Nutanakal
-
మానవ మనుగడకు చెట్లే ఆధారం
నూతనకల్ మానవ మనుగడకు చెట్లే ఆధారమని.. ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్, గుండ్లసింగారంలోని కస్తూర్బాగాంధీ బాలికల గురుకుల పాఠశాల ఆవరణలో హరితహారం కింద మొక్కలు నాటారు. అనంతరం తుంగతుర్తి ఎమ్మెల్యే గాదెరి కిషోర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. చెట్లను నరకడం వలన ఏడారిగా మారి ఉష్ణోగ్రతలు పెరిగి వాతావరణ కాలుష్యం పెరగడంతో వర్షాలు కురవడం లేదన్నారు. కేవలం లెక్కల కోసం రికార్డుల్లో మొక్కలు పెంచడం కాదని క్షేత్రస్థాయిలో నాటిన మొక్కలను బతికించాల్సిన బాధ్యత అధికారులది, వనసంరక్షణ కమిటీ సభ్యులదేనన్నారు. అడవుల నరికివేతతోనే వర్షాలు కురవడం లేదు భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ అడవులను విచ్చలవిడిగా నరకడం వల్ల వర్షాలు సక్రమంగా కురవడం లేదన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి రాష్ట్రాన్ని హరితవనంగా మార్చాలన్నారు. మంత్రి స్వయంగా వాటర్ ట్యాంకర్ గల ట్రాక్టర్‌ను నడుపుతుండగా అధికారులు మొక్కలకు నీళ్లు పోశారు. ఈ సందర్భంగా తమ సమస్యల పరిష్కరించాలని కోరుతూ మం త్రికి జీపీ కార్మికులు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ దామోదర్‌రెడ్డి, సూర్యాపేట ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ కాసోజు సుమలత, జెడ్పీటీసీ గుగులోతు నర్సింగ్‌నాయక్, వైస్ ఎంపీపీ తొనుకునూరి లక్ష్మణ్, పీఏసీఎస్ చైర్మన్ ఎస్ఏ రజాక్, తహసీల్దార్ డి. దశరథ, ఎంపీడీఓ ఎండీ ఫసియోద్దిన్, ఈఓపీఆర్డీ సాంబిరెడ్డి సర్పంచ్‌లు ఏనిగతల సోమయ్య, బూరెడ్డి కళావతి సంజీవరెడ్డి, ఎంపీటీసీ ఎలిమినేటి రమాదేవి పాల్గొన్నారు. ‘నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి’ సూర్యాపేట : సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో నాటిన ప్రతి మొక్కను సంరక్షించాల్సిన బాధ్యత ప్రజలు, అధికారులపై ఉందని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో గల స్టేడియంలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ హరితహారంలో భాగస్వాములు కావాలని కోరారు. చెట్లతోనే మావనవాళికి మనుగడ సాధ్యమని, బంగారు భవిష్యత్ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ గండూరి ప్రవళ్లిక, కమిషనర్ వడ్డె సురేందర్, తహసీల్దార్ మహమూద్ అలీ, ఎంపీడీఓ నాగిరెడ్డి, నాయకులు తేరా చిన్నపరెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, గండూరి ప్రకాష్, వై.వెంకటేశ్వర్లు, నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మారిపెద్ది శ్రీనివాస్, గుడిపూడి వెంకటేశ్వర్రావు, వుప్పల ఆనంద్, శనగాని రాంబాబు కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
పాత కక్షలతోనే
నూతనకల్ : చిన్నపాటి ఘర్షణ చినికి.. చినికి గాలివానలా మారి ఓ వ్యక్తి ప్రాణాన్ని బలితీసుకుంది. నూతన్‌కల్ మండలం మద్దిరాల గ్రామంలో టీడీపీ వర్గీయులచే దాడికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టీఆర్ఎస్ కార్యకర్త బుధవారం మృతిచెందాడు. పాతకక్షలను మనసులో పెట్టుకునే ఉమేష్‌పై దాడి జరిగినట్టు తెలుస్తోంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకా రం.. గ్రామానికి చెందిన భూతం శంభయ్య, ఉమేష్‌లు తమ స్నేహితుడైన భూతం లింగరాజు ఇంట్లో మంగళవారం రాత్రి టీవీ చూస్తున్నారు. ఈ క్రమంలో లింగరాజుకు అతడి తమ్ముడు ఫోన్ చేయగా బయటికి వచ్చి మాట్లాడుతున్నాడు. ఈ సందర్భంలో ఇంటి ఎదురుగా ఉన్న టీడీపీ కార్యకర్త భూతం వెంకన్న అలియాస్ చలం నీ ఇంట్లో ఎవరూ ఉన్నారని లింగరాజును అడిగాడు. ఉమేష్(25), శంభయ్య టీవీ చూస్తున్నారని పేర్కొన్నాడు. వారిని బయటికి పంపించాలని, లేకుం టే గొడవలు జరుగుతాయని వెంకన్న హెచ్చరిస్తూ లింగరాజు వద్ద ఉన్న సెల్‌ఫోన్ లాక్కున్నాడు. దీంతో భయాందోళనకు గురైన లింగరాజు ఇంట్లోకి వెళ్లి టీవీ చూస్తున్న వారిని బయటకి పంపించాడు. ఇంటికి వెళ్తున్న శంభయ్యను భూతం లింగయ్య మరికొందరు పట్టుకోవడానికి ప్రయత్నించగా అతడు వదలాయిం చుకుని పారిపోయాడు. వెనుకే ఉన్న ఉమేష్‌ను టీడీపీకి చెందిన వడ్డెనం యతిరాజారావుతో పాటు మరికొంద రు కలిసి పట్టుకున్నారు. అతడిని చర్చి సమీపంలోకి తీసుకెళ్లి బండరాయితో తలపై మోది, మరణాయుధాలతో దాడి చేయగా తీవ్ర గాయాలపాలయ్యాడు. రక్తపు మడుగులో పడిఉన్న ఉమేష్‌ను స్థానికులు గమనించి చికిత్స నిమిత్తం సూర్యాపేటకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లగా మృతిచెందాడు. వైరానికి ఆనాడే బీజం టీఆర్ఎస్ ప్రభుత్వం వైభవంగా నిర్వహించిన బతుకమ్మ సంబరాలలో టీడీపీ, అధికారపార్టీ కార్యకర్తల మధ్య వైరానికి బీజం పడినట్టు తెలుస్తోంది. సద్దుల బతుకమ్మ రోజు బతుకమ్మలను నిమజ్జనం చేసే చోట టీఆర్ఎస్ కార్యకర్తలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు డీజే ఏర్పాటు చేయడంతో పాటు తమ పార్టీ నేతల ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. వీరితో పాటు టీడీపీ కార్యకర్తలు కూడా అక్కడ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. రెండు పార్టీల కార్యకర్తలు ఫ్లెక్సీల విషయంలో గొడవపడి ఒకరి ఫ్లెక్సీని మరొకరు తొలగించుకున్నా రు. దీంతో గత అక్టోబర్ 10వ తేదీన టీఆర్ఎస్ కార్యకర్తలు టీడీపీ మండల నాయకుడు యతిరాజారావుపై దాడి చేశారు. ఈ కేసులో ఉమేష్ ఏ3 నిందితుడుగా ఉన్నాడు. అప్పటి నుంచి గ్రామంలో రాజకీయ వైరం బలపడిందని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ వర్గియులు ఉమేష్‌పై దాడిచేసి ఉండవచ్చని భావిస్తున్నారు. జీవనోపాధికి వరంగల్‌కు.. మృతుడు ఉమేష్ జీవనోపాధి కోసం వరంగల్ జిల్లా చిన్ననాగారం గ్రామానికి దాదాపు నాలుగు సంవత్సరాల క్రితం వలసవెళ్లాడు. మృతుడి మేనమామ, బావ ఆత్మకూర్ (ఎస్) మండల పాత సూర్యాపేట గ్రామం తన్నీరు ఉపేందర్ ఇంటికి వచ్చి వెళుతుండేవాడు. ఇదే క్రమంలో దసరా పండగకు వచ్చి టీడీపీ వర్గీయులతో ఘర్షణ పడి వెళ్లాడు. తిరిగి మంగళవారం ఉదయం మద్దిరాలకు చేరుకుని హత్యకు గురయ్యాడు. మృతుడికి భార్య,కుమారుడు, కుమార్తె ఉన్నారు. మంత్రి పరామర్శ సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో మృతిచెందిన ఉమేష్ కుటుంబ సభ్యులను రాష్ట్ర విద్యాశా మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి పరామర్శించారు. ఉమేష్ మృతదేహంపై పూలమాల వేసి నివాళులర్పించారు. ఘటన గురించి వివరాలు అడిగితెలుసుకున్నారు. మృ తుడి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. గ్రామంలో పోలీసుల బందోబస్తు ఉమేష్ మృతితో గ్రామంలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మృతుడి స్నేహితుడు భూతం శంభ య్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు తుంగతుర్తి సీఐ ఎం.