
నిందితుడిని ఉరి తీయాలంటూ పోలీస్ స్టేషన్ వద్ద గొడవ చేస్తోన్న ఆందోళనకారులు
సాక్షి, గుంటూరు జిల్లా: గుంటూరులో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలికపై యువకుడు అత్యాచారయత్నం చేశాడు. దీంతో నిందితుడుని పట్టుకుని ఉరి తీయాలంటూ బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. పాత గుంటూరు పోలీసు స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. రాజీవ్ గృహకల్ప సముదాయంలో నివాసం ఉండే రాజాసింగ్ అనే యువకుడు బేకరీలో పని చేస్తుంటాడు. డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చిన రాజాసింగ్.. అక్కడ ఆడుకుంటున్న పదేళ్ల చిన్నారిని తనతోపాటు ఇంట్లోకి తీసుకెళ్లాడు. అక్కడ బాలికపై అత్యాచారయత్నం చేయబోవటంతో బాలిక కేకలు పెట్టింది.
దీంతో గమనించిన స్థానికులు రాజాసింగ్‌ని పట్టుకుని దేహశుద్ది చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. నిందితుడుని వెంటనే ఉరి తీయాలంటూ బాలిక బంధువులు పెద్ద ఎత్తున పాత గుంటూరు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఒక దశలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పరిస్థితి చేయిదాటి పోయేలా ఉండటంతో ప్రత్యేక పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. ఆందోళనకారులను అక్కడ్నుంచి చెదరగొట్టారు. ఒక దశలో ఆందోళనకారులు రాళ్లు విసరటంతో పోలీస్ స్టేషను అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటనల నేపథ్యంలో పాతగుంటూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment