ప్రాణం తీసిన ప్రాయశ్చిత్తం
భోపాల్: పంచాయతీ పెద్దల తీర్పు మధ్యప్రదేశ్ లో ఓ వృద్ధరైతు మరణానికి కారణమైంది. బుందేల్ ఖండ్ ప్రాంతంలోని ఛత్తర్ పూర్ జిల్లా బాదా మల్హెరా గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటనను ‘ది టెలిగ్రాఫ్’ వెలుగులోకి తెచ్చింది. హర్ సింగ్ లోధి పొలంలో ఇటీవల ఓ ఆవు దూడ చనిపోయింది. దాని ప్రక్కనే ఎలుకల మందు డబ్బా పడివుండడంతో దూడ మరణానికి హర్ సింగ్ కారణమని పంచాయతీ పెద్దలు తీర్మానించారు. ఆయనకు రూ. 500 జరిమానా విధించి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఆదేశించారు.
దీనికి అంగీకరించిన సింగ్ మూడు గంటల పాటు ఒంటికాలిపై నిల్చోని ఒక్కసారిగా కుప్పకూలిపోయి ప్రాణాలు వదిలాడు. ‘దూడ మరణానికి మా నాన్నే కారణమని పంచాయతీ పెద్దలు తేల్చారు. వారి తీర్పును అంగీకరించి ఒంటి కాలిపై నిల్చున్నారు. కాళ్లు అటుఇటు మారుస్తూ మూడు గంటలపాలు నిల్చుకున్నాడు. తర్వాత కుప్పకూలిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పార’ని హర్ సింగ్ కొడుకు దరియాబ్ కన్నీళ్ల పర్యంతమయ్యాడు.
గోపరిరక్షకులుగా చెలామణి అవుతున్న కొంతమంది అమాయకుల చావుకు కారణమైన ఉదంతాలు గతంలోనూ రాష్ట్రంలో జరిగాయి. చనిపోయిన ఆవు చర్మాన్ని ఒలిచారనే కారణంతో జూలై నలుగురు దళిత యువకులను గోపరిరక్షకులు చావబాదారు.