మరిన్ని నగరాలకు ఒమన్ ఎయిర్ సర్వీసులు
సంస్థ ఇండియా మేనేజర్ భాను మోహన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానయాన రంగంలో ఉన్న ఒమన్ ఎయిర్ భారత్‌లో కొత్త నగరాల్లో అడుగు పెట్టనుంది. ఇప్పటికే హైదరాబాద్‌తోపాటు 11 నగరాల కు కంపెనీ విమానాలను నడిపిస్తోంది. కోల్‌కత, అహ్మదాబాద్, కన్నూర్ నగరాలకు విస్తరించేందుకు డీజీసీఏకు దరఖాస్తు చేసుకుంది. దక్షిణాదిన మరో రెండు మూడు నగరాలకు కూడా సర్వీసులను అందించాలని భావిస్తున్నట్టు ఒమన్ ఎయిర్ ఇండియా మేనేజర్ భాను మోహన్ కైలా సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు.
ప్రస్తుతం వారంలో 126 సర్వీసులను నడిపిస్తున్నట్టు చెప్పారు. భారత్ నుంచి 2015లో ఒమన్‌కు 3 లక్షల మంది వెళ్లారు. 2014తో పోలిస్తే ఇది 17 శాతం అధికమని ఒమన్ టూరిజం డిప్యూటీ డెరైక్టర్ జనరల్ అస్మా అల్ హజ్రీ తెలిపారు. జీసీసీ దేశాల తర్వాత ఒమన్‌కు అత్యధికంగా భారత్ నుంచి వస్తున్నారని వెల్లడించారు. ‘గతేడాది ప్రపంచ నలుమూలల నుంచి 21 లక్షల మంది పర్యాటకులు మా దేశంలో అడుగుపెట్టారు. 2040 నాటికి 50 లక్షల మందిని ఆకర్షించాలన్నది లక్ష్యం’ అని ఆమె వివరించారు.