openers
-
బంగ్లాను గెలిపించిన కైస్, దాస్
చిట్టగాంగ్: ఓపెనర్లు ఇమ్రూల్ కైస్ (90; 7 ఫోర్లు), లిటన్ దాస్ (83; 12 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో బంగ్లాదేశ్ రెండో వన్డేలో 7 వికెట్ల తేడాతో జింబాబ్వేపై గెలిచింది. మరో వన్డే మిగిలుండగానే మూడు వన్డేల సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకుంది. బుధవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట జింబాబ్వే 50 ఓవర్లలో 7 వికెట్లకు 246 పరుగులు చేసింది. బ్రెండన్ టేలర్ (75; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ సాధించాడు. విలియమ్స్ (47; 2 ఫోర్లు), సికందర్ రజా (49; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. తర్వాత లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 44.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసింది. నేడు చివరి వన్డే జరుగుతుంది. -
‘ఓపెనింగ్’ మార్పుకు సమయం
టెస్టుల్లో క్రీజులో పాతుకుపోయి... కొత్త బంతి దాడిని కాచుకుంటూ... వీలునుబట్టి బౌలర్ల లయను దెబ్బతీస్తూ... ఒకవిధంగా మిడిలార్డర్లోని మేటి బ్యాట్స్‌మెన్‌కు రక్షణ కవచంగా నిలిచేది ఓపెనింగ్ జోడి! ప్రత్యర్థిపై ఆదిలోనే ఆధిపత్యం చూపుతూ, జట్టు మానసికంగా పైచేయి సాధించడంలో వీరిదే ప్రధాన పాత్ర. అయితే మిగతా జట్లలో ఒకరు విఫలమైతే మరొకరు నిలదొక్కుకుంటూ కొంతలో కొంత నయం అనిపిస్తున్నారు. కానీ, టీమిండియా విషయంలో మాత్రం ‘ముగ్గురు’ ఓపెనర్లూ మూకుమ్మడిగా చేతులెత్తేస్తున్నారు. ఏ ఇద్దరిని ఆడించినా, ఆటగాడి మార్పు తప్ప ఆటతీరు మారడం లేదు. సాక్షి క్రీడా విభాగం ఓపెనర్లకు ఉండాల్సిన కనీస లక్షణాలు భారత ఆరంభ జోడీలో లోపించాయి. దీంతో కీలక మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ చాలా ముందుగానే క్రీజులోకి రావాల్సి వస్తోంది. బర్మింగ్‌హామ్, లార్డ్స్ టెస్టుల్లో నాలుగు ఇన్నింగ్స్‌ల్లోనూ కోహ్లి 25 ఓవర్లలోపే బ్యాటింగ్‌కు దిగాడు. కొత్త బంతి విపరీతంగా స్వింగ్ అయ్యే ఇంగ్లండ్‌లో, వందల కొద్దీ ఓవర్లు ఆడాల్సిన ఐదు రోజుల మ్యాచ్‌కు ఇది ఎంతమాత్రం సరైన తీరు కాదు. కోహ్లి, పుజారా, రహానే విఫలమైతే సుదీర్ఘ ఇన్నింగ్స్‌లతో జట్టుకు భారీ స్కోరు అందించే వారే లేకుండా పోతారు. ఇక్కడే(నా) పోటాపోటీ... మురళీ విజయ్, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్... స్వదేశంలో టెస్టు సిరీస్ అంటే వీరిలో ఎవరిని తప్పించి, ఎవరిని ఆడించాలి అనేది టీమిండియాకు పెద్ద తలనొప్పి. అదే విదేశాలకు వచ్చేసరికి మాత్రం ఒకరివెంట