ఉరుకులు..పరుగులు!
సాక్షి ఎఫెక్ట్
– ప్రశ్నపత్రాల లీకేజీపై విస్త్రత తనిఖీలు చేసిన అధికారులు
అనంతపురం ఎడ్యుకేషన్ : పదో తరగతి ప్రీ ఫైనల్ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం వెనుక ఉన్న సూత్రదారులను గుర్తించేందుకు విద్యాశాఖ అధికారులు లోతుగా విచారిస్తున్నారు. గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘ప్రశ్నపత్రాల లీకేజీ’ కథనం విద్యాశాఖలో కలకలం రేపింది. అధికారులను ఉరుకులు..పరుగులు పెట్టించింది. జిల్లా విద్యాశాఖ అధికారి పగడాల లక్ష్మీనారాయణ తీవ్రంగా స్పందించారు. ఆయనతో పాటు డెప్యూటీ డీఈఓలను విచారణకు ఆదేశించారు. బృందాలుగా విడిపోయి పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలను తనిఖీలు చేశారు. ప్రశ్నపత్రాలు బండిళ్లను పరిశీలించారు.
డీఈఓ పాతూరు నంబర్–1 ఉన్నత పాఠశాలను పరిశీలించారు. ప్రశ్నపత్రాల బండిళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ లీకేజీ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్నామన్నారు. ప్రత్యేక బృందాలతోనూ విచారణ చేయిస్తామన్నారు. ప్రశ్నపత్రాలు ఎలా వెళ్లాయి? ఎవరి హస్తం ఉందనే దానిని త్వరలో బయట పెడతామన్నారు. అసలు దోషులను గుర్తించి కఠినచర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.