16 వేల మెజారిటీ.. 16 వేల కొబ్బరికాయలు
అప్పన్నకు మొక్కు చెల్లించిన ఒడిశా ఎమ్మెల్యే
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామికి గురువారం ఒడిశాలోని గంజాం జిల్లా సొరడ నియోజకవర్గం ఎమ్మెల్యే పూర్ణచంద్ర స్వైన్ 16 వేల కొబ్బరికాయలు కొట్టి మొక్కు చెల్లించారు. ఎమ్మెల్యే తన కుటుంబ సభ్యులు, అనుచరులతో గురువారం సింహాచలానికి వచ్చారు. ఆలయ ధ్వజస్తంభం ప్రాంగణంలో అమ్మవారి సన్నిధి వద్ద కొబ్బరికాయలు కొట్టారు.
అనంతరం స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. 2014లో జరిగిన ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడి తరఫున పోటీ చేసిన పూర్ణచంద్ర తనకు ఎంత మెజార్టీ వస్తే అన్ని కొబ్బరికాయలు కొడతానని అప్పన్నకు మొక్కుకున్నారు. ఆ ఎన్నికల్లో ఆయన 16 వేల ఓట్ల మెజార్టీతో ప్రత్యర్థిపై గెలుపొందారు. దీంతో ఆయన శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామికి గురువారం 16 వేల కొబ్బరికాయలు కొట్టి మొక్కు చెల్లించుకున్నారు.