organic methods
-
వంట పండింది!
జీవితంలో సమస్యలు రావడం సాధారణం. ఒక్కోసారి ఇవి ఊపిరాడనివ్వవు. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనే ధైర్యంగా వాటిని ఎదుర్కొనాలి. తానేమిటో నిరూపించుకోవాలి. అలానే చేసింది బిందు. తన కూతుళ్లకు మంచి చదువును అందించేందుకు ఒక పక్క గరిట తిప్పుతూనే మరోపక్క నాగలి పట్టి పొలం సాగు చేస్తూ ‘‘మనం కూడా ఇలా వ్యవసాయం చేస్తే బావుంటుంది’’ అనేంతగా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. తమిళనాడులోని తెనై జిల్లా బొమ్మినాయకన్పట్టి గ్రామానికి చెందిన బిందు, పిచ్చయ్య దంపతులకు ఇద్దరు అమ్మాయిలు. పిచ్చయ్య సొంత పొలంలో చెరకు పండించేవాడు. అయితే ఏటా అప్పులు తప్ప ఆదాయం వచ్చేది కాదు. గ్రామంలో చాలామంది రైతులు చెరకు, పత్తిని పండించి నష్టపోవడాన్ని చూసి ఇతర పంటలను పండించాలని నిర్ణయించుకుంది బిందు. మొక్కజొన్న, వంగ పంటను పొలంలో వేసింది. మరోపక్క సెల్ఫ్‌హెల్ప్ గ్రూప్‌లో చేరి చుట్టుపక్కల రైతులు ఏం పండిస్తున్నారో తెలుసుకునేది. ఇతర రైతుల సలహాలు, సూచనలతో సాగును మెరుగు పరుచుకుంటూ, ఎస్‌హెచ్‌జీ ద్వారా కృషి విజ్ఞాన్ నిర్వహించే వ్యవసాయ కార్యక్రమాలకు హాజరవుతూ మెలకువలు నేర్చుకుంది. అధికారులు చెప్పిన విధంగా పప్పుధాన్యాలు, మిల్లెట్స్, మినుములు కూడా సేంద్రియ పద్ధతి లో సాగుచేసింది. దీంతో మంచి లాభాలు వచ్చాయి. విరామంలో... పంటకు పంటకు మధ్య వచ్చే విరామంలో కూరగాయలు పండించడం మొదలు పెట్టింది. అవి నాలుగు నెలల్లోనే చేతికి రావడంతో మంచి ఆదాయం వచ్చేది. విరామ పంటలు చక్కగా పండుతుండడంతో.. కొత్తిమీర, కాకర, ఇతర కూరగాయలను పండిస్తోంది. పంటను పసుమయిగా ... ఉత్పత్తి ఎక్కువగా ఉండడంతో చాలా కూరగాయలు వృథా అయ్యేవి. అలా వ్యర్థంగా పోకుండా ఉండేందుకు ‘పసుమయి’ పేరిట ఎండబెట్టిన కూరగాయలు, పొడులను విక్రయిస్తోంది. ఇడ్లీ పొడి, నిమ్మపొడి, ధనియాల పొడి వంటి అనేక రకాల పొడులను మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చింది. నెలకు వందల సంఖ్యలో విక్రయాలు జరుగుతున్నాయి. ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ వ్యాపారవేత్తగా ఎదిగింది బిందు. ఆమె పెద్దకూతురు ఎం.ఎస్. పూర్తి చేస్తే, చిన్నకూతురు బీఎస్సీ నర్సింగ్ చేస్తోంది. అలా సేద్యంతో పిల్లల చదువులనూ పండించుకుంది బిందు. -
అనకాపల్లి టు అమెరికా.. భలే గిరాకీ
అనకాపల్లి: తాతల నుంచి వచ్చిన వృత్తి.. దానికి వినూత్న ఆలోచనలు జత కలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కలగలిపారు. ప్రజల ఆరోగ్యం కోసం విటమిన్లు వేశారు. వెరసి అనకాపల్లి బెల్లం దేశదేశాలకు వెళ్తోంది. ఆంధ్రా నుంచి అమెరికాకు బెల్లాన్ని అందిస్తున్న ఆ రైతు అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఆయనే వేగి శ్రీనివాసరావు. ప్రధాన వాణిజ్య పంటల్లో ఒకటయిన చెరకు సాగు, ఉత్పత్తుల్లో ఆయన అద్భుతాలు సృష్టిస్తున్నారు. అత్యధిక నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ఎటువంటి కలుషితం కాని బెల్లాన్ని అమెరికాకు కూడా ఎగుమతి చేస్తున్నారు. బీఏ, మెటలర్జీలో డిప్లొమా చదివిన శ్రీనివాసరావు సొంతూరు అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం రాజుపేట. శ్రీనివాసరావుది వ్యవసాయ కుటుంబం. తాతల కాలం నుంచి బెల్లం తయారీలో నిమగ్నమైన కుటుంబమది. శ్రీనివాసరావు కూడా వ్యవసాయం చేశారు. పామాయిల్, జీడిమామిడి, సరుగు సాగు చేశారు. అవి పెద్దగా కలిసి రాకపోవడంతో మళ్లీ బెల్లం తయారీపై దృష్టి సారించారు. తాతయ్య కాలం నుంచి వినియోగిస్తున్న బెల్లం క్రషర్‌తో బెల్లం తయారీ ప్రారంభించారు. ఇక్కడే ఆయన వినూత్నంగా ఆలోచించారు. మిగతా తయారీదారులకంటే తాను మరింత నాణ్యమైన సరుకు ఎలా తయారుచేయాలో ఆలోచించారు. బెల్లం తయారీలో సహజంగా సల్ఫర్, పంచదార వినియోగిస్తుంటారు. అయితే మనిషి ఆరోగ్యానికి హాని కలగజేసే ఈ పదార్థాలను శ్రీనివాసరావు ఉపయోగించరు. సుక్రోజు, విటమిన్ ఏ, విటమిన్ సీ తగిన మోతాదులో కలిపి అత్యున్నత ప్రమాణాలతో బెల్లం తయారీ ప్రారంభించారు. పంచదారతో సంబంధం లేకుండా, రంగుకు ప్రాధాన్యమివ్వకుండా, హైడ్రోస్ కలపకుండా బెల్లం అందించడమే ఆయన లక్ష్యం. ఇందుకోసం ఆయన తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో పర్యటించి ఆధునిక పద్ధతుల్లో బెల్లం తయారు చేసే యూనిట్లను పరిశీలించారు. మహారాష్ట్ర, కర్ణాటక, అనకాపల్లి పరిశోధన కేంద్రాల్లో విలువ ఆధారిత బెల్లం తయారీ గురించి తెలుసుకున్నారు. రూ.10 లక్షలతో ప్రారంభం సంప్రదాయ పద్ధతిలో బెల్లం తయారీకి మొదట రూ.10 లక్షలతో యూనిట్‌ను ప్రారంభించారు. 5 గ్రాముల నుంచి 850 గ్రాముల బరువు బెల్లం దిమ్మలు, కుందులు, పౌడర్, బెల్లం ద్రావణాన్ని తయారీ మొదలెట్టారు. క్రమంగా వ్యాపారం పెంచుకుంటూ పోయారు. భారత దేశం నుంచి ప్రపంచ దేశాలకు 8 మిలియన్ టన్నుల బెల్లం డిమాండ్ ఉంది. ఆరు మిలియన్ టన్నుల బెల్లాన్ని మాత్రమే ఎగుమతి చేయగలుగుతున్నారు. దీంతో బెల్లం ఎగుమతి పైనా శ్రీనివాసరావు దృష్టి పెట్టారు. విదేశీయులు ఇష్టపడే ఫ్లేవర్లలో బెల్లం తయారు చేయాలని నిర్ణయించారు. రూ. 