
ధావాన్ గాడిలో పడితేనే...
ప్రపంచకప్‌లో ఓపెనర్లు ఎవరు? ముక్కోణపు టోర్నీ ద్వారా భారత్ పరిష్కరించుకోవాల్సిన తొలి ప్రశ్న ఇది. రహానే, రోహిత్ శర్మలలో ఒకరు ధావన్‌తో కలిసి ఓపెనింగ్ చేయాలనే సలహా ఇన్నాళ్లూ వినిపించింది. ఆస్ట్రేలియాతో వన్డేలో అద్భుతమైన ఇన్నింగ్స్ ద్వారా ఓపెనర్‌గా తానే ఉంటానని రోహిత్ స్పష్టం చేసినట్లే. ఎడమచేతి వాటం ఆటగాడు కాబట్టి ధావన్ కచ్చితంగా రోహిత్‌కు జతగా దిగుతాడు.
అయితే అతని ఫామ్ బాగా ఆందోళన కలిగిస్తోంది. టెస్టుల్లో విఫలమైన రోహిత్, రైనా ఫార్మాట్ మారగానే గాడిలో పడ్డారు. ధావన్ మాత్రం ఇంకా కుదురుకున్నట్లు కనిపించడం లేదు. ఇంగ్లండ్‌తో నేడు జరిగే మ్యాచ్ ద్వారా అయినా ధావన్ గాడిలో పడతాడా?
బ్రిస్బేన్: భారత బ్యాట్స్‌మెన్ రంగు దుస్తులు తొడుక్కుంటే ఒక్కసారిగా చెలరేగుతారనేది తరచుగా వినిపించే వ్యాఖ్య. దీనికి తగ్గట్లే టెస్టు సిరీస్‌లో విఫలమైన రోహిత్, రైనా తొలి వన్డేలో అద్భుతంగా ఆడారు. తొలి వన్డేలో భారత ఆటతీరును గమనిస్తే... ప్రపంచకప్‌కు ముందు సరిజేసుకోవాల్సిన అంశాలు చాలానే కనిపిస్తున్నాయి. ఓపెనర్ ధావన్‌తో పాటు ఆల్‌రౌండర్ స్లాట్‌లో అక్షర్ పటేల్ సరిపోతాడా అనేది చూడాలి.
అలాగే పేసర్ల నుంచి కూడా నిలకడ రావాలి. ఈ సమస్యలు పరిష్కరించుకోవడానికి మరో అవకాశం వెంటనే భారత్‌కు వచ్చింది. ముక్కోణపు టోర్నీలో భాగంగా నేడు జరిగే మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో భారత్ తలపడుతుంది. ఆస్ట్రేలియాతో ఆడిన వన్డేల్లో ఈ రెండు జట్లూ ఓడిపోయాయి. కాబట్టి ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు ఫైనల్ అవకాశాలు బాగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్లకూ ఈ మ్యాచ్ చాలా కీలకం.
మార్పులు లేకపోవచ్చు!
తొలి వన్డేలో ఓడిపోయినా భారత ప్రదర్శన ఫర్వాలేదనిపించేలా ఉంది. కాబట్టి ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో పెద్దగా మార్పులు చేయకపోవచ్చు. రోహిత్ నిలకడను కనబరిస్తే సమస్య ఉండదు. రహానేను ఓపెనర్‌గా ప్రమోట్ చేయాలనే ఆలోచనతో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో అతణ్ని ఫస్ట్‌డౌన్‌లో పంపించారు. ఈసారి కోహ్లి తిరిగి మూడో నంబర్‌లో, రహానే నాలుగో నంబర్‌లో ఆడొచ్చు.
రైనా ఫామ్‌లోకి వచ్చాడు కాబట్టి రాయుడికి ఈ మ్యాచ్‌లో అవకాశం ఉండకపోవచ్చు. ఈ సిరీస్‌లో అందరికంటే కీలక వ్యక్తి ధోని. లోయర్ ఆర్డర్‌లో బౌలర్ల అండతో స్కోర్లు రాబట్టాల్సిన బాధ్యత ధోనిది. తొలి వన్డేలో గనుక అతను మరో 5 ఓవర్లు క్రీజులో ఉంటే భారత్‌కు మరింత స్కోరు వచ్చేది.
ఇక భారత్‌ను బాగా వేధిస్తున్న అంశం పేస్ బౌలింగ్. ఇషాంత్ ఇంకా గాయం నుంచి కోలుకోలేదు. మిగిలిన ముగ్గురిలో భువనేశ్వర్ ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేశాడు. అతను డెత్ ఓవర్లలో భారీగా పరుగులిస్తాడు కాబట్టి... షమీ, ఉమేశ్ ఇద్దరూ ఫిట్‌గా ఉండటం కీలకం. అయితే అక్షర్ పటేల్ బంతితో అమోఘంగా రాణించడం ధోనికి కొత్త ప్రత్యామ్నాయాలను చూపించింది.
అవసరమైతే అక్షర్ పటేల్‌తో చివరి ఓవర్లలో బౌలింగ్ చేయించవచ్చనే ఆలోచన ప్రస్తుతం భారత టీమ్ మేనేజ్‌మెంట్‌కు ఉంది. ఒక్క మ్యాచ్‌తోనే పూర్తిగా ఓ నిర్ణయానికి రావడం కష్టం కాబట్టి... ఈ మ్యాచ్‌లోనూ మార్పులు ఉండకపోవచ్చు. ఆసీస్‌తో వన్డేలో కాలి నొప్పితో ఓవర్ పూర్తి చేయకుండా వెళ్లిన షమీ... ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండొచ్చు. ఒకవేళ షమీ ఫిట్‌గా లేకపోతే మోహిత్ శర్మ తుది జట్టులోకి వస్తాడు.
వాళ్లకి మరింత కీలకం
భారత్‌తో పోలిస్తే ఇంగ్లండ్‌కు ఈ మ్యాచ్ బాగా కీలకం అనుకోవాలి. ఆస్ట్రేలియా పరిస్థితులకు అలవాటుపడటంతో పాటు జట్టు కూర్పును సరిజేసుకోవాలి. కొత్త కెప్టెన్ మోర్గాన్ మినహా ఆసీస్‌తో వన్డేలో బ్యాట్స్‌మెన్ అంతా ఘోరంగా విఫలమయ్యారు. ముఖ్యంగా ఓపెనర్ బెల్ తొలి బంతికే డకౌట్ అయ్యాడు. ఆరంభంలో రెండు మూడు వికెట్లు పడితే ఏ జట్టైనా ఒత్తిడిలోకి వెళుతుంది.
అయితే బ్యాటింగ్‌తో పోలిస్తే ఇంగ్లండ్ బౌలింగ్ బాగుందనే చెప్పాలి. గాయం కారణంగా తొలి మ్యాచ్ ఆడని అండర్సన్ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతున్నాడు. వోక్స్, బ్రాడ్, జోర్డాన్‌ల రూపంలో మరో ముగ్గురు పేసర్లు అందుబాటులో ఉన్నారు. పేస్, స్వింగ్‌కు సహకరించే పిచ్ ఎదురైతే ఈ లైనప్‌ను తట్టుకోవడం కష్టం. భారత బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉన్నందున... ఈ మ్యాచ్‌ను భారత బ్యాట్స్‌మెన్, ఇంగ్లండ్ బౌలర్ల మధ్య పోరుగా అభివర్ణించాలి.
జట్లు (అంచనా)
భారత్: ధోని (కెప్టెన్), ధావన్, రోహిత్, కోహ్లి, రహానే, రైనా, అక్షర్ పటేల్, అశ్విన్, భువనేశ్వర్, షమీ, ఉమేశ్.
ఇంగ్లండ్: మోర్గాన్ (కెప్టెన్), బెల్, మొయిన్ అలీ, జేమ్స్ టేలర్, రూట్, బొపారా, బట్లర్, వోక్స్, జోర్డాన్, బ్రాడ్, అండర్సన్.
ఉదయం గం. 8.50 నుంచి స్టార్ స్పోర్ట్స్-1, డీడీ నేషనల్‌లో ప్రత్యక్ష ప్రసారం
పిచ్, వాతావరణం
వర్షంతో ఇబ్బంది ఉండకపోవచ్చు. వన్డేలకు సరిపోయే పిచ్ సిద్ధంగా ఉందని క్యూరేటర్ చెబుతున్నారు. రాత్రి లైట్ల వెలుతురులో స్వింగ్‌కు అనుకూలించే అవకాశం ఉంది. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోవచ్చు.
12 ఇంగ్లండ్‌తో ఆడిన చివరి 15 వన్డేల్లో భారత్ 12 గెలిచింది. ఇందులో నాలుగు ఇంగ్లండ్ గడ్డమీదే గెలవడం విశేషం.