ఒకరి వైఫల్యంతో అసలు ఎవరిని ఆడించాలో తెలియని డైలమా. ఇటీవలి దక్షిణాఫ్రికా పర్యటనలో, ప్రస్తుత ఇంగ్లండ్ టూర్లో ఇదే విషయం మళ్లీమళ్లీ స్పష్టమైంది. అయినా శుభారంభం మాత్రం కలే అవుతోంది. విజయ్–ధావన్ ద్వయం తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కుదురుగానే కనిపించింది. స్వల్ప లక్ష్య ఛేదనలో రెండో ఇన్నింగ్స్‌లో వైఫల్యంతో ఆ ప్రదర్శన మరుగునపడింది. ఇక రాహుల్‌ది మరో తరహా కథ. భారత్‌లో భారీ ఇన్నింగ్స్‌లతో అదరగొడుతూ, విదేశాల్లో మాత్రం చేతులెత్తేస్తున్నాడు. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లలో ఆడిన నాలుగు టెస్టుల్లో అతడు కనీసం అర్ధ శతకమైనా చేయలేకపోవడమే దీనికి నిదర్శనం. విజయ్‌కి ఏమైంది టెస్టుల్లో టీమిండియా నంబర్‌వన్ ఓపెనర్ మురళీ విజయ్. వాస్తవంగా చూస్తే ఇటీవల ఎక్కువగా నిరాశపరుస్తోంది అతడే. కానీ, డిఫెన్స్‌తో పాటు విదేశీ రికార్డు మెరుగ్గా ఉండటం విజయ్ను కాపాడుతోంది. ఈ తమిళనాడు బ్యాట్స్‌మన్... సఫారీ టూర్లో ఆకట్టుకోలే కపోయాడు. అయినప్పటికీ తనపై భరోసా ఉంచారు. బౌలర్ల వలలో పడకుండా వారి సహనాన్ని పరీక్షించే విజయ్ ఇటీవల దానికి భిన్నంగా కనిపిస్తున్నాడు. ఫుట్‌వర్క్ కూడా మునుపటిలా లేకపోవడంతో వికెట్ ఇచ్చేస్తున్నాడు. ఈ పరిస్థితుల నుంచి విజయ్ తొందరగా బయటపడాల్సిన అవసరం ఉంది. లేదంటే... తననూ పక్కనపెట్టక తప్పదు. యువతరం తలుపు తడుతోంది... విజయ్ వయసు 34. ధావన్‌కు 32 దాటుతున్నాయి. వీరిద్దరిపై మరెంతో కాలం ఆధారపడలేం. ఇప్పటికే కొత్తవారిని పరీక్షించాలన్న డిమాండ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా తెరపైకి వస్తున్నారు. ఇటీవల జంటగా రాణిస్తున్నారు. వీరితోపాటు ప్రియాంక్ పాంచల్, ఫైజ్ ఫజల్, ఆర్.సమర్ధ్లు సైతం పరిశీలించదగినవారే. మరోవైపు దశాబ్ద కాలంలో భారత్ తరఫున టెస్టు ఓపెనర్లుగా అరంగేట్రం చేసింది నలుగురే. వీరిలో అభినవ్ ముకుంద్ ఒక్కడే ప్రస్తుత జట్టులో లేడు. ధావన్, విజయ్... తర్వాత రాహుల్ ఆశలు రేకెత్తించడంతో మరొకరి గురించి ఆలోచన రాలేదు. ఇప్పుడు మాత్రం కొత్తవారిని పరీక్షించక తప్పదనేలా ఉంది. అందులోనూ ఎడమచేతి వాటం ఓపెనర్ అయితే మరీ ఉపయోగం. కానీ, దేశవాళీల్లో ఫైజ్ ఫజల్ మినహా మరో నాణ్యమైన ఆటగాడు కనిపించడం లేదు. అయితే, అతడికి 33 ఏళ్లు. ఈ కోణంలో చూస్తే 28 ఏళ్ల ముకుంద్‌కు అవకాశాలివ్వొచ్చు. నేను రెడీ: రోహిత్ ముంబై: సంప్రదాయ ఫార్మాట్లోనూ ఓపెనింగ్‌కు సిద్ధం అంటున్నాడు వన్డే, టి20ల ఓపెనర్ రోహిత్‌శర్మ. టెస్టుల్లో విజయ్, ధావన్, రాహుల్‌ల వరుస వైఫల్యాలతో టీమిండియా సతమతం అవుతున్న వేళ తననూ పరీక్షించి చూడాలన్నట్లుగా మాట్లాడాడు. గురువారం ఇక్కడ ఓ కార్యక్రమంలో పాల్గొన్న రోహిత్... ‘నాకెప్పుడూ టెస్టుల్లో ఓపెనింగ్ చేసే అవకాశం రాలేదు. మేనేజ్మెంట్ కోరితే మాత్రం అందుకు సిద్ధం. దేశం తరఫున వన్డేల్లో ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తానని ఎప్పు డూ ఊహించలేదు. అయినా అది అలా జరిగిపోయింది. టెస్టుల్లోనూ అవకాశం వస్తే కాదనేది లేదు. నిరూపించుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తా’ అని పేర్కొన్నాడు. టెస్టుల్లో ఆడాలనేది తన కోరికని... అయినా అది తన చేతుల్లో లేదని రోహిత్ వివరించాడు. -
వారికి మరికొంత సమయం ఇవ్వాలి:కోహ్లి
-
వారికి మరికొంత సమయం ఇవ్వాలి:కోహ్లి
కోల్‌కతా: ఇంగ్లండ్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. మూడో వన్డేలో గెలుపు ముంగిట వరకూ వచ్చిన భారత్ జట్టు ఓటమి చెందింది. ఇంగ్లండ్ విసిరిన 322 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ చివరి వరకూ పోరాడి పరాజయం పాలైంది. అయితే ఈ మూడు వన్డేల్లో టీమిండియా బ్యాటింగ్ లో టాపార్డర్ తో పాటు మిడిల్ ఆర్డర్ కూడా కీలక పాత్ర పోషించింది. అయితే టాపార్డర్ లో ఓపెనర్లు ఘోరంగా విఫలం చెందడం మినహా భారత్ జట్టు ప్రదర్శన బాగుందనే చెప్పాలి. ఈ వన్డే సిరీస్‌లో భారత ఓపెనర్లు ముగ్గురూ కలిపి చేసిన 37 పరుగులు జట్టులో ఆందోళన పెంచాయి. తొలి రెండు వన్డేల్లో శిఖర్ ధావన్ నిరాశపరిస్తే, మూడో వన్డేలో అతని స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన అజింక్యా రహానే పరుగు మాత్రమే చేశాడు. ఇక మూడు వన్డేలు ఆడిన కేఎల్ రాహుల్ కూడా ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఈ నేపథ్యంలో భారత ఓపెనింగ్ పై విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రత్యేకంగా చివరి వన్డేలో భారత్ ఓటమికి ఓపెనర్లే కారణమని విశ్లేషకులు మండిపడుతున్నారు. అయితే భారత ఓపెనర్లను కెప్టెన్ విరాట్ కోహ్లి వెనకేసుకొచ్చాడు. 'భారత్‌కు మంచి ఓపెనర్లు ఉన్నారు. ఓపెనర్ల కోసం వేరే అన్వేషణ అనవసరం అనేది నా భావన. ప్రస్తుత ఓపెనర్లు ఫామ్‌లో లేరు. వారికి మరికొంత సమయం ఇవ్వాలి. వారు తిరిగి గాడిలో పడటానికి కొద్ది సమయం కేటాయిస్తే చాలు.గతంలో మాకు ఓపెనర్ల ఇబ్బంది ఉండేది కాదు..కేవలం మిడిల్ ఆర్డర్ ప్రాబ్లమ్ మాత్రమే ఉండేది. ఇప్పుడు మిడిల్ ఆర్డర్ బాగుంటే.. ఓపెనర్లు నిరాశపరిచారు. దీన్ని సమస్యగా భావించడం లేదు. తొందర్లోనే అంతా సర్దుకుంటుంది' అని కోహ్లి పేర్కొన్నాడు. -
ధావాన్ గాడిలో పడితేనే...