2.5 కోట్లతో కొత్త యూనిట్ నెలకొల్పారు. శ్రీనివాసరావు ఎరుకునాయుడు ఆగ్రోస్ కంపెనీ పేరుతో అంతర్జాతీయ ప్రమాణాలతో బెల్లం తయారీ మొదలెట్టారు. ఇందుకోసం అత్యాధునిక యంత్రాలు తెప్పించారు. 40 మంది నిపుణులైన ఉద్యోగులను నియమించారు. చక్కని ప్యాకింగ్‌తో విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ముందుగా మారిషస్‌కు, తర్వాత ఆఫ్రికా, యూరోప్ దేశాలకు ఎగుమతి చేయడం ప్రారంభించారు. అంతర్జాతీయ ప్రమాణాలు పాటించినందుకు గాను ఐఎస్వో 22000, హెచ్ఏసీసీపీ, ఐఎస్వో 1001 పత్రాలను పొందారు. ప్రస్తుతం అమెరికా నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. ఏడాదికి 5 వేల టన్నుల చెరకు క్రషింగ్‌తో బెల్లం, ఉప ఉత్పత్తులను తయారు చేసి ఎగుమతి చేస్తున్నారు. బెల్లం సరఫరాకు శ్రీనివాసరావుకు ఆఫ్రికా దేశం ఘనా నుంచి అందిన టెండర్ సర్టిఫికెట్ రైతుకూ ఎక్కువ ధర ఒకవైపు చక్కెర కర్మాగారాలు గిట్టుబాటు కాక నష్టాల బాటన పడుతున్నాయి. చెరకు కొన్నందుకు రైతులకు కనీస ధర ఇవ్వలేకపోతున్నాయి. ఇదే సమయంలో శ్రీనివాసరావు చెరకు టన్నుకు రూ.2,800 వరకు ఇస్తున్నాడు. మాకవరపాలెం, నాతవరం, యలమంచిలి, గొలుగొండ, రోలుగుంట ప్రాంతాల నుంచి చెరకు కొంటున్నారు. శ్రీనివాసరావును ఆదర్శంగా తీసుకుంటే ప్రతి రైతు ఆదర్శ పారిశ్రామికవేత్త కావచ్చు. చెరకు సాగును కాపాడుకుందాం వాణిజ్య పంటైన చెరకు సాగును మనం కాపాడుకోవాలి. మా తాతగారు, తండ్రి ఆదర్శంగా బెల్లాన్ని నాణ్యత ప్రమాణాలతో తయారు చేస్తున్నా. రూ.10 లక్షలతో మా తండ్రి పేరిట ఆగ్రోస్ యూనిట్ నెలకొల్పా. ఇక్కడ అంతర్జాతీయ ప్రమాణాలతో తయారు చేసిన బెల్లాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నా. తాజాగా అమెరికా నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. మా దగ్గర తయారయ్యే బెల్లం నాణ్యతతో కూడుకొన్నది. సేంద్రియ పద్ధతుల్లో తయారు చేస్తున్నాం. అందువల్లే డిమాండ్ పెరుగుతోంది. – వేగి శ్రీనివాసరావు -
Banothu Vennela: మట్టిని కాపాడుకుందాం!
మట్టితో పోరాడితేనే విత్తనం మొక్కగా ఎదగగలదు. కానీ, సారం లేని మట్టిలో ఏ విత్తనమూ మొలకెత్తదు. మనిషి స్వార్థంతో చేసే కలుషిత కారకాల ద్వారా మట్టి సారం కోల్పోతోంది. భూసారాన్ని కాపాడుకోకుంటే భవిష్యత్తులో అనేక దుష్పరిణామాలు తలెత్తవచ్చు. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న బానోత్ వెన్నెల అనే గిరిజన అమ్మాయి ‘సేవ్ సాయిల్’ పేరుతో ఐదు వేల కిలోమీటర్ల సైకిల్ యాత్రకు పూనుకుంది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని మారుమూల గిరిజన గ్రామపరిధిలోని సర్దాపూర్ తండాకు చెందిన బానోత్ వెన్నెల 60 రోజుల్లో 5 వేల కిలోమీటర్ల సైకిల్ యాత్రను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. సైకిల్ యాత్ర ద్వారా వేలాది మంది రైతులకు, ప్రజలకు ‘మట్టి’ పట్ల అవగాహన కల్పిస్తోంది. ఇప్పటికి దాదాపు రెండు వేల కిలోమీటర్లకు చేరువైంది. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల మీదుగా ఆమె సైకిల్ యాత్ర చేస్తోంది. మే1న కామారెడ్డి నుంచి సైకిల్ యాత్రను ప్రారంభించిన వెన్నెల మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, జోగులాంబ గద్వాల, మహబూబ్‌నగర్ జిల్లాల మీదుగా వెళుతోంది. అన్ని ప్రాంతాల్లోనూ రైతులను, గ్రామ పెద్దలను కలిసి ‘మట్టిని ఏ విధంగా కాపాడాలో, ఎందుకు కాపాడాలో’ వివరించి, తిరిగి తన యాత్రను కొనసాగిస్తోంది. కలల అధిరోహణ వెన్నెల చిన్నతనంలోనే ఆమె తండ్రి మోహన్ చనిపోయాడు. తల్లి భూలి కూలి పనులు చేస్తూ పిల్లల్ని పోషిస్తోంది. వెన్నెలకు ఇద్దరు అన్నలు, ఒక అక్క. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదవతరగతి పూర్తి చేసింది వెన్నెల. తల్లి కూలి పనికి వెళితే గానీ కుటుంబం నడవని పరిస్థితి. అలాంటి పేద కుటుంబంలో పుట్టిన వెన్నెలకు పెద్ద పెద్ద లక్ష్యాలున్నాయి. ఎన్ని కష్టాలైనా సరే వాటిని సాధించాలన్న పట్టుదలతో నిరంతరం సాధన చేస్తోంది. పర్వతారోహణ చేయాలన్నది ఆమె లక్ష్యం. ఇందుకోసం కొంతకాలం భువనగిరిలో రాక్ క్లైబింగ్ స్కూల్లో మౌంటెనీర్లో శిక్షణ కూడా తీసుకుంది. అయితే పేదరికం ఆమెకు శాపంగా మారింది. సోషల్‌మీడియాలో జగ్గీవాస్‌దేవ్ ‘సేవ్ సాయిల్’ కథనాలు విని స్ఫూర్తి పొందిన వెన్నెల భవిష్యత్తు భూసారాన్ని పెంచడానికి తన వంతుగా సమాజాన్ని జాగృతం చేయాలనుకుంది. రెండు నెలల పాటు ఒంటరిగా సైకిల్‌పై వెళ్లే యాత్రకు పూనుకుంది. తల్లి చెవి కమ్మలతో సైకిల్... ఒంటరి యాత్రకు తల్లిని ఒప్పించింది. కానీ, సైకిల్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితులు. తిరిగి తల్లినే బతిమాలుకుంది. తల్లి చెవి కమ్మలు అమ్మి, ఆమె ఇచ్చిన డబ్బులతో సైకిల్ కొనుగోలు చేసింది. మే 1 న కామారెడ్డి నుంచి సైకిల్ యాత్రను ప్రారంభించింది. ప్రస్తుతం కొత్తగూడెం భద్రాచలం జిల్లాలో యాత్ర కొనసాగుతోంది. 