విచారణ ఖైదీలకు ’న్యాయ భారతి’
కోర్టు ఖర్చుల కోసం
భారతీ ఎంటర్ప్రైజెస్ ఫండ్
ఏటా రూ.10 కోట్ల వ్యయం..
వేతనం నుంచి రూ.5 కోట్లు ఇవ్వనున్న సునీల్ మిట్టల్
న్యూఢిల్లీ: చిన్న చిన్న కోర్టు కేసులకు సంబంధించి తొలిసారిగా విచారణను ఎదుర్కొంటున్న ఖైదీలకు(అండర్‌ట్రైయల్స్) భారతీ ఎంటర్ప్రైజెస్ న్యాయపరమైన సహాయాన్ని అందించనుంది. ఇందుకోసం ‘న్యాయ భారతి’ పేరుతో ఏటా రూ.10 కోట్ల మొత్తాన్ని వెచ్చించనున్నట్లు ప్రకటించింది. జిల్లా కోర్టుల స్థాయిలో అండర్‌ట్రయల్స్‌కు బెయిలు, జామీను ఖర్చుల చెల్లింపు ఇతరత్రా సహాయాన్ని ఈ నిధి నుంచి కల్పించనున్నట్లు తెలిపింది. కాగా, తన వేతనం నుంచి వ్యక్తిగతంగా ఈ ప్రాజెక్టు ఫండ్‌కు ప్రతియేటా రూ.5 కోట్లను ఇవ్వనున్నట్లు భారతీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ సునీల్ మిట్టల్ చెప్పారు.
న్యాయ భారతి సేవలను వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి మొట్టమొదట ఢిల్లీ-ఎన్సీఆర్, పంజాబ్‌లలో ప్రారంభించనున్నామని, తర్వాత జమ్ము-కాశ్మీర్, హర్యానా, రాజస్థాన్ వంటి మరిన్ని రాష్ట్రాలకు దీన్ని విస్తరించనున్నట్లు ఆయన వెల్లడించారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్)లో భాగంగా భారతీ ఎయిర్టెల్ ఈ ప్రాజెక్టుకు రూ. 10 కోట్లను అందిస్తుందని.. ఇందులో సగం తనకు లభించే వేతనం నుంచి వెళ్తుందని ఆయన వివరించారు. గత ఆర్థిక సంవత్సరం(2014-15)లో సునీల్ మిట్టల్ రూ. రూ.27.17 కోట్ల వేతన ప్యాకేజీని అందుకున్నారు.
కాగా, ప్రస్తుతం దేశంలో 1,387 జైళ్లలో దాదాపు 2.8 లక్షల మందికిపైగానే అండర్‌ట్రయల్స్‌గా ఉన్నట్లు మిట్టల్ చెప్పారు. మొత్తం ఖైదీల్లో వీరి సంఖ్య సుమారు 68 శాతమని ఆయన పేర్కొన్నారు. తొలిసారిగా ఏదైనా కేసుల్లో చిక్కుకున్నవారికి, అదీకూడా చిన్నచిన్న తప్పులు చేసి విచారణ ఎదుర్కొంటున్నవారికి మాత్రమే ఈ సేవలను అందిస్తామని కూడా మిట్టల్ స్పష్టం చేశారు. చట్టాల గురించి సరిగ్గా తెలియకపోవడం, బెయిల్ మొత్తాన్ని చెల్లించే ఆర్థిక స్తోమత లేకపోవడం, జామీను ఇచ్చేందుకు ఎవరూ సహకరించకపోవడం వంటి కారణాలవల్లే చాలావరకూ అండర్‌ట్రయల్స్ జైళ్లలో మగ్గుతున్నారని ఆయన గుర్తుచేశారు.