మేం కూడా గుజ్జర్లలాగా ఫైట్ చేస్తాం
నాంపల్లి: ఓసీల సమస్యలు పరిష్కరించకపోతే రాజస్థాన్‌లో గుజ్జర్ల తరహాలో ఉద్యమం చేపడతామని ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్ రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. శుక్రవారం న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో సంఘం తెలుగు రాష్ట్రాల కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్రవర్ణ పేదల రిజర్వేషన్ల సాధనకు రాజ్యాంగ సవరణ చేసే విధంగా ఎంపీలపై ఒత్తిడి తెస్తామన్నారు. ఓసీల సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్యాచరణ ప్రకటించకపోతే జాతీయ స్థాయిలో ఉద్యమం చేపడతామన్నారు. విద్యా, ఉద్యోగ, పదోన్నతులతోపాటు, ప్రైవేట్ రంగంలోనూ రిజర్వేషన్లు ప్రకటిస్తూ ఓసీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించడం సరికాదన్నారు.
అగ్రవర్ణాల పేరుతో ఎందరో పేదలకు అన్యాయం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత పదేళ్లుగా నిరుపేద ఓసీల సమస్యల పరిష్కారం కోసం అనేక కమిటీలు వేసిన ప్రభుత్వాలు వాటని ఆమోదించకుండా కాలయాపన చేస్తున్నాయన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆరుకోట్ల మంది అగ్రవర్ణ పేదలను ఓబీసీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఓసీల అభివృద్థికి రాజస్థాన్, బీహార్ రాష్ట్రాల్లో కార్పొరేషన్లు ఏర్పాటు చేసినట్లుగానే జాతీయ ఓసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు.