సాక్షి, లక్నో : ఉత్తరప్రదేశ్‌లో అధికారిక బంగ్లాలను ఖాళీ చేయాలన్న సుప్రీం కోర్టు ఉత్తర్వులపై మాజీ సీఎంలు తలోరకంగా స్పందిస్తున్నారు. బంగ్లా ఖాళీ చేసేందుకు తమకు రెండేళ్ల సమయం కావాలని ఇప్పటికే ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్‌లు కోరగా, తాజాగా అధికారిక బంగ్లాను ఖాళీ చేసే ప్రసక్తేలేదని మాజీ సీఎం, బీఎస్‌పీ అధినేత్రి మాయావతి తేల్చిచెప్పారు. తాను ఉంటున్న బంగ్లా పార్టీ వ్యవస్ధాపకులు కాన్షీరాం స్మారక మందిరంగా ఆమె పేర్కొంటూ దాన్ని ఖాళీ చేయబోనని చెప్పారు. ఐదెకరాల సువిశాల ప్రాంగణంలో రాజస్థాన్ పింక్ మార్బుల్స్‌తో రూపొందిన పది పడకగదుల విలాసవంతమైన బంగ్లాను వీడేందుకు ఆమె నిరాకరిస్తున్నారు.
ఆమె అధికారిక బంగ్లాకు ఇటీవలే శ్రీ కాన్షీరాం యాద్గార్ విశ్రామ్ స్థల్‌గా నామకరణం చేశారు. కాగా మాయావతి అధికారిక బంగ్లాను ఎందుకు ఖాళీ చేయదలుచుకోవడం లేదో వివరిస్తూ ఆమె సంతకంతో కూడిన ఐదు పేజీల వివరణ లేఖను పార్టీ నేత సతీష్ చంద్ర మిశ్రా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌కు శుక్రవారం అందచేశారు. 2011, జనవరి 13న మాయావతి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ బంగ్లాను కాన్షీరాం స్మారక మందిరంగా మారుస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ఈ సందర్భంగా మిశ్రా సీఎంకు చూపారు.
ఈ ఆస్తికి కేర్‌టేకర్‌గా కేవలం రెండు గదుల్లో మాయావతి శాశ్వతప్రాతిపదికన ఉండవచ్చని కూడా ఈ ఉత్తర్వుల్లో అప్పటి ప్రభుత్వం పేర్కొంది. అయితే సుప్రీం కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా 15 రోజుల్లోగా అధికారిక బంగ్లాలను ఖాళీ చేయాలని మాయావతి, అఖిలేష్ యాదవ్ మరో నలుగురు మాజీ యూపీ ముఖ్యమంత్రులకు రాష్ట్ర ప్రభుత్వం గత వారం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment