సినీ స్టూడియోలో డ్రగ్స్ కలకలం
బంజారాహిల్స్(హైదరాబాద్): ఆన్లైన్ పార్శిళ్ల ద్వారా డ్రగ్స్ సరఫరా జరుగుతున్నట్లు ఇటీవల పలువురు సినీ ప్రముఖులను విచారించిన నేపథ్యంలో వెల్లడైన సమాచారాన్ని దృష్టిలో పెట్టుకొని ఆబ్కారీ శాఖ అధికారులు ఆన్లైన్ పార్శిళ్లపై దృష్టి కేంద్రీకరించారు. ఈ నేపథ్యంలోనే బుధవారం ఫిలింనగర్‌లోని రామానాయుడు స్టూడియోకు ఓ ఆన్లైన్ పార్శిల్ వచ్చినట్లు పక్కా సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు మూడు గంటల పాటు స్టూడియోలో సోదాలు నిర్వహించారు.
ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కనకదుర్గ ఆధ్వర్యంలో పది మంది అధికారులు ఇక్కడ విదేశాల నుంచి వచ్చిన ఓ పార్శిల్‌ను గుర్తించి తనిఖీలు నిర్వహించారు. విదేశాల నుంచి ఈ పార్శిల్ వచ్చినట్లు తమకు సమాచారం అందడంతో నిశితంగా పరిశీలించినట్లు కనకదుర్గ వెల్లడించారు. నగరంలో డ్రగ్స్ వ్యవహారం బయటపడటంతో ఆబ్కారి శాఖ మత్తుమందులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిందని, డ్రగ్స్ వినియోగిస్తున్న వారిలో కొందరు విదేశాల నుంచి నేరుగా ఆన్లైన్ నుంచి డ్రగ్స్ తెప్పించుకుంటున్నట్లు తేలడంతో అప్రమత్తమైన తాము ఈ తనిఖీలకు వచ్చినట్లు తెలిపారు.
కాగా, తమకు విదేశాల నుంచి పార్శిల్ వచ్చిన మాట వాస్తవమేనని సినీ నిర్మాత దగ్గుబాట సురేష్‌బాబు తెలిపారు. తన కుమారుడు రానా వెన్ను నొప్పి నివారణ కోసం విదేశాల నుంచి ఓ పరికరాన్ని కొనుగోలు చేశామని దాని పార్శిల్ రామానాయుడు స్టూడియోకు వచ్చిందని వివరణ ఇచ్చారు. ఇందులో భాగంగానే ఎక్సైజ్ సీఐ కనకదుర్గ పార్శిల్‌ను తనిఖీ చేసేందుకు స్టూడియోకు వచ్చారని తెలిపారు. ఇంకోవైపు రామానాయుడు స్టూడియోకు ఆన్లైన్ పార్శిల్లో డ్రగ్స్ వచ్చినట్లు పుకార్లు రావడంతో కలకలం ఏర్పడింది. పెద్ద సంఖ్యలో మీడియా అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.