ఎన్కౌంటర్: మావోయిస్టు ఏరియా కార్యదర్శి మృతి
చర్ల: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బస్తర్ జిల్లాలో ఆదివారం సాయంత్రం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ బార్చూర్ ఏరియా కమిటీ కార్యదర్శి విలాప్ మృతి చెందాడు. సంఘటన స్థలంలో ఏకే-47 ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల సరిహద్దులో ఉన్న బస్తర్ జిల్లాలోని బుర్గుం పోలీస్‌స్టేషన్ పరిధిలో గల అటవీ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంలో తారసపడ్డ మావోయిస్టులు పోలీసులపై కాల్పులు జరిపారు. ఈ క్రమంలో పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన బార్చూర్ ఏరియా కమిటీ కార్యదర్శి విలాప్ మృతి చెందారు. మృతదేహం వద్ద నుంచి ఒక ఏకే-47 తుపాకీని, కిట్‌బ్యాగ్‌ను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. మృతి చెందిన మావోయిస్టు ఏరియా కమిటీ కార్యదర్శి విలాప్పై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం రూ 16 లక్షల రివార్డ్‌ను ప్రకటించి ఉన్నట్లు తెలిసింది.