డిజిటల్ కీల వాపస్
ఆర్డీఓలకు ఇచ్చిన తహసీల్దార్లు
కలెక్టర్, జేసీలకు వినతిపత్రాలు
సాంకేతిక సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి
హన్మకొండ అర్బన్ : తెలంగాణ తహసీల్దార్ల సంఘం (టీడీటీఏ) రాష్ట్ర సంఘం పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్లు తమ వద్ద ఉన్న డిజిటల్ కీలను శుక్రవారం ఆర్డీఓలకు అందజేశారు. ఆన్లైన్లో తలెత్తుతున్న సాంకేతికలోపంతో ప్రజల సమస్యలను సకాలంలో పరి ష్కరించలేకపోతున్నామంటూ తహసీల్దార్లు తమ వద్ద ఉన్న డిజిటల్ కీలను ఉన్నతాధికారులకు ఇచ్చారు. తమ సమస్యలు వివరిస్తూ కలెక్టర్, జేసీలకు కలిసి వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్లు మాట్లాడుతూ సాంకేతిక సమస్యలతో మ్యూటేషన్లు, పాస్ పుస్తకాలజారీ, పౌర సరఫరాల వ్యవస్థ కుంటుపడుతోందని తెలిపారు. సాంకేతిక లోపం కారణంగా ప్రస్తుత సీజన్లో రైతులకు సకాలంలో సేవలు అందించలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.
నిలిచిన ధ్రువీకరణ పత్రాల జారీ
తహసీల్దార్లు డిజిటల్ కీలను ఆర్డీఓలకు అప్పగించడంతో జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ నుంచి జరిగిగే ఆన్లైన్ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఒక్క రోజే సుమారు 15వేలకు పైగా కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల జారీ పక్రియకు బ్రేక్ పడింది. పహణీల్లో మార్పులు, రేషన్‌కార్డుల పరిశీలన పక్రియ కూడా నిలిచిపోయింది. కాగా, తహసీల్దార్ల నిర్ణయంపై ఉన్నతాధికారులు కూడా స్పందించలేదు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుందా అనే విషయంలో స్పష్టత రాలేదు. ప్రభుత్వం తమ సంఘం ప్రతినిధులతో చర్చలు జరిపి సమస్యకు పరిష్కారం చూపితే తప్ప డిజిటల్ కీ వాపస్ తీసుకునేది లేదని జిల్లా తహసీల్దార్ల సంఘం ప్రతినిధులు స్పష్టం చేశారు. కలెక్టర్, జేసీని కలిసిన వారిలో తహసీల్దార్ల సంఘం జిల్లా అధ్యక్షుడు పూల్‌సింగ్ చౌహాన్, రాష్ట్ర కార్యదర్శి చెన్నయ్య, ఉపాధ్యక్షులు రవి, నాయకులు రాజ్‌కుమార్, కిరణ్‌ప్రకాష్, రవి, రాము తదితరులు ఉన్నారు.