ఓటింగ్‌లో వందశాతం పాల్గొనాలి
భైంసా/భైంసారూరల్, న్యూస్‌లైన్ : మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు ఎలాంటి ఒత్తిడికి, ప్రలోభాలకు లొంగకుండా వందశాతం ఓటింగ్‌లో పాల్గొనాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అహ్మద్ బాబు సూ చించారు. ఎన్నికల నేపథ్యంలో శనివారం భైంసా పట్టణానికి వచ్చిన కలెక్టర్ మున్సిపల్ ఎన్నికల అధికారి ప్రభాకర్, ముథోల్ ఎన్నికల అధికారి ఎస్ఎస్ రాజుతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలింగ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్‌లో పాల్గొనే సిబ్బంది ఈవీఎంలు, పోలిం గ్ సామగ్రి పంపిణీ తీరును అడిగి తెలుసుకున్నారు. ఈవీ ఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూంను పరిశీలించారు. కౌం టింగ్ నిర్వహించే హాలుకు వెళ్లారు.
పోలింగ్ కేంద్రాల పరిశీలన..
పట్టణంలోని సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వివరాలను తెలుసుకున్న కలెక్టర్ అహ్మద్‌బాబు రెండు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. కుంట ప్రాం తంలోని నాలుగో పోలింగ్ కేంద్రంలో సిబ్బందితో చర్చిం చారు. ఓటరు జాబితాను పరిశీలించారు. పాఠశాల చుట్టూ ప్రహరీ లేదని, పోలింగ్‌లో పాల్గొనే వారు సమయం అయిపోయాక వచ్చే అవకాశం ఉందని సిబ్బంది కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన కలెక్టర్ ప్రత్యేక బలగాలను మోహరించాలని డీఎస్పీ గిరిధర్‌కు ఆదేశాలిచ్చారు.
పాఠశాల చుట్టూ కట్టెలతో భారీకేడ్లను ఏర్పాటు చేయించాలని మున్సిపల్ ఎన్నికల అధికారులకు సూచించారు. ఫిల్టర్‌బెడ్ ప్రాంతంలోని ఏడో పోలింగ్ కేంద్రానికి వెళ్లి వెబ్ కాస్టింగ్ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. బాసర ట్రిపుల్ఐటీ విద్యార్థి ల్యాప్‌టాప్ ద్వారా పోలింగ్ కేంద్రాల్లోని దృశ్యాలను చిత్రీకరించి జిల్లా, రాష్ట్ర ఎన్నికల కార్యాల యానికి పంపించేలా అ నుసంధానం చేశారు. ఈ విధానాన్ని కలెక్టర్ ప రిశీలించారు. నెట్ సౌకర్యంలో తలెత్తుతున్న ఇబ్బందులపై బీఎస్ఎన్ఎల్ ఇంజినీర్లను ప్రశ్నిం చారు. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి ఇబ్బం దులు తలెత్తకుండా చూడాలని సూచించా రు. వెబ్‌కాస్టింగ్ విధానంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.
పూర్తిస్థాయిలో నిఘా..
జిల్లా వ్యాప్తంగా ఆరు మున్సిపాలిటీల్లో ఆదివారం జరగబోయే పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ అహ్మద్‌బాబు వివరించారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ఆరు మున్సిపాలిటీల్లో 327 వార్డుల్లో పోలింగ్ జరుగబోతోందని, 2 వేల మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొనబోతున్నారని వివరించారు. 320 మంది ట్రిపుల్ఐటీ విద్యార్థులతో అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్ట్ విధానంలో అక్కడి చిత్రాలను ప్రధాన ఎన్నికల కార్యాలయాలకు పంపేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు.ఇందుకుగాను 170 మంది మైక్రో అబ్జర్వర్లను, మరో 120 మంది వీడియో గ్రాఫర్లను నియమించామన్నారు. పోలింగ్ తీరుపై పూర్తిస్థాయిలో నిఘా ఉంటుందని, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్నివిధాలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.