ఆన్లైన్లో పాస్‌పోర్ట్ మేళా
సాక్షి, విశాఖపట్నం :పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులకు శుభవార్త. స్లాట్లు దొరకడం లేదని ఆందోళన చెందుతున్న అభ్యర్థులకు కేంద్ర విదేశీ మంత్రిత్వశాఖ చల్లని వార్త మోసుకొచ్చింది. ‘మొబైల్ ఆన్లైన్ పాస్ పోర్ట్ సేవా క్యాంప్’ పేరిట ఈ నెల 8, 9 తేదీల్లో కాకినాడ జేఎన్టీయూ క్యాంపస్‌లోనూ, 8న విశాఖలోని పాస్‌పోర్ట్ సేవా కేంద్రం (పీఎస్కే)లోనూ ఓ కార్యక్రమం నిర్వహించేందుకు ముందుకు వచ్చింది. కాకినాడలో రోజుకు 250 చొప్పున రెండు రోజుల్లో 500 మందికి, విశాఖలో జరిగే ఒక రోజు మేళాలో 600 మందికి (మొత్తం 1100) లబ్ధి చేకూరేలా నిర్ణయం తీసుకుంది.
ఆన్లైన్ పాస్‌పోర్ట్ సేవా మేళాను అభ్యర్థులు ఉపయోగించుకోవాలని ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయ అధికారి ఎ.టి.మూర్తి తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లా వాసులకు ఉపయోగపడేలా రెండు రోజుల పాటు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు మేళా నిర్వహిస్తున్నారు. ఫ్రెష్/నార్మల్/రీ ఇష్యూ దరఖాస్తుల్ని ఆహ్వానిస్తారు. 8, 9 తేదీల్లో స్లాట్ కోసం అభ్యర్థులు ఆన్లైన్లో www.passportindia.com లో దరఖాస్తు చేసుకోవాలి. ఆ రోజుకు స్లాట్ లభించే అభ్యర్థులు కాకినాడ జేఎన్టీయూ క్యాంపస్ అడ్మిన్ భవనం ఎదురుగా అలుమినీ ఆడిటోరియంలో అన్ని పత్రాల్నీ అందజేయాలి.
ఇందుకు సంబంధించి ఈ నెల 5న సాయంత్రం 5.30 గంటలకు మాత్రమే స్లాట్ లభ్యమైనట్టు రూఢీ అవుతుంది. ఈ విషయాన్ని ఆన్లైన్లోనే అభ్యర్థులు పరిశీలించుకోవాలి.
మేళాలో అభ్యర్థులే హాజరై బయోమెట్రిక్, ఫొటోలు తీసుకోవాలి. వీలుకాకపోతే అభ్యర్థులు రెండు కలర్ పాస్‌పోర్ట్ ఫొటోలు వెంట తీసుకెళ్లాలి. దరఖాస్తు రుసుంను వెబ్సైట్లో పేర్కొన్న విధంగా డెబిట్/క్రెడిట్, ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించాలి. ఎస్బీఐ చలాన్ల ద్వారా కట్టినా అనుమతిస్తారు.
మేళాకు హాజరయ్యే ముందే ప్రింటవుట్‌ను తీసుకుని అన్ని వివరాలతో వెళ్లాలి.
వాకిన్ (గతంలో దరఖాస్తు చేసుకున్నవారు), పీసీపీ, తత్కాల్, పెండింగ్ కేసులు, అపాయింట్మెంట్ దొరకని అభ్యర్థులు నిబంధనల ప్రకారం మేళాకు అనర్హులు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు 0891-2745746, 747 నెంబర్లలో కార్యాలయ పని వేళల్లో సంప్రదించవచ్చు.
విశాఖలో నిర్వహించబోయే మేళాకు ఉత్తరాంధ్రతో పాటు ఉభయగోదావరి జిల్లాల వాసులూ అర్హులే. పెండింగ్‌లో ఉన్న అభ్యర్థులు తమ పాత దరఖాస్తును రద్దు చేసుకుని మేళాలో పాల్గొనేవిధంగా (నిబంధనల ప్రకారం) దరఖాస్తు చేసుకోవచ్చు.