అంతర్జాతీయ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చా?
ఓపెన్-ఎండ్, క్లోజ్డ్-ఎండ్ మ్యూచువల్ ఫండ్స్‌కు మధ్యనున్న తేడాలేంటి ? ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో ఎలా ఇన్వెస్ట్ చేస్తే మంచిది. ఒకేసారి పెద్ద మొత్తంలోనా? లేకుంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) విధానంలోనా? - నాగవల్లి, రాజమండ్రి
ఓపెన్-ఎండ్ మ్యూచువల్ ఫండ్‌లో మనం ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. కానీ క్లోజ్డ్-ఎండ్ మ్యూచువల్ ఫండ్‌లో మాత్రం ఆ ఫండ్ ఆఫర్ కాలంలోనే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఓపెన్-ఎండ్ ఫండ్‌లో యూనిట్లను ఎప్పుడైనా అమ్మేసి మీ ఇన్వెస్ట్మెంట్స్ పొందవచ్చు. కానీ క్లోజ్డ్-ఎండ్ ఫండ్‌లో మాత్రం మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు లాకిన్ పీరియడ్ ఉంటుంది. అది పూర్తయిన తర్వాత మాత్రమే మీరు మీ యూనిట్లను అమ్మేసి, మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను పొందవచ్చు.
ఓపెన్-ఎండ్ ఫండ్ విషయంలో మీ యూనిట్లను మొత్తంగా కానీ, కొన్ని గానీ అమ్మేసుకోవచ్చు. కానీ క్లోజ్డ్-ఎండ్ ఫండ్ విషయంలో మాత్రం అలా కాదు. ఓపెన్ ఎండ్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయవచ్చు. క్లోజ్డ్-ఎండ్ ఫండ్ విషయంలో అలా చేయలేం. ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ఒకసారి పెద్దమొత్తంలో ఇన్వెస్ట్ చేయడం సరైనది కాదు.
ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని, క్లోజ్డ్-ఎండ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం కాదని మేం ఎప్పుడూ సూచిస్తూ ఉంటాం. ఇక ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్మెంట్ విషయానికొస్తే, ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం కన్నా సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఫలితంగా మార్కెట్ల హెచ్చుతగ్గుల, ఒడిదుడుకుల ప్రభావాల నుంచి తట్టుకొని ప్రయోజనం పొందవచ్చు.
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ పినాకిల్ స్కీమ్‌లో మొదటి ఏడాది రూ.50,000 ఇన్వెస్ట్ చేశాను. ఈ స్కీమ్ పనితీరు ఎలా ఉంది? రెండో ఇన్స్టాల్మెంట్ చెల్లించి, ఈ స్కీమ్‌లో కొనసాగవచ్చా? - భక్తవత్సలం, కర్నూలు
మీ ఆర్థిక అవసరాలు ఎలా ఉన్నాయనే దానిని బట్టి ఈ విషయంపై నిర్ణయం తీసుకోవాలి. ఒక విధంగా చెప్పాలంటే, బీమాను, ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కలగలపకూడదు. మీ బీమా అవసరాలు ఒక యూలిప్ ద్వారా తీర్చుకోలేరు. యూలిప్ ద్వారా బీమా, ఇన్వెస్ట్ మెంట్ అవసరాలను పొందాలనుకుంటే, అది రెంటికీ చెడ్డ రేవడి చందంగా అవుతుంది. ఇది కొత్త యూలిప్ కాబట్టి మూడేళ్లకు ముందే ప్రీమియం చెల్లించడాన్ని ఆపేసినా మీకు ఇన్వెస్ట్‌మెంట్‌కు ఎలాంటి ఇబ్బంది లేదు. మీ ఆర్థిక అవసరాలు, లక్ష్యాలను బట్టి ఈ విషయంలో నిర్ణయం తీసుకోండి.
భారత జాతీయుడు ఎవరైనా సరే అంతర్జాతీయ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చా? ఇలా ఇన్వెస్ట్ చేయడం వల్ల మంచి రాబడులు పొందవచ్చా? ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై పొందిన రాబడులపై పన్నులు ఎలా ఉంటాయి? - సాగరిక, హైదరాబాద్
ఒక వ్యక్తిగా మీరు ఎలాంటి అంతర్జాతీయ ఫండ్స్‌లోనైనా నిరభ్యంతరంగా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఆర్బీఐ నిర్దేశిత నియమాల ప్రకారం మీరు ఒక బ్యాంక్ అకౌంట్ ద్వారానే ఈ ఫండ్స్‌ను నిర్వహించాలి. ప్రతీ ఏడాది ఏ వ్యక్తై 75 వేల డాలర్ల వరకూ ఇలాంటి అంతర్జాతీయ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇక పన్ను విషయానికొస్తే, డెట్ ఫండ్స్‌కు వర్తించే నియమాలే ఈ అంతర్జాతీయ ఫండ్స్‌కూ వర్తిస్తాయి. పన్ను నియమాల ప్రకారం మ్యూచువల్ ఫండ్స్ రెండు రకాలు, ఈక్విటీ, ఈక్విటీయేతర మ్యూచువల్ ఫండ్స్. మొత్తం ఇన్వెస్ట్‌మెంట్స్‌లో కనీసం 65 శాతం దేశీయ ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్‌ను ఈక్విటీ ఫండ్స్‌గా పరిగణిస్తారు.
ఇక అంతర్జాతీయ ఫండ్స్ విషయానికొస్తే, ఇవి దేశీయ ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయవు. కనుక వీటిని ఈక్విటీయేతర మ్యూచువల్ ఫండ్స్‌గా భావిస్తారు. ఈ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మీరు మూడేళ్లలోపే ఉపసంహరించుకుంటే, ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై పొందిన లాభాలపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వివిధీకరణ నిమిత్తం చాలా మంది ఇన్వెస్టర్లు ఇలాంటి ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు.