O MR Sheet
-
టెట్ ప్రశాంతం
► పరిశీలించిన కలెక్టర్, ఏజేసీ, రాష్ట్ర పరిశీలకుడు, డీఈఓ ► షాద్‌నగర్‌లో ఓఎమ్మార్ షీట్‌ను ఎత్తుకెళ్లిన అభ్యర్థి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ సీ-సెంటర్లో ► అరగంట ఆలస్యం డెలివరీ అయిన వెంటనే పరీక్ష రాసిన మహిళ ► పేపర్-1కు 24,625కు 21,525 హాజరు, 3,100 గైర్హాజరు ► పేపర్ -2కు 40,218కు 36,258 అభ్యర్థులు హాజరు, 3,960 గైర్హాజరు పాలమూరు యూనివర్సిటీ/మహబూబ్‌నగర్ న్యూటౌన్ : జిల్లాలో ఆదివారం నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)కు విద్యా శాఖ అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. కొన్ని కేంద్రాలలో చెదురు మదురు ఘటనలు మినహా పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. అభ్యర్థులు ఆయా కేంద్రాలకు గంట ముందే చేరుకోవడం జరిగింది. అభ్యర్థులను పోలీసులు, అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి పంపించారు. జిల్లా మొత్తంలో 171పరీక్ష కేంద్రాలలో పేపర్ 1కు 24,625అభ్యర్థులకు గాను 21,525మంది హజరయ్యారు. 3,100మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. రెండో పేపర్‌కు 40,218మందికి గాను 36,258మంది హజరయ్యారు. 3,960మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. పరీక్షల నిర్వహణ తీరును రాష్ట్ర పరిశీలకుడు గోపాల్‌రెడ్డి భూత్పూర్లోని పలు సెంటర్స్‌ను పరిశీలించాడు. జిల్లా కేంద్రంలోని మోడల్ బేసిక్ హైస్కూల్ సెంటర్‌ను కలెక్టర్ టీకే శ్రీదేవి పరిశీలించారు. జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్ బి.రంజిత్‌ప్రసాద్, డీఈఓ విజయలక్ష్మీబాయి ఎప్పటికప్పుడు డిపార్ట్మెంటల్, రూట్ అధికారులు, సూపరింటెండెంట్ల ద్వారా తెలుసుకున్నారు.జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో అభ్యర్థులను రాష్ట్రస్థాయి నుంచి కేటాయించడంతో పరీక్ష కేంద్రం వద్ద వారి పేర్లు లేకపోవడంతో అభ్యర్థులు పరీక్ష కేంద్రం అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పరీక్ష ఆరగంట అలస్యంగా ప్రారంభమయ్యింది. నవాబ్‌పేటతో పాటు వనపర్తిలో ఉదయం ప్రారంభమయిన పేపర్ 1పరీక్షలో గైర్హాజరయిన అభ్యర్థుల స్థానంలో ఇతరులకు పేపర్ కోడ్ కేటాయించడం అధికారులను గందరగోళానికి గురి చేసింది. జిల్లా విద్యా శాఖ అధికారులకు సమాచారం ఇచ్చి పరీక్ష సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకున్నారు. షాద్‌నగర్ మండలం మొగిలిగిద్దలోని జెడ్పీ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో ఓఎమ్మార్ షిట్ను ఎత్తుకెళ్లాడు. ఆ అభ్యర్థిపై విద్యశాఖ అధికారులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. భూత్పూర్లో పేపర్-2 రాసేందుకు షాద్‌నగర్‌కు చెందిన మహిళ జెడ్పీ ఉన్నత పాఠశాల సెంటర్‌కు 8 నిమిషాలు ఆలస్యంగా రావడంతో అధికారులు లోపలికి అనుమతించలేదు. పరీక్ష కేంద్రాల ఎదుట పడిగాపులు కూతురు, భార్య, అక్క, చెల్లెలు, తమ్ముడు ఇలా కుటుంబ సభ్యులు టెట్ పరీక్ష రాస్తుంటే వారి కుటుంబ సభ్యులు పరీక్ష కేంద్రాల ఎదుట పడిగాపులు కాశారు. కొంత మంది చిన్నారులను పెట్టుకొని సెంటర్స్ వద్ద పరీక్ష రాస్తున్న తల్లులు ఎప్పుడు బయటకు వస్తారో అంటూ ఎదురు చూశారు. చాలా మంది అభ్యర్థులకు వేరు వేరు ప్రాంతాల్లో సెంటర్స్ పడడంతో చిన్నారులను వెంట తీసుకెళ్లి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని పరీక్ష కేంద్రాల సమీపంలో కనీస వసతలు లేకపోవడంతో పరీక్ష రాయడానికి వెంట వచ్చిన వారు ఇబ్బందులు పడ్డారు. -
ఎన్నాళ్లీ ఎదురుచూపులు..?
► గ్రేడ్-2 అభ్యర్థుల్లో ఆందోళన ► నియూమక ఉత్తర్వులు ► ఇచ్చేది ఎప్పుడో.. కొత్తగూడెం(ఆదిలాబాద్) : ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం భారీగా రిక్రూట్మెంట్లు చేపడుతున్నట్లు ప్రకటించిన సింగరేణి సంస్థ.. పోస్టుల భర్తీలో విఫలం కావడంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. జూనియర్ అసిస్టెంట్ క్లరికల్ గ్రేడ్-2 పోస్టుల నియామక ప్రక్రియపై ఎప్పటికప్పుడు ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. రెండేళ్ల క్రితం నోటిఫికేషన్ విడుదల చేసి అర్హులకు మాత్రమే కాల్ లెటర్లు పంపిస్తామని అధికారులు ప్రకటించారు. అరుుతే దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ కాల్ లెటర్ పంపించాలని అభ్యర్థులు, యూనియన్ నాయకులు డిమాండ్ చేయడంతో నియామక ప్రక్రియ నిలిచిపోయింది. తిరిగి 2015 మార్చిలో క్లరికల్ పోస్టుల భర్తీకి సింగరేణి సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 234 ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామని, ఏదైనా డిగ్రీ ఉన్నవారు అర్హులని పేర్కొంది. దీంతో సుమారు 1.20 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు ప్రక్రియ ముగిసిన అనంతరం యాజమాన్యం మరో 237 పోస్టులు ఖాళీగా ఉన్నాయంటూ పాత నోటిఫికేషన్‌లోని పోస్టులకు వాటిని జతచేసి 471 ఖాళీలు ఉన్నట్లు ప్రకటించింది. ఈ పోస్టు ల కోసం వేలాది మంది దరఖాస్తు చేసుకోవడంతో జేఎన్టీయూహెచ్ సౌజన్యంతో గత ఏడాది అక్టోబర్ 11న రాత పరీక్ష నిర్వహించిం ది. కాగా పరీక్ష పత్రం, ఓఎంఆర్ షీట్లో సైతం కొన్ని సెట్లలో తప్పులు దొర్లాయని పలువురు అభ్యర్థులు ఆరోపించగా, యాజమాన్యం మాత్రం వాటికేమీ కాదంటూ సముదాయించే ప్రయత్నం చేసింది. ఎట్టకేలకు 83,225 మందికి హాల్‌టికెట్లు పంపించగా 70,561 మంది పరీక్షకు హాజరయ్యారు. వారం రోజుల అనంతరం పరీక్షా ఫలితాలను ప్రకటించింది. అపాయింట్మెంట్ కోసం తప్పని ఎదురుచూపులు.. క్లరికల్ పోస్టుల పరీక్ష ఫలితాలలో అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు అన్ని వర్గాల నుంచి వెల్లువెత్తాయి. ఒకే ఇంటిపేరు కలిగిన వారికి ఎక్కువ మార్కులు వచ్చాయని, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో సింగరేణి కాలనీల్లోని అధికారుల పిల్లలకే ఎక్కువ మార్కులు వేశారని, ఇలా పలు ఆరోపణలు వచ్చాయి. అటువంటిదేమీ లేదని యూజమాన్యం తొలుత చెప్పినప్పటికీ ఒత్తిడి పెరగడంతో విజిలెన్స్ విచారణను ప్రారంభించింది. దీంతో క్లరికల్ పోస్టుల నియామక ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి ఎలాగైనా ఉద్యోగం సాధించాలని ఎంతోమంది కష్టపడి చదివి, పరీక్ష రాసి, ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించినప్పటికీ నియామక ప్రక్రియ నిలిచిపోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ఇతర పోస్టులకు సంబంధించి సర్టిఫికెట్ వెరిఫికేషన్, అపాయింట్మెంట్ ఆర్డర్లను అభ్యర్థులు అందుకున్నప్పటికీ క్లరికల్ అభ్యర్థులు మాత్రం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. సింగరేణి యాజమాన్యం మాత్రం విజిలెన్స్ విచారణ పూర్తై తరువాతే ఈ పోస్టులను భర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు అసలు క్లరికల్ పోస్టులకు సంబంధించి సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపడతారా లేక మరోసారి నోటిఫికేషన్ ఇస్తారో తెలియక ఆందోళన చెందుతున్నారు.