60 రోజుల్లో 5,000 కిలోమీటర్ల సైకిల్ యాత్ర నిర్వహించాలని లక్ష్యం పెట్టుకుంది. రాత్రిపూట ఉండాల్సిన పరిస్థితులు, యాత్రలో సమస్యల గురించి ప్రస్తావించినప్పుడు ‘ఇప్పటి వరకు ఆరు గరŠల్స్ హాస్టల్లో రాత్రిళ్లు బస చేశాను. మిగతా చోట్ల. పోలీస్ స్టేషన్లలో ఉన్నాను. ఈ రోజు (రాత్రి) కూడా పోలీస్ స్టేషన్లో ఉన్నాను. స్థానికంగా ఉండే రాజకీయ నాయకులు కూడా సపోర్ట్ చేస్తున్నారు. 10 రోజులు యాత్ర పూర్తయ్యాక ఈషా ఫౌండేషన్ వాళ్లు కలిశారు. ఒక అమ్మాయిగా ఇలాంటి సాహసమైన పనిని చేస్తున్నందుకు గర్వంగా ఉంది. రోజూ వంద కిలోమీటర్లు ‘రోజుకు వంద కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేస్తున్నాను. దారిలో రైతులు, గ్రామస్తులను కలుస్తున్నాను. భూసారం గురించి, వారు చేస్తున్న పంటల పనుల గురించి అడిగి తెలుసుకుంటున్నాను. చాలా వరకు భూమిలో సేంద్రీయత కేవలం 0.9 శాతం మాత్రమే ఉంది. ఇది ఇలాగే తగ్గితే భవిష్యత్తులో పంటల దిగుబడులకు, మనుషుల మనుగడకు పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఈ సమస్య తలెత్తకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే మేలుకోవాలి. 2050 నాటికి కనీసం 3 నుంచి 6 శాతం తిరిగి భూసారం పెంచాల్సిన అవసరం ఉంది. ఇందుకు సేంద్రీయ పద్ధతులను అవలంభించి భూసారాన్ని కాపాడాలి. లేదంటే ఇబ్బందులు తప్పవని దారిపొడవునా కలిసిన వారికల్లా వివరిస్తున్నాను’ అని తెలిపింది వెన్నెల. నిన్నటితో దాదాపు రెండు వేల కిలోమీటర్ల సైకిల్ యాత్ర పూర్తయ్యింది. ఎక్కడా ఏ ఇబ్బందులూ లేవని, గ్రామస్తుల ఇళ్లలోనే వారి ఆహ్వానం మేరకు భోజనం సదుపాయం కూడా పొందుతున్నాను’ అని తెలిపింది వెన్నెల. మట్టిబిడ్డగా మట్టి కోసం... మాది పేద కుటుంబం. అమ్మే అన్నీ తానై మమ్మల్ని పెంచి పెద్ద చేస్తోంది. ఎవరెస్ట్ అధిరోహించాలన్నది నా లక్ష్యం. ఆ లక్ష్యాన్ని సాధించాలంటే ఎన్నో అవరోధాలను అధిగమించాలి. అందుకే కొన్ని రోజులు శిక్షణ తీసుకున్నా. ఇప్పుడు భూ సారాన్ని కాపాడమంటూ సైకిల్ యాత్ర చేపట్టా. యాత్ర ద్వారా ఎంతో మంది చైతన్యం అవుతున్నారు. మట్టి బిడ్డగా మట్టికోసం చేస్తున్న ఈ యాత్ర సక్సస్ అవుతుంది. దీని తరువాత కాలేజీలో అడ్మిషన్ తీసుకోవాలి. ఆ తర్వాత పర్వతారోహణ మీద దృష్టి పెడతా. – బానోత్ వెన్నెల, సర్దాపూర్ తండా, కామారెడ్డి – ఎస్.వేణుగోపాలచారి, సాక్షి, కామారెడ్డి. -
సేంద్రియ సాగు ఆచరణ సాధ్యమే!
సాక్షి, హైదరాబాద్: ‘సేంద్రియ పద్ధతిలో సుస్థిర సాగు ఆచరణ సాధ్యమనే విషయం మా అనుభవంలో వెల్లడైంది. భూవిస్తీర్ణంతో సంబంధం లేకుండా సన్న, చిన్నకారు రైతులు కూడా సేంద్రియ పద్ధతులు అవలంభించాలి. రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించేందుకు బహుళజాతి కంపెనీ(ఎంఎన్సీ)లు అడ్డుపడుతున్నాయి. ప్రభుత్వపెద్దలు, అధికారుల అవినీతి వల్లే రసాయన ఎరువుల సబ్సిడీ విధానాలు కొనసాగుతున్నాయి. ప్రైవేటు, బహుళజాతి కంపెనీలకు ఇష్టారీతిన భూసంతర్పణ జరగకుండా సమగ్ర విధానాలు, చట్టాలు అవసరం’అని శ్రీలంక పార్లమెంటు సభ్యుడు అతురలియే రతన తెరో అన్నారు. బౌద్ధ సన్యాసి, వ్యవసాయదారు కూడా అయిన రతన తెరో బుద్ధ జయంతి జూబ్లీ వేడుకల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ‘సేంద్రియ వ్యవసాయం’దిశగా రైతులను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకతపై ‘సాక్షి’తో మాట్లాడారు. సాక్షి: మీ రెండురోజుల రాష్ట్ర పర్యటనలో గమనించిన అంశాలేమిటి? రతన: శ్రీలంక, తెలంగాణ నడుమ చరిత్ర, సంస్కృతి, ఆహారం, వ్యవసాయం, వాతావరణం తదితరాల్లో అనేక సారూప్యతలు ఉన్నాయి. పదేళ్లుగా మార్కెట్ ఎకానమీకి అనుగుణంగా శ్రీలంక సాగు విధానాలను మార్చుకుంటోంది. తెలంగాణ కూడా అదే మార్గంలో నడుస్తోంది. సాక్షి: వ్యవసాయరంగం పరంగా శ్రీలంకలో ఎలాంటి విధానాలు అమల్లో ఉన్నాయి. రతన: 2015 జనవరిలో శ్రీలంకలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన అధ్యక్షుడు సుస్థిర వ్యవసాయానికి సంబంధించి ప్రత్యేక మేనిఫెస్టో ప్రకటించారు. వ్యవసాయం, ఇతర అనుబంధ శాఖల పనితీరును సమీక్షించి అగ్రికల్చర్ వేస్టేజ్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటు, తేయాకు, దాల్చిన చెక్క ఆధారిత ఎగుమతులు, వరి, కూరగాయలు, కొబ్బరి తదితర వ్యవసాయ ఆధారిత అంశాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు చేర్చి, నన్ను సలహాదారుగా నియమించారు. సాక్షి: ప్రభుత్వాలు రసాయన ఎరువులపై సబ్సిడీలు ఇస్తున్న నేపథ్యంలో సుస్థిర వ్యవసాయం సాధ్యమేనా? రతన: మొదట్లో రసాయన ఎరువులపై సబ్సిడీలు ఎత్తేసి, రైతులకు నేరుగా డబ్బులు ఇవ్వడం ద్వారా సేంద్రియ ఎరువుల వినియోగం పెరిగేలా ప్రోత్సహించాం. రసాయన ఎరువుల దిగుమతి, పంపిణీలో అవినీతికి అలవాటు పడిన అధికారులు, నేతల ఒత్తిడితో తిరిగి రసాయన ఎరువులపై పాత విధానాలకే ప్రభుత్వం మొగ్గు చూపింది. సాక్షి: ఇలాంటి పరిస్థితుల్లో సేంద్రియ విధానంలో సుస్థిర వ్యవసాయం సాధ్యమేనా? రతన: మూడేళ్ల అనుభవంలో సుస్థిర వ్యవసాయం సాధ్యమనే విషయం తేటతెల్లమైంది. తేయాకు, కూరగాయల పంటల సాగులో ఈ విధానం అనుసరించేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ విషయంలో తెలంగాణ రైతులు కూడా మమ్మలను ఆదర్శంగా తీసుకోవచ్చు. అయితే