సీఎం బంగ్లాలో ఆవుల మంద | so many cows to follow yogi adityanath to his bunglow | Sakshi
Sakshi News home page

సీఎం బంగ్లాలో ఆవుల మంద

Published Sat, Mar 25 2017 6:27 PM | Last Updated on Tue, Sep 5 2017 7:04 AM

సీఎం బంగ్లాలో ఆవుల మంద

సీఎం బంగ్లాలో ఆవుల మంద

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నికైన యోగి ఆదిత్యనాథ్‌కు ఆవులంటే చాలా ఇష్టం. ఆయన ఆశ్రమంలో చాలా ఆవులు ఉన్నాయి. వాటిని ఆయన ఎంతో ప్రేమగా చూసుకునేవారు. ఇప్పుడు సీఎం అయిన తర్వాత ఆయన ఆశ్రమంలో ఉండటానికి కుదరదు. అధికారిక నివాసానికి తరలి వెళ్లాల్సిందే. లక్నోలోని సువిశాలమైన నెం.5 కాళిదాస్ మార్గ్ భవనానికి ఆయన వెళ్లనున్నారు. అయితే, తనతో పాటు తన ఆవుల మందను కూడా ఆయన ఆ భవనానికి తీసుకెళ్తున్నారట. చాలా సంవత్సరాలుగా యోగి ఆదిత్యనాథ్ గోసేవ చేస్తున్నారు. గోరఖ్‌నాథ్ ఆలయం ప్రాంగణంలోని గోశాలలో దాదాపు 460 ఆవులు, దూడలు ఉన్నాయి. గోరఖ్‌పూర్ వెళ్లినప్పుడల్లా ఆయన ముందుగా ఆవులకు మేత వేసి, ఆ తర్వాత దూడలకు పాలు, రొట్టెలు, బెల్లం పెడుతుంటారని నైమిశారణ్య ఆశ్రమానికి చెందిన స్వామి విద్యా చైతన్య మహరాజ్ చెప్పారు. ఆవులన్నింటినీ ఆయన పేర్లు పెట్టి పిలుస్తారని, వాటన్నింటిలో నందిని అనే ఆవు అంటే ఆయనకు ప్రత్యేకమైన అభిమానమని వివరించారు.

గోరఖ్‌పూర్‌లోని గోశాలలో గుజరాత్, సెహ్వాల్, గిర్ తదితర ప్రాంతాల నుంచి తెచ్చిన మేలుజాతి ఆవులున్నాయని, రోజుకు వంద లీటర్లకు పైగా పాలిస్తాయని చైతన్య మహరాజ్ వివరించారు. ఆదిత్యనాథ్ రోజూ తెల్లవారుజామున 3 గంటలకు నిద్రలేచి, 4-5 గంటల మధ్య యోగాభ్యాసం చేస్తారని, తర్వాత దైవారాధన అనంతరం గోరఖ్‌నాథ్ మఠం, ఆలయ ప్రాంగణాలకు వెళ్లి అక్కడ పరిశుభ్రతను పరిశీలిస్తారన్నారు. తర్వాత అక్కడి నుంచి గోశాలకు వెళ్తారట. ఇవన్నీ అయిన తర్వాతే ఆయన తన కార్యాలయానికి వెళ్లి, అక్కడ ప్రజల కష్టాలు తెలుసుకుంటారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement