రేణుకా చౌదరికి కాంగ్రెస్ అధిష్ఠానం షాక్!
ఫైర్ బ్రాండ్ నాయకురాలు రేణుకా చౌదరికి కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అనుకోని షాక్ ఇచ్చింది. ఆమెను కాంగ్రెస్ అధికార ప్రతినిధి పదవి నుంచి తప్పించింది. ఇక మీదట టీవీ చానళ్లలో వచ్చే చర్చా కార్యక్రమాలలో పాల్గొనవద్దని ఆదేశించింది. కాంగ్రెస్ విధానాలను సరైన పద్ధతిలో రేణుకా చౌదరి తీసుకెళ్లడంలేదని భావిస్తున్న అధిష్ఠానం ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్ర విభజన అంశం గురించి జోరుగా చర్చలు జరుగుతుండగా, మరోవైపు హైదరాబాద్ నగరంతో పాటు భద్రాచలం అంశంపైనా పలు వివాదాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో ఖమ్మం జిల్లా నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహించిన రేణుకా చౌదరిని కాంగ్రెస్ పార్టీ ఇలా అధికార ప్రతినిధి పదవి నుంచి తప్పించడం పార్టీ వర్గాల్లో చర్చకు దారితీసింది. రేణుక తెలంగాణ ఆడపడుచు ఎలా అవుతుందంటూ తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకులు వాదిస్తుండగానే ఆమెను పదవి నుంచి తప్పించడం కూడా చర్చకు వస్తోంది.