ఒంగోలు పీటీసీ డీఎస్పీ ఇంటిపై ఏసీబీ దాడులు
ప్రకాశం : ఒంగోలు పీటీసీ డీఎస్పీ దుర్గాప్రసాద్ ఇంటిపై బుధవారం అవినీతి నిరోధక శాఖాధికారులు మెరుపు దాడులకు దిగారు. గుంటూరు బ్రాడీపేటలోని దుర్గాప్రసాద్ నివాసంతో పాటు, ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. గుంటూరు, ఒంగోలు, హైదరాబాద్‌లలో ప్రస్తుతం దాడులు జరుగుతున్నాయి.
ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలతో ఏసీబీ అధికారులు దాడులకు దిగారు. ఈ దాడుల్లో భారీగా అక్రమ ఆస్తులు గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఒంగోలు పోలీస్ ట్రైనింగ్ కాలేజీ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. దుర్గాప్రసాద్ కొంతకాలంగా గుంటూరు నుంచే ఒంగోలు కార్యాలయ వ్యవహారాలను నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. దుర్గాప్రసాద్ గతంలో పనిచేసిన ప్రాంతాల్లో కూడా భారీగా అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ దాడులకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఈ దాడుల సమాచారం తెలియగానే డీఎస్పీ బాధితులు సంబరాలు చేసుకున్నారు. దుర్గాప్రసాద్ ఇంటి ఎదుటే బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు. డీఎస్పీ తమను అన్యాయంగా వేధించాడని బాధితులు ఆవేదనను వ్యక్తం చేశారు.