జీఎస్టీ...అయితే ఏంటి?
ఒకే దేశం..ఒకే పన్ను నినాదంతో రూపుదిద్దుకున్న జీఎస్టీ(వస్తు సేవల పన్ను) విధానం దేశంలో అమల్లోకి వచ్చి 18 నెలలు గడిచినా ఆచరణలో వినియోగదారుడికి కలిగిన ప్రయోజనం శూన్యంగా ఉంది. జీఎస్టీ అమల్లోకి వస్తే ధరలు అమాంతం దిగివస్తాయని కేంద్ర ప్రభుత్వం ఆడంబరంగా చెప్పిన మాటలు వాస్తవ రూపం దాల్చలేదు. ధరలు ఏమాత్రం తగ్గకపోగా, మరింత పెరిగాయి. అక్రమ వ్యాపారం కూడా యథేచ్ఛగా జరుగుతూనే ఉంది.
సాక్షి, పాతగుంటూరు: జీఎస్టీ అమల్లోకి వచ్చాక వ్యాట్ కంటే ఈ విధానం కింద ప్రభుత్వానికి గణనీయంగా పన్ను వసూళ్లు పెరిగిన మాట వాస్తవమే. అయితే ఇదే సందర్భంలో కొద్దిమంది వ్యాపారులు ఈ పన్నును సైతం తమకు అనుకూలంగా మార్చుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నట్లు స్పష్టమవుతోంది. జీఎస్టీ అమల్లోకి వచ్చి పలు దఫాలుగా పన్ను రేట్లలో కేంద్ర ప్రభుత్వం మార్పులు తెచ్చినా ధరల్లో ఏమాత్రం వ్యత్యాసం కనబడటం లేదు.పూర్తిస్థాయిలో ఆన్లైన్ ప్రక్రియ అమలు కాక, రూ.200 దాటిన సరుకులకు బిల్లులు ఇవ్వకపోవడంతో వినియోగదారుల జేబుకు చిల్లుపడుతోంది. వినియోగదారులు అప్రమత్తంగా వ్యవహరించకపోవడం ఈ విషయంలో ఆ వ్యాపారులకు కలిసివస్తోంది. రాత్రి వేళల్లో సరుకు ఎలాంటి వేబిల్లు లేకుండా రవాణా జరుగుతున్నా అరికట్టడంలో అధికారులు విఫలమవుతున్నారు.దీంతో ప్రభుత్వ ఖజానాకు గండిపడుతోంది.
30 శాతం పెరిగిన రాబడి
దేశంలో 2017 జూలై ఒకటో తేదీ నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చింది. దీంతో జిల్లాలో గతం కంటే పన్ను రాబడులు ఆశాజనకంగా ఉన్నాయి. వ్యాట్‌తో పోలిస్తే జీఎస్టీ వలన 30 శాతం రాబడి అధికంగా వస్తోందని సీటీవో వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వానికి జీఎస్టీ పన్ను విధానం ఫలితంగా ఆదాయం పెరిగినా వినియోగదారులకు పూర్తిస్థాయిలో ప్రయోజనం కలగడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జీఎస్టీ అమలులో కొందరు వ్యాపారులు సాగిస్తున్న అక్రమాలపై ఇటీవల ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి.బిల్లులు లేకుండా ఇష్టారాజ్యంగా ధరలను పెంచి విక్రయాలు నిర్వహిస్తున్నారనే క్రమంలో ప్రభుత్వ ఆదేశాలతో వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో డెకాయ్ ఆపరేషన్ పేరుతో దుకాణాలపై దాడులు తనిఖీలు చేపట్టారు. ఇదే సందర్భంలో వ్యాపార సంఘాల నుంచి వచ్చిన ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గింది. ఆపై తదుపరి చర్యలను పక్కన పెట్టింది.
