
సాక్షి, గుంటూరు: బాలికపై యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటనపై గుంటూరు నగరంలో ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. జిల్లాలో గత కొద్దిరోజులుగా జరుగుతున్న అత్యాచార ఘటనలతో జనంలో ఉన్న ఆగ్రహం తాజా ఘటనతో ఉగ్రరూపం దాల్చింది. ఆ మృగాడిని తమకు అప్పగించాలంటూ వేలాదిమంది జనం బాధిత కుటుంబానికి అండగా మంగళవారం అర్ధరాత్రి రోడ్లపైకి చేరారు. ఏకంగా పాతగుంటూరు పోలీస్ స్టేషన్‌నే ముట్టడించేందుకు ప్రయత్నించారు. స్టేషన్ పైకి రాళ్లు రువ్వుతూ దాడికి దిగడంతో భయానక వాతావరణం నెలకొంది. పోలీసులు ఆందోళనకారుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.
ఆందోళనకారుల రాళ్లదాడితో అర్బన్ ఎస్పీ విజయరావుతోపాటు సుమారు 15 మంది పోలీసులకు గాయాలయ్యాయి. పరిస్థితి అదుపుతప్పుతుండడంతో భారీ ఎత్తున బలగాలను తరలించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. బాలిక తల్లిదండ్రులతో మాట్లాడి నిందితుడిని కఠినంగా శిక్షిస్తామంటూ హామీ ఇచ్చిన అడిషనల్ డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షించారు. మంగళవారం రాత్రి జరిగిన దుర్ఘటనతో నగరంలో 144 సెక్షన్ అమలులోకి తీసుకొచ్చారు. నిందితుడిపై పోక్సో, నిర్భయ యాక్ట్‌తో పాటు పలు ఐపీసీ సెక్షన్‌లు నమోదు చేసి అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు.