మరో చరిత్ర సృష్టించిన నాసా..
న్యూయార్క్: అంతర్జాతీయ ఖగోళ సంస్థ నాసా మరో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. భారీ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన జూనో అంతరిక్ష నౌక సుదీర్ఘ ప్రయాణం చేసి జూపిటర్(బృహస్పతి) కక్ష్యలోకి చేరుకుంది. ఇందుకుగాను దాదాపు ఐదేళ్ల సమయం పట్టింది. సౌర వ్యవస్థలో ప్రాణి జీవించేందుకు అనుకూలంగా ఉన్న ఏకైక గ్రహం జూపీటర్ ఒక్కటే అని ఖగోళ శాస్త్రజ్ఞుల అభిప్రాయం. ఆ మేరకే పలు దేశాలు ప్రయోగాలు చేస్తున్నాయి.
అందులో భాగంగా 2011 ఆగస్టు 5న నాసా జూనో అంతరిక్షంలోకి ప్రయోగించింది. ఈ ఐదేళ్ల కాలంలో దాదాపు 260కోట్ల కిలో మీటర్లు ప్రయాణించిన జూనో చివరకు జూపిటర్ కక్షలోకి చేరింది. జూపిటర్ చుట్టూ ఇది 37సార్లు తిరగనుంది. దాదాపు 20 నెలలపాటు ఈ గ్రహాన్ని పరిశీలిస్తుంది. సూర్యుడికి 74.1కోట్ల కిలోమీటర్ల దూరంలో జూపిటర్ ఉండగా.. భూమికి 58.8 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. భూమి కన్నా ఇది 11.2రెట్లు పెద్దది. ఇక సౌరమండలంలో ఈ గ్రహమే అన్నింటికన్నా పెద్దదని ఇప్పటికే తెలిసిందే. దాదాపు 1.1 బిలియన్ డాలర్ల వ్యయంతో నాసా ఈ ప్రయోగాన్ని చేపట్టింది.