రిలయన్స్ జియో నష్టమెంతో తెలుసా?
ముంబై : ఉచిత ఆఫర్లతో టెలికాం మార్కెట్లో దుమ్మురేపిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కు భారీ షాకే తగిలింది. ముఖేష్ అంబానీకి చెందిన ఈ కంపెనీ ఆరు నెలల వ్యవధిలో రూ.22.50 కోట్ల నికర నష్టాలను నమోదుచేసింది. మార్చి 31తో ముగిసిన ఆరు నెలల వ్యవధి రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఫలితాలను కంపెనీ సోమవారం విడుదల చేసింది. ఈ ఫలితాల్లో కంపెనీ నికర నష్టాలను ప్రకటించింది. గతేడాది ఇదేకాలంలో కంపెనీ నష్టాలు రూ.7.46 కోట్లగానే ఉన్నట్టు తెలిసింది. మొత్తంగా కంపెనీ ఆదాయాలు కూడా ఈ ఆరు నెలల వ్యవధిలో భారీగా 76 శాతం పడిపోయాయి. గతేడాది 2.25 కోట్లగా ఉన్న ఆదాయాలు ప్రస్తుతం 54 లక్షలుగా నమోదయ్యాయి.
కంపెనీ వ్యయాలు కూడా గతేడాదితో పోలిస్తే భారీగా పెరిగినట్టు వెల్లడైంది. 13.63 కోట్లగా ఉన్న వ్యయాలు భారీగా ఎగిసి 34.88 కోట్లగా నమోదైనట్టు కంపెనీ వెల్లడించింది. పన్నులకు ముందు కంపెనీ వ్యయాలు 34.34 కోట్లు. తమ 4జీ నెట్ వర్క్ లను విస్తరించడానికి 2 లక్షల కోట్లకు పైగా నగదును ఇన్వెస్ట్ చేయనున్నట్టు కూడా కంపెనీ అంతకముందే చెప్పింది. ఇటీవలే కంపెనీకి 72 మిలియన్ల సబ్ స్క్రైబర్లు ఉన్నట్టు రిలయన్స్ జియో ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి ఉచిత ఆఫర్లకు స్వస్తి చెప్పిన కంపెనీ టారిఫ్ ప్లాన్స్ ను అమలుచేస్తోంది. ఏప్రిల్ 1కి ముందు ప్రైమ్ సర్వీసులు యాక్టివేట్ చేసుకున్న వారికి కంపెనీ డేటా ఆఫర్లను కూడా ప్రకటించింది. ధన్ ధనా ధన్ ఆఫర్ పేరుతో ఇటీవలే ఓ కొత్త ఆఫర్ ను కూడా ప్రైమ్ యూజర్లకు తీసుకొచ్చింది.