మోషన్ సిస్టం, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందితో పాటు టెస్టింగ్ ప్రొటోకాల్, సాఫ్ట్వేర్ సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. బౌలర్లను తగిన విధంగా పరీక్షించి వాటిని విశ్లేషించగల సామర్థ్యం ఉంది. భవిష్యత్తులో సందేహాస్పద బౌలింగ్ యాక్షన్లను సరిదిద్దేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది’ అని ఐసీసీ జనరల్ మేనేజర్ జెఫ్ అలార్డైస్ చెప్పారు.