ఓపెన్ దోపిడీ
రాజమహేంద్రవరంలోని ఓ స్టడీసెంటర్ కేంద్రంగా కోరుకొండలోని ఒక ప్రైవేట్ కళాశాలలో పరీక్షల చూసిరాత బాగోతంపై ఈ నెల నాలుగో తేదీన ‘సాక్షి’లో ‘సొమ్ములిచ్చుకో.. చూసి రాసుకో’ అనే కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. పది రోజుల వ్యవధిలోనే.. మరో యూనివర్సిటీ దూరవిద్య పరీక్షల నిర్వహణలో ఇలాంటి బాగోతమే తాజాగా వెలుగుచూసింది.
గతంలో గోకవరంలో జూనియర్ కళాశాలలో పనిచేసి, ప్రస్తుతం రావులపాలెంలో విధులు నిర్వర్తిస్తున్న ఓ కాంట్రాక్ట్ అధ్యాపకుడు, రాజమహేంద్రవరంలోని కోటిపల్లి బస్టాండ్ సమీపంలో ఒకేషనల్ కళాశాల నిర్వాహకులు.. దూరవిద్య పేరుతో ఏటా ఈ దందా సాగిస్తున్నారు. గోకవరం కేంద్రంగా ఏటా రూ.50 లక్షలు కొల్లగొడుతున్నారు. ఓపెన్ స్కూలులో విద్యార్థులకు పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు చూసి రాయించడమే వీరు చేసే పని.
ఇదే విధానంలో డిగ్రీ కూడా పాసై పోవచ్చంటూ విద్యార్థుల నుంచి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. ఓ విద్యార్థి దొరికాడంటే.. నాలుగేళ్ల పాటు వారికి పండగే. ఓపెన్ స్కూలు ద్వారా ఇంటర్మీడియట్ ఒక సంవత్సరం, దూర విద్య పేరుతో డిగ్రీ మూడేళ్లు.. ఏమీ చదవకుండా చూసిరాసినందుకు సొమ్ము భారీగా వసూలు చేస్తున్నారు. ఓపెన్ స్కూల్ ద్వారా ఒక్క గోకవరంలోనే ఏటా సుమారు 500 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. వీరి నుంచి రూ.50 లక్షలు వసూలు చేస్తున్నట్టు అంచనా.
గీతం యూనివర్సిటీ దూరవిద్య పరీక్షలు జిల్లావ్యాప్తంగా రాజమహేంద్రవరం, అమలాపురం, పెద్దాపు రం, కిర్లంపూడి, గోకవరం ప్రాంతాల్లో జరుగుతున్నా యి. గోకవరంలోని హన్నా జూనియర్ కళాశాలలో గత కొద్దిరోజులుగా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. గోకవరం కేంద్రంలో పరీక్షలు చూసిరాసేందుకు వీలుం టుందని జిల్లావ్యాప్తంగా చాలా మంది విద్యార్థులు ఈ కేంద్రాన్నే ఎంచుకుంటున్నారు. డిగ్రీ దూరవిద్య మొ దటి ఏడాదికి పరీక్ష ఫీజు రూ.3,300 ఉండగా, పరీక్షలు చూసిరాసేందుకు రూ.6,500 వంతున ఒకొక్కరి వద్ద కట్టించుకుంటున్నారు.
తాము పరీక్ష ఫీజులు మాత్రమే వసూలు చేస్తున్నామని, మిగతా సొమ్ము దందా చేసేవారే జేబులో వేసుకుంటారని, తమకు చెల్లించలేదని వర్సిటీ సిబ్బంది చెబుతున్నారు. గోకవరంలో ఈ పరీ క్షలు ఫస్టియర్‌కు సుమారు 110 మంది రాస్తుండగా, సెకండియర్ పరీక్షలు ఈ నెల 17 నుంచి జరగనున్నా యి. నిబంధనల ప్రకారం పరీక్షలు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో జరగాలి. కొందరు అక్రమార్కులు.. ఉన్నతాధికారులను ‘ప్రసన్నం’చేసుకుని, అనుకూలంగా ఉన్న ప్రైవేట్ కళాశాలలను ఎంపిక చేసుకుంటున్నారు.
మాకు సంబంధం లేదు
‘ఇక్కడ నిర్వహిస్తున్న పరీక్షలకూ, మాకూ ఎలాంటి సంబంధం లేదు. పరీక్షలు నిర్వహించుకునేందుకు మా కళాశాల కేంద్రంగా కావాలని అడిగారు. పరీక్షల నిర్వహణ, ఇతర కార్యకలాపాలన్నీ గీతం యూనివర్సిటీ వారే చూసుకుంటున్నారు.’
- సువర్ణ కుమార్, కరస్పాండెంట్, హన్నా కళాశాల
అధికంగా వసూలు చేయడం లేదు
‘పరీక్షలు చూసి రాసేందుకు విద్యార్థుల నుంచి మేము అధిక ఫీజులు వసూలు చేయడం లేదు. మధ్యలో దళారులు ఏం చేసినా, ఎంత వసూలు చేసినా మాకు సంబంధం లేదు. పరీక్ష కేంద్రంలో మాస్ కాపీయింగ్ అనేది జరగలేదు.’
- రాజు, స్టడీ సెంటర్ కోఆర్డినేటర్, గీతం యూనివర్సిటీ