Open Grand Prix Gold badminton tournament
-
ముగిసిన భారత్ పోరు
ఆక్లాండ్: న్యూజిలాండ్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో సిక్కి రెడ్డి-ప్రణవ్ చోప్రా ద్వయం 14-21, 18-21తో షిన్ బేక్ చెల్-చె యు జంగ్ (దక్షిణ కొరియా) జంట చేతిలో ఓడిపోయింది. మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప జంట 22-24, 8-21తో మపాసా- సోమర్విల్లె (ఆస్ట్రేలియా) జోడీ చేతిలో ఓటమి చవిచూసింది. పురుషుల డబుల్స్‌లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి ద్వయం 10-21, 20-22తో హ్యున్-షిన్ (దక్షిణ కొరియా) జంట చేతిలో పరాజయం పాలైంది. -
రెండో రౌండ్లో సిక్కి-ప్రణవ్ జోడీ
ఆక్లాండ్: న్యూజిలాండ్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ క్రీడాకారులు సిక్కి రెడ్డి, సుమీత్ రెడ్డి డబుల్స్ విభాగంలో శుభారంభం చేశారు. బుధవారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి-ప్రణవ్ చోప్రా ద్వయం 21-8, 21-9తో జొనాథన్ సన్-జెన్నిఫర్ టామ్ (న్యూజిలాండ్) జంటను ఓడించింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి జోడీ 21-11, 17-21, 21-16తో షాంగ్ కాయ్ లిన్-లూ చింగ్ యావో (చైనీస్ తైపీ) ద్వయంపై గెలిచింది. -
‘స్విస్’ ఫైనల్లో ప్రణయ్
సెమీస్‌లో సైనా ఓటమి బాసెల్ (స్విట్జర్లాండ్): స్విస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత అగ్రశ్రేణి క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ 27వ ర్యాంకర్ హెచ్.ఎస్.ప్రణయ్ ఫైనల్లోకి దూసుకెళ్లగా... మహిళల సింగిల్స్ విభాగంలో మాజీ చాంపియన్ సైనా నెహ్వాల్ సెమీఫైనల్లో ఓటమి చవిచూసింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో ప్రణయ్ 12-21, 21-14, 23-21తో ప్రపంచ 52వ ర్యాంకర్ జు వీ వాంగ్ (చైనీస్ తైపీ)పై అద్భుత విజయం సాధించాడు. 56 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రణయ్ మూడో గేమ్‌లో మూడు మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని విజయం సాధించడం విశేషం. హైదరాబాద్‌లో పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ప్రణయ్ ఈ గెలుపుతో తన కెరీర్లో రెండోసారి గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో ఫైనల్‌కు చేరాడు. కేరళకు చెందిన ప్రణయ్ 2014లో ఇండోనేసియా గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో ఫైనల్‌కు చేరుకోవడంతోపాటు విజేతగా నిలిచాడు. మార్క్ జ్విబ్లెర్ (జర్మనీ), హెన్రీ హుర్స్‌కెనైన్ (స్వీడన్)ల మధ్య జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో ఆదివారం జరిగే ఫైనల్లో ప్రణయ్ తలపడతాడు. మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో 2011, 2012 చాంపియన్ సైనా నెహ్వాల్‌కు నిరాశ ఎదురైంది. మూడో సీడ్ యిహాన్ వాంగ్ (చైనా)తో జరిగిన మ్యాచ్‌లో టాప్ సీడ్ సైనా 11-21, 19-21తో ఓడిపోయింది. యిహాన్తో ఇప్పటివరకు 14సార్లు ఆడిన సైనా నాలుగుసార్లు గెలిచి, 10సార్లు ఓడిపోవడం గమనార్హం. నేటి ఫైనల్స్ సాయంత్రం గం. 4.30 నుంచి స్టార్ స్పోర్ట్స్-4లో ప్రత్యక్ష ప్రసారం -
క్వార్టర్స్‌లో సింధు పరాజయం
బాసెల్ (స్విట్జర్లాండ్): స్విస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ పీవీ సింధు పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 11వ ర్యాంకర్ సింధు 13-21, 15-21తో ప్రపంచ 20వ ర్యాంకర్ హీ బింగ్జియావో (చైనా) చేతిలో ఓడింది. గురువారం ఆలస్యంగా జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సైనా నెహ్వాల్ 21-18, 21-17తో క్రిస్టినా గావ్న్హోల్ట్ (చెక్ రిపబ్లిక్)పై గెలిచింది. -
ప్రిక్వార్టర్స్‌లో సైనా, సింధు
బాసెల్ (స్విట్జర్లాండ్): స్విస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్స్ సైనా నెహ్వాల్, పీవీ సింధు ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో టాప్ సీడ్ సైనా 21-7, 21-15తో కరీన్ షానాస్ (జర్మనీ)పై గెలుపొందగా... ఆరో సీడ్ సింధు 21-19, 21-10తో చోల్ మజీ (ఐర్లాండ్)ను ఓడించింది. గురువారం జరిగే ప్రిక్వార్టర్స్‌లో క్రిస్టినా గావ్న్హోల్ట్ (చెక్ రిపబ్లిక్)తో సైనా, పాయ్ యు పో (చైనీస్ తైపీ)తో సింధు తలపడతారు. పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్‌కే చెందిన సాయిప్రణీత్, ప్రణయ్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. బుధవారం జరిగిన రెండో రౌండ్లో సాయిప్రణీత్ 21-7, 21-10తో అర్త్యోమ్ సవత్యుజిన్ (ఉజ్బెకిస్తాన్)పై, ప్రణయ్ 21-16, 21-13తో లార్స్ షాన్జ్లెర్ (జర్మనీ)పై గెలుపొందారు. మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో సాయిప్రణీత్ 21-14, 13-21, 21-6తో మథియాస్ బోనీ (స్విట్జర్లాండ్)పై, ప్రణయ్ 21-19, 21-19తో కోల్జోనెన్ (ఫిన్లాండ్)పై విజయం సాధించారు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో అజయ్ జయరామ్ 21-8, 21-17తో జియాన్ చియాంగ్ (మలేసియా)పై, సమీర్ వర్మ 21-17, 24-22తో ఎమిల్ హోల్స్ట్ (డెన్మార్క్)పై గెలిచారు.