చలో కలెక్టరేట్ విజయవంతం చేయండి
• సీఐటీయూ రాష్ట్ర నేత జి.ఓబులు
హిందూపురం రూరల్ : గార్మెంట్స్ పరిశ్రమలో పని చేస్తున్న కార్మికులకు కనీస వేతనాల చట్ట సాధన lకోసం సీఐటీయూ ఆధ్వర్యంలో ఆగస్టు 1వ తేదీ చేపట్టిన చలో కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర నాయకులు జి.ఓబులు పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం తూమకుంట పారిశ్రామిక వాడలో గార్మెంట్స్ పరిశ్రమల ముందు చలో కలెక్టరేట్ సెప్టెంబర్ 2న జరుగబోయే దేశవ్యాప్త సమ్మెకు సిద్ధం కావాలని కరపత్రాలు పంపిణీ చేశారు. గార్మెంట్స్ అనుబంధ పరిశ్రమల్లో పని చేస్తున్న కార్మికులకు కనీస వేతనం రూ.18 వేలతో పాటు ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించాలన్నారు.
అధికార పార్టీకి చెందిన నాయకులు, కార్మిక శాఖాధికారులు యాజమాన్యంతో లాలూచీ పడి చట్టాలను అమలు చేయకుండా నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారని దుయ్యబట్టారు. అదేవిధంగా తమ న్యాయమైన కోర్కెల సాధన కోసం నిరసన చేపట్టిన విప్రో కార్మికులకు ఆయన మద్దతు తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు నారాయణస్వామి, పురుషోత్తం, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.