సరైన ప్రభుత్వ విధానాల ద్వారానే సేంద్రియ వ్యవసాయం సాధ్యమవుతుంది. సాక్షి: రైతులను సేంద్రియ సాగు దిశగా మళ్లించడం సాధ్యమవుతుందా? రతన: ప్రభుత్వ నిర్ణయాలు స్థిరంగా లేనంతకాలం ఏ రైతు కూడా తనంత తానుగా సేంద్రియ సాగు వైపు మారలేడు. రసాయన ఎరువుల వినియోగానికి అలవాటు పడిన రైతులు.. ఎక్కువ దిగుబడి కోణంలోనే చూస్తున్నారు. కానీ పర్యావరణం, మానవ ఆరోగ్యంపై రసాయన ఎరువులు చూపుతున్న దుష్ప్రభావాలను పట్టించుకోవడం లేదు. అనుభవంతో చెప్తున్నాం. సేంద్రియ సాగు విధానాలు మాత్రమే అన్ని విధాలుగా శ్రేయస్కరం. సాక్షి: ఆర్గానిక్ సర్టిఫికేషన్‌పై అవగాహన లేని రైతులు ఉత్పత్తులను విక్రయించడంలో పడుతున్నఇబ్బందులకు పరిష్కారమేంటి? రతన: ప్రభుత్వాలు మొదట సమగ్రమైన భూచట్టాలు రూపొందించి, బహుళజాతి కంపెనీలు, ప్రైవేటు వ్యక్తులకు భూములు కట్టబెట్టకుండా విధానాలు రూపొందించాలి. క్షేత్ర స్థాయిలో రైతులను బృందాలుగా ఏర్పాటు చేసి, వారి వ్యవసాయ ఉత్పత్తులు ‘ఆర్గానిక్’వే నంటూ క్షేత్రస్థాయి అధికారుల ద్వారా ధ్రువీకరణపత్రాలు ఇవ్వాలి. -
ఫేస్బుక్లో చూసి ఇంటిపంటల సాగు
► సేంద్రియ పద్ధతుల్లో మేడపైనే కూరగాయలు, పండ్ల మొక్కల సాగు ► వారంలో ఐదు రోజులకు సరిపడా కూరగాయల దిగుబడి ► వంద కుండీల్లో ఇంటిపంటల సాగు ► దంపతులిద్దరూ ఉద్యోగాలు చేస్తూనే మొక్కల పెంపకానికి సమయం కేటాయింపు సోషల్ మీడియా రెండు వైపులా పదును ఉన్న కత్తి వంటిది. ఫేస్బుక్ విలువైన సమయాన్ని హరించివేస్తుందన్న అభిప్రాయం ఉంది. అయితే, ప్రత్యేక ప్రయోజనం కోసం ఫేస్బుక్ వాడితే.. ఆరోగ్యాన్ని ఇనుమడింపజేసే చక్కని అభిరుచి పెరుగుదలకు కూడా దోహదం చేస్తుందన్నది వాస్తవం. ఫేస్బుక్ ద్వారా మేడపై ఇంటిపంటల సాగు గురించి తెలుసుకొన్నారు ఆ దంపతులు. ఫేస్బుక్లో ఇంటిపంట గ్రూప్‌లో టెర్రస్‌పై సేంద్రియ సాగుకు అవసరమైన మెలకువలను ఒంటపట్టించుకున్నారు. గత మూడేళ్ల నుంచి శ్రద్ధగా తమ ఇంటిౖపైనే సేంద్రియ పంటలను సాగు చేసుకుంటున్నారు హైదరాబాద్ మౌలాలీలోని ఎంజే కాలనీకి చెందిన మేర్వాని ప్రసాద్ (94918 17964), యశోద దంపతులు. ఇద్దరూ ఎల్ఐసీ ఉద్యోగులే. పనిలో తలమునకలుగా ఉన్నా తీరిక చేసుకొని ఇంటిపంటలను సాగు చేస్తున్నారు. ఇష్టమైన పని ఏదైనా కష్టం కాదని చాటి చెపుతున్నారు. వంద కుండీల్లో ఇంటిపంటల సాగు... ఇంటిపంటల పెంపకం కోసం తమ ఇంటిపైనే వందకు పైగా కుండీలను ఏర్పాటు చేసుకున్నారు. నిరుపయోగంగా ఉన్న ప్లాస్టిక్ డబ్బాలు, మట్టి, సిమెంటు కుండీలు, సిల్పాలిన్ బ్యాగులను కుండీలుగా వాడుతున్నారు. తొలుత ఆకుకూరల సాగుతో ఇంటిపంటల పెంపకానికి శ్రీకారం చుట్టారు ప్రసాద్. నమ్మకం కుదరటంతో క్రమంగా కాయగూర మొక్కలు, తీగజాతి కూరగాయలు, పండ్ల మొక్కలకు ఇంటిపంటల సాగును విస్తరించారు. ప్రస్తుతం గోంగూర, తోటకూర, బచ్చలికూర వంటి పది రకాల ఆకుకూరలు, టమాటా, పచ్చిమిర్చి, ఉల్లి, వెల్లుల్లి, దొండ, చిక్కుడు, దొండ వంటి కాయగూరలు, కాకర, పొట్ల వంటి తీగజాతి కాయగూరలు, నిమ్మ, సపోటాతోపాటు ద్రాక్ష వంటి తీగజాతి పండ్ల మొక్కలను కూడా సాగు చేస్తున్నారు. జీవామృతం, వేప నూనెల పిచికారీ.. రెండు పాళ్లు మట్టి, ఒక పాలు కోకోపిట్, ఒక పాలు వర్మికంపోస్టు, గుప్పెడు వేపపిండిని కలిపి తయారు చేసుకున్న మట్టి మిశ్రమాన్ని ఇంటిపంటల పెంపకంలో వాడుతున్నారు. ఇంటిపంట గ్రూప్ సభ్యుల నుంచి సేకరించిన వి, తాము స్వయంగా తయారు చేసుకున్న విత్తనాలను మాత్రమే ఇంటిపంటల సాగులో వాడుతున్నారు. మొక్కలకు పోషకాలను అందించేందుకు లీటరు నీటికి 200 మి. లీ. జీవామృతాన్ని కలిపి 15 రోజులకోసారి మొక్కలపై పిచికారీ చేస్తారు. పాదుల్లో పోస్తారు. లీటరు నీటికి 5 మి. లీ. వేపనూనెను కలిపి మొక్కలపై పిచికారీ చేసి చీడపీడలను నివారిస్తున్నారు. పంట కాలం పూర్తయ్యాక కుండీల్లోని మట్టిని తీసి రెండు రోజుల పాటు ఎండబెట్టి తరువాత పంట సాగులో వాడతారు. రోజు విడిచి రోజు మొక్కలకు నీరందిస్తారు. వేసవి కాలం ఎండల నుంచి మొక్కలను కాపాడుకునేందుకు షేడ్‌నెట్‌ను వాడుతున్నారు. తమ ఇంటికి వారంలో ఐదు రోజులకు సరిపడా సేంద్రియ కూరగాయలు పండించుకుంటున్నారు. తాము పండించిన కూరగాయలను బంధువులకు, ఇరుగు పొరుగుకు ఇచ్చి ఇంటిపంటల రుచి చూపుతున్నారు. అప్పుడప్పుడు ఇంటికి వచ్చే తోటి ఉద్యోగులు, స్నేహితులు ప్రసాద్, యశోదల కృషిని మెచ్చుకుంటున్నారు. వీరి సలహాలతో కొందరు ఇంటిపంటల సాగుకు శ్రీకారం చుడుతున్నారు. అయితే చాలామంది ఆసక్తి ఉన్నా ఇంటిపంటల సాగుకు సమయం కేటాయించలేమని, ఖర్చు ఎక్కువవుతుందని భావించి వెనుకంజవేస్తున్నారని.. అలాంటివారు కొన్ని రోజుల పాటు ఇంటిపంటలను సాగు చేస్తే వ్యసనంగా మారుతుందని తరువాత మానాలనుకున్నా మానలేరని వారు చెపుతున్నారు. ఇంటిపంటల సాగులో శ్రమపడటం, మొక్కల మధ్య గడపటం వల్ల మానసిక ప్రశాంతత పొందుతున్నామని యశోద సంతోషం వ్యక్తం చే శారు. సేంద్రియ కూరగాయల సాగు వల్ల ఇంటిల్లిపాది ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నామనే తృప్తి గొప్పదంటున్నారు ఆ ఆదర్శ దంపతులు. – అబ్దుల్ రహమాన్, సాక్షి, గౌతంనగర్, హైదరాబాద్ -
సేంద్రియ ‘స్ఫూర్తి’ వనం!