దీన్ని కొందరు వ్యాపారులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నట్లు విమర్శలు వస్తున్నాయి. రూ.200 విలువ దాటిన ఏ వస్తువుకైనా డీలర్‌కు కేటాయించిన రిజిస్ట్రేషన్ గుర్తింపుతో బిల్లు ఇవ్వాలన్న నిబంధన ఉండేది. జీఎస్టీ ప్రకారం పన్ను వసూలు, వినియోగదారులకు చిల్లు పడకుండా వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పర్యవేక్షణ ఉన్నా అక్కడక్కడ వ్యాపారులదే పైచేయి అవుతోంది. తెల్ల కాగితాలపై కాకుండా దుకాణం, సంస్థ పేరు మీదుగా బిల్లులు ఇవ్వడం లేదు. అయినా వినియోగదారుల నుంచి రాతపూర్వక ఫిర్యాదులు అందడం లేదన్న కారణం చూపి అధికారులు చర్యలకు ఉపక్రమించడం లేదు. జిల్లాలోని రెండు డివిజన్ల(నరసరావుపేట, గుంటూరు)లో జీఎస్టీ వసూళ్లు పెరిగి ఆదాయం గణనీయంగా లభించింది. ఈ ఏడాది ఏప్రిల్‌తో ప్రారంభమైన 2018–19 ఆర్థిక సంవత్సరంలో నరసరావుపేట డివిజన్‌కు రూ.211,72,47 కోట్లు, వాహన తనిఖీల ద్వారా రూ.61,71 లక్షల రూపాయలు ఆదాయం రాగా, గుంటూరు డివిజన్లో రూ.45254.51 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. నరసరావుపేట డివిజన్లో రెగ్యులర్ డీలర్లు మొత్తం 14746 వేల మంది ఉండగా, కాంపోజిషన్ స్కీమ్ ద్వారా 6753 మంది డీలర్లు నమోదై ఉన్నారు.గుంటూరు డివిజన్లో మొత్తం డీలర్లు 18,899 మంది ఉండగా,వారిలో రెగ్యులర్13,339, కాంపోజిషన్ స్కీంలో 5,689 మంది డీలర్లు నమోదై ఉన్నారు.
పన్ను పరిధిలోకి...
వార్షిక టర్నోవర్ రూ.40 లక్షలు దాటిన వ్యాపారులు జీఎస్టీ కింద డీలర్‌గా నమోదు చేసుకోవాల్సి ఉంది. ఏడాదికి రూ.1.50 కోట్ల లావాదేవీలు దాటితే కాంపోజిట్ డీలర్‌గా గుర్తింపు పత్రం తీసుకోవాలి. నిబంధనలు ప్రకారం కాంపోజిట్ డీలరు వినియోగదారుల నుంచి జీఎస్టీ వసూలు చేయరాదు. ఈ విషయాన్ని తెలిపేందుకు దుకాణాల ముందు బోర్డు ప్రదర్శించాల్సి ఉంది. 2018 ఏప్రిల్ నుంచి రూ.50 వేలు దాటితే సరుకు, సామాగ్రి, ఇతర వాటికి వేబిల్లు ఉండాల్సిందేనని జీఎస్టీలో నిబంధన విధించారు.
రూ.200 దాటిన విక్రయాలపై బిల్లులేవీ?
రూ.200 దాటిన విక్రయాలపై ఆన్లైన్ బిల్లులు ఇవ్వని కారణంగా వినియోగదారుడి జేబుకు చిల్లు పడుతుంది. ధరల వ్యత్యాసంలో కూడా తేడా కనిపించడం లేదు.కొందరు వ్యాపారులు సరకు నాణ్యతను సాకుగా చూపించి ఇష్టారాజ్యంగా ధరలను వసూలు చేస్తున్నారు. ప్రధాన వ్యాపార కూడళ్లలోని దుకాణాలలో ఈ తంతు యథేచ్ఛగా సాగుతోంది. జీఎస్టీలో గుర్తింపు పొందిన వ్యాపారి(డీలర్)విధిగా జారీ చేసిన ధ్రువీకరణ పత్రం దుకాణాల్లో ప్రదర్శించాలి. దీన్ని బేఖాతరు చేసిన వర్తకులపై ఆకస్మిక తనిఖీలు చేసి అపరాధ రుసుం విధించాల్సి ఉంది. కానీ అలాంటి దాఖలాలేవీ కనిపించడం లేదు.రూ.50 వేలు విలువ దాటిన సరుకు, సామాగ్రిని రవాణా చేసే కొందరు వ్యాపారులు వేబిల్లు లేకుండా రవాణా చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. సంబంధిత వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఫిర్యాదు చేస్తే చర్యలు
జీఎస్టీలో వినియోగదారుల ప్రయోజనాలకు గండికొడుతున్న వ్యాపారులపై రాత పూర్వకంగా ఫిర్యాదులు అందలేదు. రూ.200 విలువ దాటిన వస్తువులపై తప్పకుండా బిల్లు తీసుకోవడానికి వినియోగదారులు ఆసక్తి చూపాలి. అప్పుడే ధరలు వ్యత్యాసం కనబడి, అక్రమాలకు అడ్డుకట్ట పడుతుంది. వ్యాపారులు ప్రతి లావాదేవీ పూర్తిగా ఆన్లైన్లోనే నిర్వహించాలి.జీఎస్టీ పరంగా వినియోగదారులను మోసగించవద్దని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు ఉంటాయని డీలర్ల సమావేశాల్లో స్పష్టం చేస్తున్నాం. రూ.50 వేలు దాటిన సరుకు వేబిల్లుతో రవాణా జరిగేలా చర్యలు చేపడుతున్నాం.
–పి.రాజాబాబు, జాయింట్ కమిషనర్, రాష్ట్ర పన్నుల శాఖ, గుంటూరు డివిజన్