ఏం చేద్దాం?
సిద్దిపేటకు ఇంకా దొరకని పెద్దాఫీసు
ఎల్లంకి కళాశాలకు వాస్తు దోషాలు
ఇందూరు కాలేజీ ఇచ్చేందుకు యాజమాన్యం నిరాకరణ
ఎంపీడీఓ, అంబేద్కర్ భవన్, ఆర్డీఓ ప్రాంగణంలోనే కలెక్టరేట్
సిద్దిపేట జిల్లాలోకి మరో మండలం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: శుభ ఘడియలు దగ్గరపడుతున్నా.. సిద్దిపేటకు పెద్దాఫీసు ఇంకా దొరకలేదు. జిల్లా మంత్రి, కలెక్టర్, అధికారులు కలిసి కలెక్టరేట్ భవనం కోసం పట్టణాన్ని జల్లెడ పడుతున్నారు. నిబంధనల ప్రకారం ఉన్న భవంతికి వాస్తు కుదరడం లేదు.. ఒకవేళ వాస్తు కుదిరితే బిల్డింగులు ఇచ్చేందుకు యాజమాన్యాలు అంగీకరించడం లేదు. దీంతో ఏం చేయాలో తెలియక అధికారులు తలపట్టుకున్నారు.
15 రోజులుగా కలెక్టరేట్ భవనంపై దృష్టి సారించిన అధికారులు సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయం, ఆర్అండ్బీ అతిథి గృహం, ఆర్అండ్బీ ఈఈ కార్యాలయంతో పాటు డిప్యూటీ కార్యాలయాలను కలుపుతూ సమీపంలోని సిటిజన్స్ క్లబ్ ప్రైవేట్ భవనంతో పట్టణ నడిబోడ్డున కలెక్టరేట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. స్థలంలో వాస్తు దోషాలు లేవని, భవన నిర్మాణాల్లో ఏమైనా దోషాలు ఉంటే పరిష్కరించుకోవచ్చని అధికారులు భావించారు. అయితే, సిటిజన్స్ క్లబ్ భవనం ఇచ్చేందుకు కార్యవర్గం నిరాకరించింది.
‘ఎల్లంకి’ డిమాండ్ రూ.6 లక్షలు
పట్టణ శివారులోని ఎల్లంకి ఇంజినీరింగ్ కాలేజీని అధికారులు ఎంపిక చేశారు. ఈ భవనం ప్రభుత్వ నిబంధనల మేరకు 40 వేల చదరపు మీటర్ల విస్తీర్ణం, భవనాలతో కూడా ఉంది. ప్రస్తుతం నిరూపయోగంగా ఉన్న ఈ విశాల భవనాన్ని కలెక్టరేట్‌గా మార్చడం వల్ల ట్రాఫిక్ సమస్యను అధిగమించడంతో పాటు ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌గా అన్ని కార్యాలయాలు ఒకే భవనంలో ఉండే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వం మొగ్గుచూపింది.
కాగా, కళాశాల యాజన్యంతో అధికారులు సంప్రదింపులు జరపగా.. వారు నెలకు రూ.6 లక్షలు అద్దె డిమాండ్ చేశారు. అధికారులు సైతం కొంత సాగుకూలంగానే స్పందించారు. అయితే, ఎల్లంకి కాలేజీని పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వ వాస్తు సలహాదారుడు సుద్దాల సుధాకర్ తేజ.. భవనంలో వాస్తు దోషాలు ఉన్నాయని చెప్పారు. ఫలితంగా పాలనాపరమైన ఇబ్బందులు వస్తాయని హెచ్చరించడంతో అధికారులు వెనుకడుగు వేశారు.
‘ఇందూరు’కు న్యాక్ ఇబ్బందులు
కలెక్టర్ మరోసారి పట్టణంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలతో పాటు శివారులోని ఎంపీడీఓ ప్రాంగణం, అంబేద్కర్ భవన్, ఆర్డీఓ కార్యాలయం, మున్సిపల్ , పట్టణ శివారులోని ఇందూరు కళాశాలను పరిశీలించారు. వీటిలో ఇందూరు కాలేజీ కలెక్టరేకు అనుకూలంగా ఉంది. యాజమాన్యాన్ని సంప్రదించగా.. కాలేజీకి ఈ ఏడాది న్యాక్ గుర్తింపు లభించే అవకాశం ఉందని చెప్పారు. ఈనేపథ్యంలో అధికారులు మళ్లీ మొదటికే వచ్చారు. ఎంపీడీఓ ప్రాంగణం, అంబేద్కర్ భవన్, ఆర్డీఓ ప్రాంగణంలో కలెక్టరేట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అవసరమైతే సమీపంలోని ప్రైవేటు భవనాలు కొనుగోలు చేయాలని భావిస్తున్నారు.
సిద్దిపేటలోకి జెజ్జంకి మండలం
19 మండలాలతో ముసాయిదా విడుదల చేసిన సిద్దిపేట జిల్లాలోకి తాజాగా మరో మండలం కూడా కలుస్తున్నట్టు సమాచారం. మెజారిటీ ప్రజల అభిప్రాయం మేరకు కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలాన్ని కూడా సిద్దిపేట జిల్లాలో కలిపేందుకు అధికారులు ప్రాతిపదనలు సిద్ధం చేశారు.
సిద్దిపేట, చిన్నకోడూరు మండలాలకు ఆనుకొని ఉన్న దాదాపు 11 గ్రామాల ప్రజాప్రతినిధులు తమను సిద్దిపేట జిల్లాలోనే కలపాలని లేఖలు ఇచ్చారు. మరోవైపు ఇదే మండలంలోని కొన్ని గ్రామాల ప్రజాప్రతినిధులు మాత్రం కరీంనగర్ జిల్లాలోనే ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరువురి అభిప్రాయాలను గౌరవిస్తూ బెజ్జంకి మండల కేంద్రంతో పాటు తోటపల్లి గ్రామం వరకు సిద్దిపేట జిల్లాలో, మిగిలిన గ్రామాలకు గన్నేరువరం మండల కేంద్రాన్ని చేసి కరీంనగర్ జిల్లాలో ఉంచడానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కాగా, గుండ్లపల్లిని మండల కేంద్రంగా చేయాలనే డిమాండ్‌కు అధికారులు ప్రాముఖ్యాన్ని ఇవ్వలేదు.