► నాలుగు ఎకరాల్లో ఎన్నో రకాల పంటలు ∙ ►పూర్తిగా సేంద్రియ పద్ధతిలో సాగు ►పండ్ల మొక్కలు.. పప్పు ధాన్యాలు, కూరగాయల పంటలు.. ►జీవవైవిధ్యం వెల్లివిరుస్తున్న శౌరిరెడ్డి వ్యవసాయ క్షేత్రం స్ఫూర్తి వనం... నాలుగున్నర ఎకరాల విస్తీర్ణం. నాలుగేళ్ల క్రితం అంతా బీడు. ఇప్పుడు అంతా పచ్చదనం. సుమారు 50 జాతుల పండ్ల మొక్కలు.. వాటి మధ్యన పప్పు దినుసుల పంటలు.. కనువిందు చేస్తున్నాయి. ఇది ఎక్కడో మారుమూల పల్లెలో కాదు. గ్రేటర్ వరంగల్ నగర పరిధిలో. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం కుమ్మరిగూడెంలో ఉంది. బాల వికాస స్వచ్ఛంద సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సింగారెడ్డి శౌరిరెడ్డి నాలుగేళ్ల కృషితో స్ఫూర్తి వనం అభివృద్ధి చెందుతోంది. పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో ఈ తోట సాగవుతోంది. సేంద్రియ సాగు ఆవశ్యకతపై రైతులను ఒప్పించడానికి ‘స్ఫూర్తి వనం’ బాగా ఉపయోగపడుతున్నది. ఈ సేంద్రియ ప్రదర్శన క్షేత్రం గురించి శౌరిరెడ్డి మాటల్లోనే.. నాలుగేళ్ల క్రితం బాల వికాస స్వచ్ఛంద సంస్థ తరపున సేంద్రియ సాగు విస్తరణ కార్యక్రమాలు నిర్వహించే వాళ్లం. గ్రామాల్లో రైతుల సమావేశాలు నిర్వహించి.. సేంద్రియ సాగుతో కలిగే ఉపయోగాలను తెలియజేసేవాళ్లం. సేంద్రియ సాగులో దిగుబడుల గురించి చెప్పే సందర్భాల్లో చాలా మంది రైతులు నమ్మలేకపోయే వాళ్లు. అలాంటి సందర్భాల్లో రైతుల చూపులు మమ్మల్ని ప్రశ్నించినట్లుగా ఉండేవి. రైతులకు సేంద్రియ సాగు గురించి చెప్పే ముందు స్వయంగా ఆచరించి చూపితే ఈ సమస్య తీరుతుందని భావించాం. ఆ క్రమంలోనే ‘స్ఫూర్తి వనం’ ఆలోచన పుట్టింది. మొదట మనం సేంద్రియ పంటలు పండించి చూపితే ఎక్కువ మంది రైతులకు నమ్మకం కుదురుతుందని అనిపించింది. మాది మొదటి నుంచి వ్యవసాయ కుటుంబం. ఇప్పటి తరం పిల్లల మాదిరిగా నా కూతురు స్ఫూర్తి... ‘వరి చెట్లు’ అంటే నా పరువు పోయినట్లే. అందుకే.. రైతుల ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి, పిల్లలకు వ్యవసాయాన్ని గురించి తెలియజెప్పడానికి నా కూతురు ‘స్ఫూర్తి’ పేరుతో సేంద్రియ సాగు మొదలుపెట్టా. వీలు చిక్కినప్పుడల్లా అక్కడికి వెళ్తుంటా. ప్రతి వారాంతంలో కుటుంబ సభ్యులతో కలిసి స్ఫూర్తి వనానికి వెళ్తా. అక్కడి వాతావరణంలో ఉండే అనుభూతి ఎక్కడా ఉండదు. సేంద్రియ సాగు ఆవశ్యకతపై రైతులను ఒప్పించడానికి స్ఫూర్తి వనంలో సాగు పద్ధతులు బాగా ఉపయోగపడుతున్నాయి. వంద జాతులు లక్ష్యం.. స్ఫూర్తి వనాన్ని ఆదర్శవంతమైన సేంద్రియ క్షేత్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతోనే 100 జాతుల పండ్ల మొక్కలు నాటాలనుకుంటున్నా. ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా విభిన్న జాతుల పండ్ల మొక్కలు తెప్పిస్తున్నా. ప్రస్తుతం 49 రకాల పండ్ల మొక్కలు నాటాను. మరో 33 రకాల పండ్ల మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉన్నాయి. నాటిన పండ్ల మొక్కల్లోనూ వేర్వేరు రకాలున్నాయి. కేవలం మామిడిలోనే 16 రకాల మొక్కలున్నాయి. నాలుగు రకాల జామ, మూడు రకాల సపోట, మూడు రకాల చెర్రీ ఉన్నాయి. సీతాఫలాల జాతికి చెందిన రామాఫలం, లక్ష్మణఫలం, సీతాఫలం, హనుమాన్ ఫలం ఉన్నాయి. అరటి, ద్రాక్ష, జీడిపప్పు, సీమచింత, కొబ్బరి, నిమ్మ, బత్తాయి, నారింజ, దానిమ్మ, చింత, పుచ్చ, అనాస, బొప్పాయి, స్టార్, లిచ్చి, మిరకిల్ ఫ్రూట్, ఇండియన్ ఫిగ్, ఫాషన్ , డ్రాగన్, అమ్లా, ఆపిల్, ఆపిల్ బేర్, అవకాడో, బేల్, బెంతామెస్కార్నెల్, డెటెల్నట్, బిగ్నె, బిలిమ్బి, బ్రీడ్, జాక్, కొకుమ్, లొంగాన్, నోని, ఓలి, పీర్, ప్లమ్స్, పమ్మేలో, జుబుటికబ, సైసమ్, సాండల్, వెట్టి, గర్చిన, మూటి, బరబ, లోవిలోవి వంటి రకాల పండ్ల మొక్కలు ఉన్నాయి. ఖర్జూర, ఇప్ప, తాటి చెట్లు ఉన్నాయి. మొదట తెచ్చిన మొక్క తెచ్చినట్లు నాటుతూ పోయా. తర్వాత ఓ విషయం గమనించా. చాలా రకాల పండ్ల మొక్కలు ఉన్నాయి. ఏ మొక్క ఏ సీజనులో పూత, కాత వస్తోందో గమనిస్తున్నా. సీజన్ల వారీగా పండ్లు వచ్చే మొక్కలను గుర్తించి వేరు చేస్తున్నా. వేసవి కాలంలో పండ్లు వచ్చే మొక్కలన్నీ ఒక చోట, శీతాకాలంలో కాసే మొక్కలన్నీ ఒకచోట నాటుతున్నా. దీని వల్ల సాగు సులభమవుతోంది. మిశ్రమ పంటలతో మేలు... బాల వికాస స్వచ్ఛంద సంస్థ చేస్తున్న కార్యక్రమాలలో రైతులను ఎక్కువగా కలుస్తుంటాం. ఎక్కువ మంది రైతులు... ‘కష్టపడి సాగు చేశా. పంట బాగా పండింది. ధర తక్కువగా ఉండడంతో అనుకున్నట్లు ఆదాయం రాలేదు’ అని చెబుతుంటారు. సాగు భూమిలో మొత్తం ఒకే పంట వేయకుండా మిశ్రమ పంటలు వేస్తే లాభం ఉంటుంది. ముఖ్యంగా రైతు కుటుంబాలకు కావాల్సిన అవసరాలు తీరతాయి. మా స్ఫూర్తి వనంలో వేరుశనగ, పెసర, కందులు, శనగలు, మినుములు పంటలు వేశాను. మా ఇంటి అవసరాలు తీరుతున్నాయి. రెండేళ్ల క్రితం వరకు వరి పండించాను. గత ఏడాది కరువుతో బోరులో నీరు లేక నాట్లు వేయలేదు. నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం సాగు కుంట(ఫామ్ పాండ్) నిర్మిస్తున్నా. కూరగాయలు సాగు చేస్తున్నా. టమాటాలు కాస్తున్నాయి. తీగ జాతి కూరగాయలు, ఆకు కూరలు సాగు చేస్తున్నా. వ్యవసాయానికి ఆధారమైన రెండు ఆవులు ఉన్నాయి. జీవామృతం, ఘన జీవామృతం, కషాయాలు తయారు చేసి వాడుతున్నాం. సేంద్రియ పద్ధతిలో పండించే ఆహారోత్పత్తులను మిత్రులకు, బంధువులకు పంపించినప్పుడు చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. – పిన్నింటి గోపాల్, సాక్షి ప్రతినిధి, వరంగల్ -
పండ్ల తోటల్లో నాటు కోళ్లు!
కొత్తపుంతలు తొక్కుతున్న ప్రకృతి సేద్యం పండ్ల తోటల్లో నాటు కోళ్ల పెంపకంతో అదనపు ఆదాయం కోళ్ల పెంపకంతో భూసారం పెరిగి రెట్టింపైన పంట దిగుబడి కొత్త ఆలోచన సరికొత్త ఆచరణ దిశగా తొలి అడుగులేయిస్తుంది. ఆ అడుగులు.. వెలుగుబాటలు వేసి పదుగురికీ మార్గదర్శకమవుతాయి. కడప జిల్లాకు చెందిన రైతు గంగరాజు వెంకట్రామరాజు సేంద్రియ పండ్ల తోటల్లోనే నాటు కోళ్లను పెంచుతూ బహుళ ప్రయోజనాలు పొందుతున్నారు. పదేళ్లుగా సాగు చేస్తున్న తోటల్లోనే నాలుగేళ్ల క్రితం నుంచి సేంద్రియ పద్ధతుల్లోనే నాటు కోళ్ల పెంపకాన్ని చేపట్టి భళా అనిపించుకుంటున్నారు. నాటు కోళ్లు, గుడ్ల ద్వారా అదనపు ఆదాయం పొందుతున్నారు. దీంతో పాటు భూమి సారవంతమై పంట దిగుబడులు కూడా రెట్టింపవ్వటం విశేషం. రైతుకు ఆదాయ భద్రత వ్యవసాయా నుబంధ రంగాల ద్వారానే సాధ్యమవుతుం దని ఆచరణాత్మకంగా చాటిచెబుతున్నారు సేంద్రియ రైతు గంగరాజు వెంకట్రా మరాజు. సేంద్రియ పద్ధతుల్లో పండ్ల తోటలతోపాటు నాటుకోళ్ల పెంపకాన్ని చేపట్టి మంచి లాభాలు గడిస్తున్నారు. వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు మండలంలో ని సిద్దిరాజు కండ్రిగ ఆయన స్వగ్రామం. తనకున్న ఆరెకరాల్లో గత పదేళ్లుగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో అరటి, బొప్పాయి, మామిడి తోటలను సాగు చేస్తున్నారు. నాటుకోళ్లకు మార్కెట్లో ఉన్న డిమాండ్‌ను గుర్తించి తోటలోనే నాటుకోళ్ల పెంపకాన్ని ప్రారంభించారు. అదనపు ఆదాయంతో పాటు భూసారంతోపాటు పంట దిగుబడు లు పెరుగుతున్నాయంటున్నారు. వెంకట్రామరాజు 2010లో 2 పెట్టలు, 2 పుంజులుతో నాటుకోళ్ల పెంపకాన్ని ప్రారంభించారు. మరుసటి ఏడాదికి కోళ్ల సంఖ్య 500కు చేరింది. తాను పెంచిన కోళ్లను, గుడ్లను వినియోగదారులకు తోట వద్దనే విక్రయిస్తున్నారు. పాములు, పిల్లుల బారి నుంచి కోళ్లను రక్షించుకోవటం కష్టంగా ఉండటంతో.. తోట చుట్టూ ఐదడుగుల ఎత్తున వైర్ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేశారు. చేలో పండిన చిరుధాన్యాలే మేత సేంద్రియ పద్ధతుల్లో నాటుకోళ్ల పెంపకంలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది మేత గురించే. నాటుకోళ్లకు మేతకోసం 5 నెలల పాటు ఒక్కో కోడిపై రూ. 