open education
-
ఓపెన్ విద్యార్థులందరూ పాస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఓపెన్ స్కూల్ సొసైటీ నిర్వహిస్తున్న దూరవిద్యా ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్ విద్యా ర్థులంతా పాస్ అయ్యారు. అందరికీ ప్రతి సబ్జెక్టులో 35 శాతం కనీస పాస్ మార్కు లను ఇచ్చి ఉత్తీర్ణులను చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి చిత్రారామచంద్రన్ శుక్రవారం జీవో 12ను జారీ చేశారు. కరోనా కారణంగా గత ఏప్రిల్/మే నెలల్లో నిర్వహించాల్సిన ఓపెన్ స్కూల్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ప్రస్తుత పరిస్థితుల్లోనూ పరీక్షలు నిర్వహించే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఎలా ముందుకు సాగాలన్న విషయంలో విద్యాశాఖ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయిం తీసుకుంది. పరీక్షలు రాసేందుకు అర్హత కలిగిన విద్యార్థులందరికీ కనీస పాస్ మార్కులను ఇస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో వెల్లడించింది. ప్రతి సబ్జెక్టులో 35 శాతం మార్కులతో ఉత్తీర్ణులైనట్లు ప్రకటించింది. ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్లో అదనపు సబ్జెక్టు, ప్రాక్టికల్స్లోనూ 35 శాతం మార్కులతో పాసైనట్టేనని పేర్కొంది. ప్రస్తుతం కనీస పాస్ మార్కులతో పాసైన విద్యార్థులు తమ మార్కులను ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఓపెన్ స్కూల్ సొసైటీ తదుపరి నిర్వహించే పబ్లిక్ పరీక్షలకు హాజరుకావచ్చని వెల్లడించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 75 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి వెల్లడించారు. అందులో ఎస్సెస్సీ విద్యార్థులు 43 వేల మంది, ఇంటర్మీడియట్ విద్యార్థులు 32 వేల మంది ఉన్నట్లు తెలిపారు. కరోనా వల్ల పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. -
ఓపెన్ డిగ్రీ, పీజీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
అనంతపురం ఎడ్యుకేషన్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయం ద్వారా డిగ్రీ, పీజీ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆర్ట్స్ కళాశాల అధ్యయన కేంద్రం ప్రాంతీయ సమన్వయ సంచాలకులు పద్మశ్రీ తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీ కోర్సుల ప్రవేశాలకు ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, తత్సమాన అర్హత ఉన్నవారితో పాటు యూనివర్సిటీ వారు నిర్వహించిన అర్హత పరీక్ష 2013–2017 మధ్య ఉత్తీర్ణులైన వారు కూడా అర్హులని పేర్కొన్నారు. ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంబీఏ మొదటి సంవత్సరం కోర్సుల ప్రవేశాలకు అక్టోబర్ 5లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 08554–222448, 73829 29602 నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
నేటి నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు
ఏలూరు సిటీ : ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ద్వారా ఓపెన్ విధానంలో పదోతరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమవుతాయని డీఈవో డి.మధుసూదనరావు, ఓపెన్ స్కూల్స్ జిల్లా కో ఆర్డినేటర్ టీటీఎఫ్ రూజ్వెల్ట్ మంగళవారం తెలిపారు. ఈ నెల 28 నుంచి అక్టోబర్ 8 వరకు జిల్లా వ్యాప్తంగా ఏలూరు, తణుకు పట్టణాల్లో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఏలూరులో ఒక పరీక్షా కేంద్రం, తణుకులో ఐదు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు.