ఆన్లైన్ శుభాకాంక్షలు
కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుకోవాలంటే ఒకప్పుడు.. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి వారం రోజుల ముందే గ్రీటింగ్స్ కొనుగోలు చేసి పోస్ట్‌లో పంపేవారం. దగ్గరి ప్రాంతాల్లో ఉన్న వారికి స్వయూనా వెళ్లి గ్రీటింగ్ కార్డు అందజేసి శుభాకాంక్షలు చెప్పేవారం. కానీ.. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఆధునికత కొత్త పుంతలు తొక్కుతోంది. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక విప్లవాన్ని నగరవాసులు అందిపుచ్చుకుంటున్నారు. ఇంకేముంది క్షణాల్లో విషెష్ వారి దరి చేరుతున్నాయి. గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్రం దాటి ఇతర దేశాలకూ తమ సందేశాలను పంపిస్తున్నారు. లాప్టాప్ నుంచి కంప్యూటర్.. కంప్యూటర్ నుంచి అరచేతిలో ప్రపంచాన్ని చూపే ఆన్‌డ్రాయిడ్ ఫోన్ల వరకూ అందుబాటులోకి వచ్చాయి. ఇంకేముంది యువత మాత్రమే కాదు.. వయో పరిమితి లేకుండా ఎవరుపడితే వారు ఈ సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటున్నారు. - న్యూఢిల్లీ
బడికి వెళ్లే పిల్లవాడితోపాటు పండు ముసలి వరకు నేడు సెల్ఫోన్లు వినియోగిస్తున్నారు. జిల్లాలో నూటికి 90 శాతం మంది మొబైల్స్ వాడుతున్నారనడంలో అతిశయోక్తి లేదు. అయితే.. నెట్వర్క్ కంపెనీల్లో పెరిగిన పోటీ సెల్పోన్ల వినియోగదారులకు వరంగా మారింది. వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఒక్కో కంపెనీ ఒక్కో ఆఫర్ ప్రకటిస్తోంది. సెకన్, నిమిషాల ప్రకారం కాల్ చార్జీలే కాకుండా ఎస్‌ఎంఎస్‌లకూ అనేక రాయితీలు ఇస్తున్నాయి. అందుకే ఇప్పుడు ఉత్తరాల ద్వారా, కంప్యూటర్ల ద్వారా కన్నా.. సెల్ఫోన్ల ద్వారా సందేశాలు పంపుకోవడం ఎక్కువ అయియందంటే నమ్మాల్సిందే.పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం పట్టణాలకే పరిమితం కాలేదు సరికదా నేడు అది పల్లెల నుంచి గల్లీ వరకు చేరుకుంది.
విద్యార్థులు, వ్యాపారులు, వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారు కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లు వాడుతున్నారు. వీటికి ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి ఉండడంతో ప్రపంచాన్ని పది నిమిషాల్లో చుట్టి వచ్చే పరిస్థితులు వచ్చాయి. నేటి పోటీ ప్రపంచంలో కంప్యూటర్ పరిజ్ఞానం అందరికీ తెలిసిపోవడంతో ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సప్, ఇలా వివిధ రకాల అప్లికేషన్లు ఇంటర్నెట్లో కదలాడుతూనే ఉన్నాయి. పలువురు సాంకేతికతను వీలైనంతగా వినియోగించుకుంటున్న విద్యార్థులు ల్యాప్‌టాప్‌ల ద్వారా ఎక్కడికక్కడే గ్రీటింగ్స్ కోసం సందేశాలతో కూడిన చిత్రాలను అప్లోడ్ చేస్తున్నారు.
అనేక వెబ్సైట్లు..
ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే అనేక రకాల వెబ్సైట్లు దర్శనమిస్తాయి. గూగుల్‌తోపాటు యాహూ, జీ మెయిల్, రెడిఫ్ మెయిల్, వేటు ఎస్ఎంఎస్, ఫుల్‌ఆన్ ఎస్ఎంఎస్, 160బై2, సైట్2 ఎస్ఎంఎస్, అల్టూ, ఎస్ఎంఎస్ ఏబీసీ, యూమింట్, ఫేస్బుక్, ఆర్కుట్, ట్విట్టర్‌తోపాటు అనేక రకాలు వెబ్సైట్లు ఉన్నాయి. వీటి ద్వారా స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఎక్కుడ వున్న వారికైనా వారి మొయిల్స్‌కు న్యూ ఇయర్ గ్రీటింగ్ కార్డులతో సహా పంపించడానికి అవకాశం ఉంది. ఇక స్కైప్, త్రీజీ సేవల ద్వారా నేరుగా చూస్తూ కూడా ఒకరికొకరు గ్రీటింగ్స్ చెప్పుకుంటున్నారు.
తగ్గిన గ్రీటింగ్ కార్డుల హవా..
నూతన సంవత్సరం వచ్చిందంటే రంగు రంగుల గ్రీటింగ్ కార్డులు హల్చల్ చేసేవి. వారం రోజుల ముందు నుంచి ఎక్కడ చూసినా అందమైన స్టాల్స్ ఏర్పాటు చేసి గ్రీటింగ్స్ విక్రయించే వారు. రూపాయి నుంచి మొదలు పెడితే రూ.1000 వరకు ధరల్లో గ్రీటింగ్ కార్డులు అందుబాటులో ఉండేవి. నిత్యం ఆ స్టాల్స్ వినియోగదారులతో కళకళలాడుతుండేవి. విద్యార్థిని, విద్యార్థులు, యువతి, యువకులు, స్నేహితులు, బంధువులు అంతా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ అందమైన గ్రీటింగ్ కార్డుల ద్వారానే తెలియజేసేవారు. ఈ గ్రీటింగ్ కార్డులకు 180 ఏళ్ల చరిత్ర ఉంది.
అయితే ఇన్నేళ్ల చరిత్ర కలిగిన ఈ గ్రీటింగ్‌లు ప్రస్తుతం ప్రాభవం కోల్పోయూయి. క్రమక్రమంగా అవి కనుమరుగయ్యూరుు. ఇంటర్నెట్, సెల్‌ఫోన్ లు అందుబాటులోకి రావడంతో వాటిని కొనుగోలు చేసేవారు కరువయ్యూరు. ఆన్లైన్లోనే శుభాకాంక్షలు తెలుపుతున్న ఈ తరుణంలో గ్రీటింగ్ కార్డులపై క్రేజీ పూర్తిగా తగ్గిపోయింది. ప్రపంచాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని తిరుగుతున్న యువతీయువకులు తమ సెల్ఫోన్ల ద్వారా ఇప్పుడు హ్యాపీ న్యూ ఇయరే కాదు అన్ని ప్రత్యేకతలు కలిగిన రోజులకు కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారి భావాలను వివిధ కోణాల్లో చాటుతున్నారు.
అరచేతిలో ఆన్‌డ్రాయిడ్ ఫోన్స్..
సెల్ఫోన్ల ద్వారా ఎస్ఎంఎస్లే కాదు.. ఆన్‌డ్రాయిడ్ ఫోన్స్‌తో కూడా వివిధ రకాల్లో శుభాకాంక్షలు పంపుకునేలా అవకాశాలు వచ్చాయి. సందేశాలే కాదు వాట్సప్, వీచాట్, వైపర్లాంటి అప్లికేషన్ల అందుబాటులో ఉన్నారుు. నేటి యువతీ, యువకులు, విద్యార్థులు వీటినే ఎక్కువగా వినియోగిస్తున్నారు. వీటితో అద్భుత రకాల్లో శుభాకాంక్షలు తెలుపుకోవడమే కాదు కొంగొత్త ఊహలతో, వచ్చిన ఐడియాలతో అనేక అప్లికేషన్ల ద్వారా.. మనస్సును దోచే చిత్రాలతో శుభాకాంక్షలు తెలుపుకోవచ్చు.