ప్రపంచకప్‌లో ఓపెనర్లు ఎవరు? ముక్కోణపు టోర్నీ ద్వారా భారత్ పరిష్కరించుకోవాల్సిన తొలి ప్రశ్న ఇది. రహానే, రోహిత్ శర్మలలో ఒకరు ధావన్‌తో కలిసి ఓపెనింగ్ చేయాలనే సలహా ఇన్నాళ్లూ వినిపించింది. ఆస్ట్రేలియాతో వన్డేలో అద్భుతమైన ఇన్నింగ్స్ ద్వారా ఓపెనర్‌గా తానే ఉంటానని రోహిత్ స్పష్టం చేసినట్లే. ఎడమచేతి వాటం ఆటగాడు కాబట్టి ధావన్ కచ్చితంగా రోహిత్‌కు జతగా దిగుతాడు. అయితే అతని ఫామ్ బాగా ఆందోళన కలిగిస్తోంది. టెస్టుల్లో విఫలమైన రోహిత్, రైనా ఫార్మాట్ మారగానే గాడిలో పడ్డారు. ధావన్ మాత్రం ఇంకా కుదురుకున్నట్లు కనిపించడం లేదు. ఇంగ్లండ్‌తో నేడు జరిగే మ్యాచ్ ద్వారా అయినా ధావన్ గాడిలో పడతాడా? బ్రిస్బేన్: భారత బ్యాట్స్‌మెన్ రంగు దుస్తులు తొడుక్కుంటే ఒక్కసారిగా చెలరేగుతారనేది తరచుగా వినిపించే వ్యాఖ్య. దీనికి తగ్గట్లే టెస్టు సిరీస్‌లో విఫలమైన రోహిత్, రైనా తొలి వన్డేలో అద్భుతంగా ఆడారు. తొలి వన్డేలో భారత ఆటతీరును గమనిస్తే... ప్రపంచకప్‌కు ముందు సరిజేసుకోవాల్సిన అంశాలు చాలానే కనిపిస్తున్నాయి. ఓపెనర్ ధావన్‌తో పాటు ఆల్‌రౌండర్ స్లాట్‌లో అక్షర్ పటేల్ సరిపోతాడా అనేది చూడాలి. అలాగే పేసర్ల నుంచి కూడా నిలకడ రావాలి. ఈ సమస్యలు పరిష్కరించుకోవడానికి మరో అవకాశం వెంటనే భారత్‌కు వచ్చింది. ముక్కోణపు టోర్నీలో భాగంగా నేడు జరిగే మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో భారత్ తలపడుతుంది. ఆస్ట్రేలియాతో ఆడిన వన్డేల్లో ఈ రెండు జట్లూ ఓడిపోయాయి. కాబట్టి ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు ఫైనల్ అవకాశాలు బాగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్లకూ ఈ మ్యాచ్ చాలా కీలకం. మార్పులు లేకపోవచ్చు! తొలి వన్డేలో ఓడిపోయినా భారత ప్రదర్శన ఫర్వాలేదనిపించేలా ఉంది. కాబట్టి ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో పెద్దగా మార్పులు చేయకపోవచ్చు. రోహిత్ నిలకడను కనబరిస్తే సమస్య ఉండదు. రహానేను ఓపెనర్‌గా ప్రమోట్ చేయాలనే ఆలోచనతో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో అతణ్ని ఫస్ట్‌డౌన్‌లో పంపించారు. ఈసారి కోహ్లి తిరిగి మూడో నంబర్లో, రహానే నాలుగో నంబర్లో ఆడొచ్చు. రైనా ఫామ్‌లోకి వచ్చాడు కాబట్టి రాయుడికి ఈ మ్యాచ్‌లో అవకాశం ఉండకపోవచ్చు. ఈ సిరీస్‌లో అందరికంటే కీలక వ్యక్తి ధోని. లోయర్ ఆర్డర్లో బౌలర్ల అండతో స్కోర్లు రాబట్టాల్సిన బాధ్యత ధోనిది. తొలి వన్డేలో గనుక అతను మరో 5 ఓవర్లు క్రీజులో ఉంటే భారత్‌కు మరింత స్కోరు వచ్చేది. ఇక భారత్‌ను బాగా వేధిస్తున్న అంశం పేస్ బౌలింగ్. ఇషాంత్ ఇంకా గాయం నుంచి కోలుకోలేదు. మిగిలిన ముగ్గురిలో భువనేశ్వర్ ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేశాడు. అతను డెత్ ఓవర్లలో భారీగా పరుగులిస్తాడు కాబట్టి... షమీ, ఉమేశ్ ఇద్దరూ ఫిట్‌గా ఉండటం కీలకం. అయితే అక్షర్ పటేల్ బంతితో అమోఘంగా రాణించడం ధోనికి కొత్త ప్రత్యామ్నాయాలను చూపించింది. అవసరమైతే అక్షర్ పటేల్‌తో చివరి ఓవర్లలో బౌలింగ్ చేయించవచ్చనే ఆలోచన ప్రస్తుతం భారత టీమ్ మేనేజ్మెంట్కు ఉంది. ఒక్క మ్యాచ్‌తోనే పూర్తిగా ఓ నిర్ణయానికి రావడం కష్టం కాబట్టి... ఈ మ్యాచ్‌లోనూ మార్పులు ఉండకపోవచ్చు. ఆసీస్‌తో వన్డేలో కాలి నొప్పితో ఓవర్ పూర్తి చేయకుండా వెళ్లిన షమీ... ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండొచ్చు. ఒకవేళ షమీ ఫిట్‌గా లేకపోతే మోహిత్ శర్మ తుది జట్టులోకి వస్తాడు. వాళ్లకి మరింత కీలకం భారత్‌తో పోలిస్తే ఇంగ్లండ్‌కు ఈ మ్యాచ్ బాగా కీలకం అనుకోవాలి. ఆస్ట్రేలియా పరిస్థితులకు అలవాటుపడటంతో పాటు జట్టు కూర్పును సరిజేసుకోవాలి. కొత్త కెప్టెన్ మోర్గాన్ మినహా ఆసీస్‌తో వన్డేలో బ్యాట్స్‌మెన్ అంతా ఘోరంగా విఫలమయ్యారు. ముఖ్యంగా ఓపెనర్ బెల్ తొలి బంతికే డకౌట్ అయ్యాడు. ఆరంభంలో రెండు మూడు వికెట్లు పడితే ఏ జట్టైనా ఒత్తిడిలోకి వెళుతుంది. అయితే బ్యాటింగ్‌తో పోలిస్తే ఇంగ్లండ్ బౌలింగ్ బాగుందనే చెప్పాలి. గాయం కారణంగా తొలి మ్యాచ్ ఆడని అండర్సన్ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతున్నాడు. వోక్స్, బ్రాడ్, జోర్డాన్‌ల రూపంలో మరో ముగ్గురు పేసర్లు అందుబాటులో ఉన్నారు. పేస్, స్వింగ్‌కు సహకరించే పిచ్ ఎదురైతే ఈ లైనప్‌ను తట్టుకోవడం కష్టం. భారత బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉన్నందున... ఈ మ్యాచ్‌ను భారత బ్యాట్స్‌మెన్, ఇంగ్లండ్ బౌలర్ల మధ్య పోరుగా అభివర్ణించాలి. జట్లు (అంచనా) భారత్: ధోని (కెప్టెన్), ధావన్, రోహిత్, కోహ్లి, రహానే, రైనా, అక్షర్ పటేల్, అశ్విన్, భువనేశ్వర్, షమీ, ఉమేశ్. ఇంగ్లండ్: మోర్గాన్ (కెప్టెన్), బెల్, మొయిన్ అలీ, జేమ్స్ టేలర్, రూట్, బొపారా, బట్లర్, వోక్స్, జోర్డాన్, బ్రాడ్, అండర్సన్. ఉదయం గం. 8.50 నుంచి స్టార్ స్పోర్ట్స్-1, డీడీ నేషనల్లో ప్రత్యక్ష ప్రసారం పిచ్, వాతావరణం వర్షంతో ఇబ్బంది ఉండకపోవచ్చు. వన్డేలకు సరిపోయే పిచ్ సిద్ధంగా ఉందని క్యూరేటర్ చెబుతున్నారు. రాత్రి లైట్ల వెలుతురులో స్వింగ్‌కు అనుకూలించే అవకాశం ఉంది. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోవచ్చు. 12 ఇంగ్లండ్‌తో ఆడిన చివరి 15 వన్డేల్లో భారత్ 12 గెలిచింది. ఇందులో నాలుగు ఇంగ్లండ్ గడ్డమీదే గెలవడం విశేషం. -
