చట్టబద్ధంగా ఫార్మసీల్లో గంజాయి అమ్మకం
మోంటెవీడియో: సంచలనంగా మారిన హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ కేసు దర్యాప్తులో రోజుకో కొత్తకోణం వెలుగులోకి వస్తోంది. సోషల్ మీడియాలోనైతే దీనిపైన విపరీతమైన చర్చనడుస్తోంది. ఈ క్రమంలోనే కొందరు ఔత్సాహికులు.. అత్యంత ప్రమాదకరంకాని డ్రగ్స్ అమ్మకాలను చట్టబద్ధం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే అందుకు మన చట్టాలు ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించవు. పైగా నూటికి 99 శాతం మంది ప్రజలు మాదకద్రవ్యాలకు వ్యతిరేకులే! మనమేకాదు, ప్రపంచంలోని మెజారిటీ దేశాలన్నీ డ్రగ్స్‌ను నిషేధిత పదార్థాలుగానే పేర్కొంటాయి. కాగా, దక్షిణ అమెరికాలోని ఉరుగ్వేలో ఇటీవల అమలులోకి వచ్చిన చట్టం చర్చనీయాంశమైంది.
అక్కడి ప్రభుత్వం స్థానిక మెడికల్ స్టోర్లలో చట్టబద్ధంగా మత్తుపదార్థమైన గంజాయి అమ్మకాలను గతవారం ప్రారంభించింది. ప్రపంచంలోనే డ్రగ్స్‌ను చట్టబద్ధం చేసిన తొలి దేశంగా ఉరుగ్వే రికార్డులకెక్కింది. ఇందుకోసం గడిచిన నాలుగేళ్లలో భారీ తతంగం నడిచింది. మొదట, 2013లో గంజాయి అమ్మకాలను చట్టబద్ధం చేస్తూ ఉరుగ్వే జనరల్ అసెంబ్లీ బిల్లును ఆమోదించింది. అటుపై అధికారులు.. గంజాయి సాగుకు టెండర్లు పిలిచారు. అదే సమయంలో సుమారు 7వేల మంది వినియోగదారుల వివరాలను సేకరించి ఆన్లైన్లో పొందుపర్చారు. గంజాయి అమ్మేలా అన్ని మెడికల్ స్టోర్ల యజమానులతో చర్చలు జరిపారు. కానీ 16 దుకాణాలు మాత్రమే గంజాయి అమ్మేందుకు అంగీకరించాయి. చట్టం చేసిన నాలుగేళ్ల తర్వాత ఎట్టకేలకు గతవారం నుంచి అమ్మకాలు ప్రారంభమయ్యాయి.
ఒక్కో ప్యాకెట్లో 5 గ్రాములు..
18 ఏళ్లు నిండిన పౌరులు ఎవరైనా తమ పేరును రిజిస్టర్ చేసుకుని స్వేచ్ఛగా గంజాయి కొని, ఆస్వాదించొచ్చు. ప్రస్తుతం మెడికల్ షాపుల్లో ఒక్కోటి 5 గ్రాముల బరువుండే ఆల్ఫా, బీటా రకాల గంజాయిని అందుబాటులో ఉంచారు. ప్యాకెట్ ధరను 6.6 డాలర్లుగా నిర్ధారించారు. అమ్మకాల ద్వారా వచ్చే సొమ్ములో పెట్టుబడి పోను అదనపు లాభాన్ని ఫార్మసీలు, ప్రభుత్వానికి దక్కుతాయి. తద్వారా పోగయ్యే నిధులను.. దేశంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా అరికట్టేందుకు వినియోగిస్తామని ప్రభుత్వాధికారులు చెబుతున్నారు.