official bunglow
-
ఆ బంగ్లా నుంచి కదిలేది లేదు: మాజీ సీఎం
సాక్షి, లక్నో : ఉత్తరప్రదేశ్‌లో అధికారిక బంగ్లాలను ఖాళీ చేయాలన్న సుప్రీం కోర్టు ఉత్తర్వులపై మాజీ సీఎంలు తలోరకంగా స్పందిస్తున్నారు. బంగ్లా ఖాళీ చేసేందుకు తమకు రెండేళ్ల సమయం కావాలని ఇప్పటికే ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్‌లు కోరగా, తాజాగా అధికారిక బంగ్లాను ఖాళీ చేసే ప్రసక్తేలేదని మాజీ సీఎం, బీఎస్పీ అధినేత్రి మాయావతి తేల్చిచెప్పారు. తాను ఉంటున్న బంగ్లా పార్టీ వ్యవస్ధాపకులు కాన్షీరాం స్మారక మందిరంగా ఆమె పేర్కొంటూ దాన్ని ఖాళీ చేయబోనని చెప్పారు. ఐదెకరాల సువిశాల ప్రాంగణంలో రాజస్థాన్ పింక్ మార్బుల్స్‌తో రూపొందిన పది పడకగదుల విలాసవంతమైన బంగ్లాను వీడేందుకు ఆమె నిరాకరిస్తున్నారు. ఆమె అధికారిక బంగ్లాకు ఇటీవలే శ్రీ కాన్షీరాం యాద్గార్ విశ్రామ్ స్థల్‌గా నామకరణం చేశారు. కాగా మాయావతి అధికారిక బంగ్లాను ఎందుకు ఖాళీ చేయదలుచుకోవడం లేదో వివరిస్తూ ఆమె సంతకంతో కూడిన ఐదు పేజీల వివరణ లేఖను పార్టీ నేత సతీష్ చంద్ర మిశ్రా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌కు శుక్రవారం అందచేశారు. 2011, జనవరి 13న మాయావతి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ బంగ్లాను కాన్షీరాం స్మారక మందిరంగా మారుస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ఈ సందర్భంగా మిశ్రా సీఎంకు చూపారు. ఈ ఆస్తికి కేర్‌టేకర్‌గా కేవలం రెండు గదుల్లో మాయావతి శాశ్వతప్రాతిపదికన ఉండవచ్చని కూడా ఈ ఉత్తర్వుల్లో అప్పటి ప్రభుత్వం పేర్కొంది. అయితే సుప్రీం కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా 15 రోజుల్లోగా అధికారిక బంగ్లాలను ఖాళీ చేయాలని మాయావతి, అఖిలేష్ యాదవ్ మరో నలుగురు మాజీ యూపీ ముఖ్యమంత్రులకు రాష్ట్ర ప్రభుత్వం గత వారం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. -
సీఎం బంగ్లాలో ఆవుల మంద
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నికైన యోగి ఆదిత్యనాథ్‌కు ఆవులంటే చాలా ఇష్టం. ఆయన ఆశ్రమంలో చాలా ఆవులు ఉన్నాయి. వాటిని ఆయన ఎంతో ప్రేమగా చూసుకునేవారు. ఇప్పుడు సీఎం అయిన తర్వాత ఆయన ఆశ్రమంలో ఉండటానికి కుదరదు. అధికారిక నివాసానికి తరలి వెళ్లాల్సిందే. లక్నోలోని సువిశాలమైన నెం.5 కాళిదాస్ మార్గ్ భవనానికి ఆయన వెళ్లనున్నారు. అయితే, తనతో పాటు తన ఆవుల మందను కూడా ఆయన ఆ భవనానికి తీసుకెళ్తున్నారట. చాలా సంవత్సరాలుగా యోగి ఆదిత్యనాథ్ గోసేవ చేస్తున్నారు. గోరఖ్‌నాథ్ ఆలయం ప్రాంగణంలోని గోశాలలో దాదాపు 460 ఆవులు, దూడలు ఉన్నాయి. గోరఖ్‌పూర్ వెళ్లినప్పుడల్లా ఆయన ముందుగా ఆవులకు మేత వేసి, ఆ తర్వాత దూడలకు పాలు, రొట్టెలు, బెల్లం పెడుతుంటారని నైమిశారణ్య ఆశ్రమానికి చెందిన స్వామి విద్యా చైతన్య మహరాజ్ చెప్పారు. ఆవులన్నింటినీ ఆయన పేర్లు పెట్టి పిలుస్తారని, వాటన్నింటిలో నందిని అనే ఆవు అంటే ఆయనకు ప్రత్యేకమైన అభిమానమని వివరించారు. గోరఖ్‌పూర్‌లోని గోశాలలో గుజరాత్, సెహ్వాల్, గిర్ తదితర ప్రాంతాల నుంచి తెచ్చిన మేలుజాతి ఆవులున్నాయని, రోజుకు వంద లీటర్లకు పైగా పాలిస్తాయని చైతన్య మహరాజ్ వివరించారు. ఆదిత్యనాథ్ రోజూ తెల్లవారుజామున 3 గంటలకు నిద్రలేచి, 4-5 గంటల మధ్య యోగాభ్యాసం చేస్తారని, తర్వాత దైవారాధన అనంతరం గోరఖ్‌నాథ్ మఠం, ఆలయ ప్రాంగణాలకు వెళ్లి అక్కడ పరిశుభ్రతను పరిశీలిస్తారన్నారు. తర్వాత అక్కడి నుంచి గోశాలకు వెళ్తారట. ఇవన్నీ అయిన తర్వాతే ఆయన తన కార్యాలయానికి వెళ్లి, అక్కడ ప్రజల కష్టాలు తెలుసుకుంటారని తెలిపారు.