100 ఖర్చవుతుంది, ఆదాయం మాత్రం దీనికి మూడున్నర రెట్ల వరకూ వస్తుంది. ఇది ఎటువంటి రసాయనాలు వాడకుండా పండించినదై ఉండాలి. అందుకే తన చేలోనే పండించిన జొన్న, మొక్కజొన్న, సజ్జ, రాగులు లాంటి సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులతోనే వెంకట్రామరాజు నాటుకోళ్లను పెంచుతున్నారు. కోళ్లకు వ్యాధి నివారణ టీకాలు కూడా వేయడంలేదు. అయినా ఇంతవరకూ వీటికి ఎటువంటి జబ్బులు, సీజనల్ వ్యాధులు రాలేదు. దీనికి కారణం కోళ్లు ప్రకృతి వ్యవసాయం చేసే పొలంలోనే తిరుగుతూ.., సేంద్రియ ఆహారాన్ని మేతగా తినటమేనంటారాయన. రైతుకు రెండు విధాలా లాభం.. సేంద్రియ పద్ధతుల్లో నాటుకోళ్ల పెంపకం వల్ల రైతుకు అదనపు ఆదాయం లభించటంతో బాటు పొలం సారవంతమవు తుంది. పంటలకు హాని చేసే క్రిమికీటకాల ను ఇవి తింటాయి. దీంతో చీడపీడల బాధ తప్పుతుంది. 500 కోళ్లను పెంచినట్టయితే వాటి విసర్జితాల వల్ల ఏడాదికి7 నుంచి 8 టన్నుల సేంద్రియ ఎరువును పొలానికి వేసినట్టేనంటారు వెంకట్రామరాజు. ఇంతకు ముందు హైబ్రిడ్ దోస సాగుచేస్తే ఎకరాకు 10 టన్నులు దిగుబడి వచ్చింది.నాటుకోళ్ల పెంపకాన్ని చేపట్టాక 20 టన్నుల వరకూ దిగుబడి వచ్చిందని ఆయన చెబుతున్నారు. పంటలను నాశనం చేసే ప్రమాదం ఉండటంతో ఆహారపంటలు సాగు చేసే పొలాల్లో వీటి పెంపకం సాధ్యం కాదు. పండ్ల తోటల్లో నాటు కోళ్ల పెంపకాన్ని చేపడితే వాటికి స్వేచ్ఛగా తిరిగేందుకు అవసరమైన స్థలం లభించటంతో పాటు పంటలకు నష్టం ఉండదు. కోళ్లు రాత్రిళ్లు చెట్లపైనే ఉంటాయి. పిల్లలకు మాత్రం గంపలను ఏర్పాటు చేశారు. ఫారం కోళ్ల ధర కన్నా నాటుకోళ్ల మాంసాన్ని, గుడ్లను రెట్టింపు ధర చెల్లించి వినియోగదారులు కొంటున్నారు. ప్రస్తుతం నాటుకోళ్లను కిలో రూ. 230 - 250 ధరకు అమ్ముతున్నారు. మాంసం కిలో రూ. 350 - 400 ధరకు షాపుల వాళ్లు అమ్ముతున్నారు. అలాగే సేంద్రియ నాటుకోడి గుడ్లకు రూ. 8 వరకూ ధర పలుకుతోంది. మినీ ఇంక్యుబేటర్‌తో మరింత ఆదాయం ముందుచూపుతో వ్యవహరించి రూ. 35 వేల ఖర్చుతో మినీ ఇంక్యుబేటర్‌ను ఏర్పాటు చేసుకోవటంతో గుడ్ల ఉత్పత్తి రెట్టింపు అయ్యింది. ఇంక్యుబేటర్ ఏర్పాటుతో కోడి, గుడ్లను పొదిగే సమయం ఆదా అవుతుంది. మళ్లీ గుడ్లు పెట్టేందుకు కోడి త్వరగా సిద్ధమవుతుంది. ఇలా చేయటం వల్ల ఏడాదిలో ఏడు నుంచి ఎనిమిది సార్లు కోడి గుడ్లు పెడుతుంది. 600 గుడ్లను పొదిగే ఇంక్యుబేటర్ ధర రూ. 35 వేలు. గుడ్లు పొదిగే సమయం ఆదా అవుతుంది. చిన్న రైతులకు జీవనోపాధి 8 పెట్టలు, 1 పుంజుతో ఒక కుటుంబం ఆర్థికావసరాలు తీరుతాయి. ఒక నాటుకోడి పెట్ట ఏడాదిలో నాలుగైదుసార్లు గుడ్లు పెడుతుంది. 8 పెట్టలు ఏడాదికి కనీసం 80 గుడ్లు పెడతాయి. ఇందులో 20 పిల్లలు చనిపోయినా 60 పిల్లలు పెరుగుతాయి. ఐదు నెలలకు ఒక్కో కోడి 2 కిలోల బరువు ఉంటుంది. అంటే ఒక్కో కోడి రూ. 450 వరకూ ధర పలుకుతుంది. మార్కెట్ ధర (60్ఠ450) ప్రకారం విక్రయిస్తే సుమారు రూ. 27, 000 వరకూ ఆదాయం వస్తుంది. ఒక్కో కోడిపై మేత కోసం పెట్టే ఖర్చు (60్ఠ100 ) రూ. 6 వేలు అవుతుంది. అంటే రూ. 20 వేలకు పైగా నికరాదాయం. ఇది కేవలం ఐదునెలల్లో 8 పెట్టలు, ఒక పుంజుతో వచ్చిన ఆదాయం మాత్రమే. ఇలా ప్రతినెలా విడతలుగా గుడ్లు పొదిగిస్తే ఆదాయం వస్తూనే ఉంటుంది. - మాచుపల్లె ప్రభాకరరెడ్డి , కడప అగ్రికల్చర్ ఎకరం తోటలో 500 కోళ్ల వరకు పెంచొచ్చు! నాటుకోళ్లకు ప్రస్తుతం డిమాండ్ బాగా ఉంది. చిన్నగా మొదలుపెట్టి క్రమేణా కోళ్ల సంఖ్యను పెంచుకోవాలి. పొలంలో పండిన చిరుధాన్యాలనే మేతగా వేస్తున్నాము. ఒక ఎకరం తోటలో 500 వరకూ నాటుకోళ్లను పెంచవచ్చు. పొలానికి సేంద్రియ ఎరువు అందడంతో బాటు రైతుకు మంచి ఆదాయం వస్తుంది. ఖర్చు (మేత)రూ. 100 అయితే, ఆదాయం రూ. 450 వరకూ వస్తుంది. అంటే నికరంగా మూడింతల ఆదాయం వస్తుంది. నాటు కోడి గుడ్లు, మాంసం ఆరోగ్యకరమైన ఆహారమని వినియోగదారులు గుర్తించడంతో గిరాకీ పెరుగుతోంది. . - గంగరాజు వెంకట్రామ రాజు (96529 02972), సిద్దిరాజు కండ్రిగ, రైల్వేకోడూరు మండలం, వైఎస్సార్ జిల్లా. -
సేంద్రియ సర్టిఫికేషన్ అవసరమా?
