‘స్విస్’ ఫైనల్లో ప్రణయ్
సెమీస్‌లో సైనా ఓటమి
బాసెల్ (స్విట్జర్లాండ్): స్విస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత అగ్రశ్రేణి క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ 27వ ర్యాంకర్ హెచ్.ఎస్.ప్రణయ్ ఫైనల్లోకి దూసుకెళ్లగా... మహిళల సింగిల్స్ విభాగంలో మాజీ చాంపియన్ సైనా నెహ్వాల్ సెమీఫైనల్లో ఓటమి చవిచూసింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో ప్రణయ్ 12-21, 21-14, 23-21తో ప్రపంచ 52వ ర్యాంకర్ జు వీ వాంగ్ (చైనీస్ తైపీ)పై అద్భుత విజయం సాధించాడు. 56 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రణయ్ మూడో గేమ్‌లో మూడు మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని విజయం సాధించడం విశేషం.
హైదరాబాద్‌లో పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ప్రణయ్ ఈ గెలుపుతో తన కెరీర్‌లో రెండోసారి గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో ఫైనల్‌కు చేరాడు. కేరళకు చెందిన ప్రణయ్ 2014లో ఇండోనేసియా గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో ఫైనల్‌కు చేరుకోవడంతోపాటు విజేతగా నిలిచాడు. మార్క్ జ్విబ్లెర్ (జర్మనీ), హెన్రీ హుర్స్‌కెనైన్ (స్వీడన్)ల మధ్య జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో ఆదివారం జరిగే ఫైనల్లో ప్రణయ్ తలపడతాడు.
మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో 2011, 2012 చాంపియన్ సైనా నెహ్వాల్‌కు నిరాశ ఎదురైంది. మూడో సీడ్ యిహాన్ వాంగ్ (చైనా)తో జరిగిన మ్యాచ్‌లో టాప్ సీడ్ సైనా 11-21, 19-21తో ఓడిపోయింది. యిహాన్‌తో ఇప్పటివరకు 14సార్లు ఆడిన సైనా నాలుగుసార్లు గెలిచి, 10సార్లు ఓడిపోవడం గమనార్హం.
నేటి ఫైనల్స్ సాయంత్రం
గం. 4.30 నుంచి
స్టార్ స్పోర్ట్స్-4లో ప్రత్యక్ష ప్రసారం