రేసు రసవత్తరం
భారత జట్టు ప్రపంచకప్ నిలబెట్టుకోవాలంటే కచ్చితంగా మంచి ఓపెనర్లు కావాలి. గత ప్రపంచకప్ విజయంలో సెహ్వాగ్, గంభీర్ల పాత్ర మరచిపోలేనిది. ఈసారి ఈ ఇద్దరూ కనుమరుగయ్యారు. ఇంగ్లండ్‌లో రోహిత్ గాయపడటంతో దొరికిన అవకాశాన్ని వినియోగించుకున్న రహానే... నిలకడగా ఆడి ఓపెనర్ స్థానానికి అర్హుడనని నిరూపించుకున్నాడు. ఇప్పుడు ఇద్దరు ఓపెనర్ల కోసం ముగ్గురి మధ్య పోటీ ఉంది. రహానే, రోహిత్, ధావన్.. ఈ ముగ్గురి మధ్య రేసు మొదలైంది. సాక్షి క్రీడావిభాగం శ్రీలంకతో ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా మొదటి మూడు వన్డేల కోసం ప్రకటించిన జట్టులో రోహిత్‌కు స్థానం దక్కలేదు. ఇంగ్లండ్ సిరీస్‌లో గాయపడ్డ తర్వాత రోహిత్ కోలుకున్నా... నేరుగా జట్టులోకి తీసుకోలేదు. సాధారణంగా ధోని, కోహ్లి లాంటి ఆటగాడు గాయపడ్డా... కోలుకుంటే ఎలాంటి పరీక్షలు లేకుండా జట్టులోకి వస్తాడు. కానీ రోహిత్ విషయంలో సెలక్టర్లు నేరుగా ఆ అవకాశం ఇవ్వలేదు. దీనికి కారణం బహుశా తన మీద పూర్తిస్థాయిలో నమ్మకం లేకపోవడమే కావచ్చు. వెస్టిండీస్ పర్యటన రద్దు కాకపోయి ఉంటే... టెస్టుకు ముందు ప్రాక్టీస్ మ్యాచ్ ద్వారా రోహిత్ మైదానంలో అడుగుపెట్టేవాడేమో. శ్రీలంకతో ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ ఎ తరఫున ఆడే అవకాశం రోహిత్‌కు వచ్చింది. దీన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు ఈ ముంబై స్టార్ ఆటగాడు. 111 బంతుల్లోనే 142 పరుగులు చేసి... గత ఏడాది ఆస్ట్రేలియాపై సిరీస్‌ను గుర్తు తెచ్చాడు. ఆ సిరీస్‌లో ఏకంగా డబుల్ సెంచరీ చేసిన రోహిత్... మళ్లీ ఆ స్థాయిలో బ్యాట్ ఝళిపించాడు. ఈ మ్యాచ్ ద్వారా అతడి ఆత్మవిశ్వాసం కచ్చితంగా పెరిగి ఉంటుంది. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసిన చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ కూడా రోహిత్ ఆడిన తీరుకు ముగ్ధుడయ్యారు. తనకి పరీక్ష పెట్టారనే కసి రోహిత్లో ఉందేమో.... కట్, పుల్, డ్రైవ్, స్వీప్ ఇలా అన్ని ర కాల షాట్లు ఆడి బౌండరీల వర్షం కురిపించాడు. వెస్టిండీస్‌తో జరిగిన మూడు వన్డేల్లో ఓపెనర్లుగా ఆడిన రహానే, ధావన్ ఇద్దరూ పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయారు. ప్రపంచకప్‌కు ముందు భారత జట్టు ఆస్ట్రేలియాలో ముక్కోణపు వ న్డే టోర్నీ ఆడుతుంది. కానీ ఆ టోర్నీ ప్రారంభమయ్యే సమయానికి భారత జట్టును ప్రపంచకప్ కోసం ప్రకటించాలి. కాబట్టి ఆటగాళ్ల వన్డే ఆటను పరిశీలించడానికి ప్రస్తుతం జరుగుతున్న శ్రీలంక సిరీస్ ఒక్కటే మంచి మార్గం. ఆఖరి రెండు వన్డేలకు రోహిత్ జట్టులోకి రావడం ఖాయం. కాబట్టి తొలి మూడు వన్డేల్లో ధావన్, రహానేల ద్వయం ఏం చేస్తారో చూడాలి. ప్రపంచకప్‌కు ఓ రిజర్వ్ ఓపెనర్ కూడా ఉండాలి. కాబట్టి ఈ ముగ్గురూ మెగా టోర్నీకి ఎంపికైతే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే ఏ ఇద్దరు తుది జట్టులో ఉంటారనేదే ఆసక్తికరం. ఎవరి అవకాశాలు ఎంతనేది చూద్దాం... రోహిత్ శర్మ: గతంలో మిడిలార్డర్లో ఆడినా.. ఏడాదికిపైగా ఓపెనర్‌గానే ఆడుతున్నాడు. స్వదేశంలో చెలరేగి ఆడటం తనకు సానుకూలాంశం. అయితే తను ఓపెనర్ అయ్యాక పూర్తి స్థాయిలో పరీక్ష ఎదురుకాలేదు. ఇంగ్లండ్‌లో పేస్ వికెట్‌పై ఆడిన ఒక్క ఇన్నింగ్స్‌లోనూ ఆకట్టుకున్నాడు. రోహిత్ పూర్తి ఫిట్నెస్, ఫామ్‌తో ఉంటే తను ఓపెనర్‌గా ఆడటమే మంచిది. శిఖర్ ధావన్: సాధారణంగా కుడి, ఎడమల కాంబినేషన్‌తో ఓపెనర్లు ఉండాలని మెజారిటీ జట్లు కోరుకుంటాయి. రేసులో ఉన్న ముగ్గురిలో ధావన్ ఒక్కడే ఎడమచేతి వాటం ఆటగాడు. ఇది తనకు పెద్ద సానుకూలాంశం. అయితే ఫామ్‌లో లేకపోతే కాంబినేషన్ ను పట్టించుకోరు. గత ఏడాది ఇంగ్లండ్‌లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ వన్డే టోర్నమెంట్‌ను భారత్ గెలుచుకోవడంలో తనదే కీలక పాత్ర. అయితే గత ఏడాది కాలంగా మాత్రం పూర్తి సామర్థ్యంతో ఆడలేకపోతున్నాడు. అజింక్య రహానే: దేశవాళీ క్రికెట్లో, ఐపీఎల్లో రహానేకు ఓపెనర్‌గా మంచి రికార్డు ఉంది. అందుకే ఇంగ్లండ్‌లో రోహిత్ గాయపడగానే రహానే ఆ స్థానాన్ని భర్తీ చేశాడు. బ్యాకప్‌గా విజయ్ను పిలిపించినా... ఇంగ్లండ్‌లో రహానే ఆటతీరు చూశాక భారత్ మరో ఓపెనర్ గురించి ఆలోచించాల్సిన అవసరం రాలేదు. రహానేను ఓపెనర్‌గా ఆడించాలనేది ధోని ఆలోచన. ఒకవేళ రోహిత్ వచ్చినా మిడిలార్డర్లో ఆడిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా జట్టు మేనేజ్మెంట్ చేస్తోంది. భారత సెలక్టర్లకు ఓపెనర్ల విషయంలో ఉన్న అనుమానాలు శ్రీలంకతో ఐదు వన్డేలు ముగిసే సరికే తీరిపోతాయి. రోహిత్ చివరి రెండు వన్డేలకు రావడం ఖాయమే అయితే... ప్రస్తుతం ఉన్న ఇద్దరిలో ఎవరు తప్పుకుంటారనే ప్రశ్నకు తొలి మూడు వన్డేల ద్వారా సమాధానం దొరుకుతుంది.