రాజాగంగరాం పర్యవేక్షణలో ఎస్సై వెంకటేష్ కేసు నమోదు చేశారు. సూర్యాపేట డీఎస్పీ ఎస్కె.రషీద్ ఆధ్వర్యంలో హాలియా సీఐ పార్థసారథి, అర్వపల్లి, తిరుమలగిరి ఎస్సైలు బందోబస్తు నిర్వహిస్తున్నారు. -
వెనుకబాటుకు కాంగ్రెస్, టీడీపీలే కారణం
నూతనకల్ : తెలంగాణ ప్రాంతం అన్ని రంగాల్లో వెనుకబడడానికి కాంగ్రెస్, టీడీపీలే కారణమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. ఆదివారం మం డల కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సీమాంధ్ర పాలకులు తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ కూడా విద్యుదుత్పత్తి కేంద్రాన్ని నిర్మించకుండా రైతాంగానికి కరెంటు కష్టాలు తెచ్చిపెట్టారని విమర్శించారు. తెలంగాణకు ద్రోహం చేసే ఆంధ్రా పార్టీల జెండాలను వదిలి టీఆర్ఎస్లో చేరాలని ప్రజలను కోరారు. ప్రపంచస్థాయి విద్యా ప్రమాణాలను క్రోడీకరించి కేజీ నుంచి పీజీ వరకు ఉన్నత విద్యనందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో భూగర్భ జలాలు వృద్ధిచెంది ప్రజలకు తాగు,సాగు నీరు అందించడానికి 45వేల చెరువులు, కుంటలను ఆధునికీకరించి నీటినిల్వ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోం దన్నారు. జిల్లాలో రహదారుల అభివృద్ధికి రూ. 2వేల కోట్లను మంజూరు చేశామని తెలిపారు. పింఛన్లు, ఆహా ర భద్రత కార్డుల మంజూరు విషయంలో ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలు అర్థరహితమన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు, ఆహార భద్రత కార్డులు అందిస్తామని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో పింఛన్‌దారుల కోసం రూ. 62 కోట్లు, కాంగ్రెస్ గత పదేళ్ల కాలం లో రూ. 762కోట్లు ఖర్చు చేయగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం 4వేల కోట్ల రూపాయలను పింఛన్ల కోసం మంజూరు చేసిందన్నారు. తెలంగాణను పూర్తిస్థాయిలో అభివృద్ధిచేసేం దుకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలను ప్రతి ఒక్కరూ హర్షించాలన్నారు. ఎమ్మెల్యే గాదరి కిశోర్ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానన్నారు. గత ప్రజాప్రతినిధుల తీరుతో నియోజకవర్గం అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచిందన్నారు. అనంతరం మాచినపల్లి గ్రామ సర్పంచ్ మంద బజార్‌తో పాటు చిల్పకుంట్ల, నూతనకల్, ముకుందాపురం, పోలుమళ్ల, దిర్శనపల్లి గ్రామాలకు చెందిన టీడీపీ, సీపీఎం,కాంగ్రెస్ పార్టీలకు చెందిన కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జిల్లా నాయకులు ఎస్కె.రజాక్, మండల శాఖ అధ్యక్షుడు తీగల మల్లారెడ్డి, గుంటకండ్ల అశోక్‌రెడ్డి, డువెంకన్న, బిక్కి బుచ్చయ్య, బానాల సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.