సేంద్రియ/ప్రకృతి సేద్యం చేస్తున్న రైతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ రైతులంతా ఇవి సేంద్రియ పద్ధతుల్లో పండించినవేనన్న సర్టిఫికెట్ పొందితే బావుంటుందని కొందరు అంటున్నారు. అయితే, సేంద్రియ ఉత్పత్తుల ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండా ఉండటానికి కారణం ఈ సర్టిఫికేషన్ ప్రక్రియేనని.. అధిక శాతం చిన్న, సన్నకారు రైతులున్న మన దేశంలో ఇది అసాధ్యమని అంటున్నారు సరస్వతి కవుల. సేంద్రియ పద్ధతుల్లో నేను పండించిన కూరగాయలను ఈ మధ్య హైదరాబాద్‌లో ఒక సేంద్రియ సంతకు తీసుకెళ్లి అమ్మాను. కొంతమంది ఇవి నిజంగానే రసాయనాలు లేనివా? అని అడిగారు. ఎక్కడ పండించారు? ఎలా పండించారు? వంటి వివరాలు కనుక్కొని, కొన్నారు. ఒకాయన ఇవి నిజంగానే సేంద్రియ కూరలు.. ఎందుకంటే, మందులు వేసినవి చాలా నిగనిగలాడుతూ ఉంటాయి. ఇవి కొంచెం డల్‌గా ఉన్నాయి. ఇవి కచ్చితంగా సేంద్రియమే అన్నారు. ఒకావిడ వంకాయలు కొంటూ ఇందులో పుచ్చులు చూస్తే ఆనందం వేస్తుంది. అక్కడక్కడా పుచ్చు వంకాయలున్నాయంటే కచ్చితంగా ఇవి మందులు లేకుండా పండించినవే అన్నారు. మా అంగడికి వచ్చినావిడ ఒకరు టమాటా నోట్లో వేసుకొని.. ‘ఇది ఒరిజినలే, రుచి చూస్తే తెలుస్తోంది’ అన్నారు. సేంద్రియ పంటో కాదో తెలుసుకునేదెలా? ఈ మధ్య అనేక నగరాల్లో వినియోగదారులు సేంద్రియ పంటలను హెచ్చు ధరకైనా సరే కొంటున్నారు. కానీ, వారు కొనేవి నిజంగా సేంద్రియ పంటలా? కాదా? అని ఎలా తెలుసుకోవటం అనేది చర్చకి వస్తోంది. కొంతమంది సర్టిఫికేషన్ ఉంటే మంచిది, వినియోగదారులకు నిఖార్సయిన సేంద్రియ ఉత్పత్తులు కొంటున్నామన్న నమ్మకం కలుగుతుంది అంటున్నారు. కానీ, సర్టిఫికేషన్ అంటే చాలా ఖర్చుతో కూడిన పని. అంతర్జాతీయంగా కూడా సేంద్రియ ఉత్పత్తుల ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండా ఉండటానికి కారణం ఈ అంతర్జాతీయ సర్టిఫికేషన్ ప్రక్రియే. అయితే అధిక శాతం చిన్న, సన్నకారు రైతులున్న మన దేశంలో ఇది సాధ్యమయ్యే విషయం కాదు. ఇంకొందరు పీజీఎస్(పీర్ గ్యారంటీ స్కీమ్) మంచిది అంటున్నారు. కొంతమంది రైతులు ఒక సంఘంగా ఏర్పడి ఒకరికొకరు సర్టిఫై చేసుకోవటం అన్నమాట. అయితే, ఇది ఆ గ్రూప్‌లో ఉన్న వాళ్ల మధ్య ఉండే సంబంధాలను బట్టి, నిబద్ధతను బట్టి, విలువలను బట్టి ఉంటుంది. ఒక వేళ గ్రూప్‌లో వారికి గొడవలు వస్తే మరి సర్టిఫికేషన్ ప్రక్రియ సజావుగా సాగుతుందా? కొన్ని చోట్ల బాగానే చేస్తున్నారు. కానీ, నిజంగా రైతు పొలంలోకి వెళ్లి చూసి, అన్ని వేళలా నిఘా పెట్టాలంటే సాధ్యపడదు. పీజీఎస్ పద్ధతిని చాలా మటుకు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఉన్న రైతు సంఘాలు, మహిళా సంఘాలు పాటిస్తున్నాయి. కానీ అన్నిచోట్లా ఈ పద్ధతిని పాటించడం కుదరకపోవచ్చు. సర్టిఫికెట్ నిజాయితీగా ఇస్తారా? ఇక ఈ మధ్య ఇంకో ప్రతిపాదన వచ్చింది.. ప్రభుత్వం వారే సర్టిఫికేషన్ చేస్తే బాగుంటుంది అని కొంతమంది అంటున్నారు. కానీ, ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేసే తీరు మనకు తెలియనిదేముంది? లంచం ఇస్తే ఏ పనైనా సాధ్యపడే మన వ్యవస్థలో నిక్కచ్చిగా, నిజాయితీగా సర్టిఫికెట్ ఇస్తారని ఎలా నమ్మగలం? లంచమివ్వనని మొండికేసే వారికి ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగటమే అవుతుంది తప్ప సర్టిఫికెట్ వస్తుందా? ఇది కూడా ప్రభుత్వ సంస్థల్లో పనిచేసిన వారికి ఒక ఆదాయ వనరు అవుతుంది తప్ప నిజంగా వినియోగదారులకు మంచి జరుగుతుందా? అన్నది అనుమానమే. సేంద్రియ పంటల్లో జన్యుమార్పిడి విత్తనాలు వాడకూడదు. మరి మన ప్రభుత్వాలు మాత్రం జన్యుమార్పిడి ఆహార పంటలు తీసుకువస్తున్నాయి. రైతులు నష్టపోతున్నా సరే, వాటి వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని రిపోర్టులు వచ్చినా సరే, సుప్రీంకోర్టు చెప్పినా సరే జన్యుమార్పిడి ఆహార పంటలను అనుమతిస్తున్న మన ప్రభుత్వాలు నిజంగా ప్రజల ఆరోగ్యం గురించి శ్రద్ధ వహిస్తాయా? విలువలతో కూడిన సంబంధం.. అంతెందుకు, అమెరికాలోనే జన్యుమార్పిడి ఆహార ప్యాకెట్లపైన జన్యుమార్పిడి ఆహారం అని లేబుల్ వెయ్యాలని డిమాండ్ చేసి, మేం తినే ఆహారం విషతుల్యమా? కాదా? తెలుసుకునే హక్కు మాకు కావాలి అని అక్కడి ప్రజలు ఉద్యమాలు చేసినా సరే.. అక్కడి ప్రభుత్వం వినిపించుకోవటం లేదు. కానీ రైతులకు మాత్రం సేంద్రియ సర్టిఫికేషన్ కావాలి అని నియమాలు పెట్టారు. అక్కడి మియామీ నగరంలో ఒక సేంద్రియ రైతుల బజార్లో కొందరు రైతులతో మాట్లాడినప్పుడు ‘మీరు సర్టిఫికెట్ తీసుకున్నారా?’ అని అడిగాను. దానికాయన.. ‘లేదు. మేమిక్కడకి ప్రతి వారం వస్తాం. మా దగ్గర ఒకసారి కొన్న వినియోగదారులు మళ్లీ మళ్లీ మా దగ్గరికే వచ్చి కొంటారు. అది వారికి మా మీదున్న నమ్మకం’ అన్నారు. అక్కడే ఉన్న వినియోగదారుడొకాయన అన్నారు. ఒకసారి రుచి చూస్తే తెలుస్తుంది, అది సేంద్రియ పంట అవునా? కాదా? అనేది! ఇది రైతులకు, వినియోగదారులకు మధ్య ఉన్న విలువలతో కూడిన సంబంధం. దీన్ని మించి ఏం సర్టిఫికెట్ కావాలి? (వ్యాసకర్త సేంద్రియ రైతు. రంగారెడ్డి జిల్లా నందివనపర్తి గ్రామం. మొబైల్: 98497 18364) -
ఇటు వ్యాయామం... అటు సహజాహారం!
ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి వ్యాయామం ఉపకరిస్తుంది. అయితే, ఆ వ్యాయామం కోసమే కాకుండా.. రసాయనిక అవశేషాల్లేని సహజాహారాన్ని ఇంటిపట్టునే పండించుకోవడానికి కూడా ఉపయోగపడితే ఎలా ఉంటుంది? ఈ ఆలోచనతోనే రేణుకుంట్ల శ్రీరాములు తన ఇంటిపైన 3 నెలలుగా సేంద్రియ పద్ధతుల్లో ఆకుకూరలు, కూరగాయలు పండించుకుంటున్నారు. హైదరాబాద్ ఆల్విన్ కంపెనీ మాజీ ఉద్యోగైన శ్రీరాములు(61) కూకట్పల్లి సమీపంలోని ప్రగతినగర్‌లో స్థిరపడ్డారు. ఇంతకుముందున్న ఇంటి వద్ద పెరట్లో చాలా ఖాళీస్థలం ఉండడంతో పూలమొక్కలు, కూరగాయ మొక్కలు పెంచే అలవాటుంది. కొద్ది నెలల క్రితం 3 అంతస్థుల కొత్త ఇంట్లోకి మారిన తర్వాత.. మేడ మీద గ్రోబాగ్స్‌ను ఏర్పాటు చేసి ఆకుకూరలు, కూరగాయలు సాగు చేస్తున్నారు. గుండ్రంగా ఉండే పెద్ద గ్రోబాగ్స్ పది, 50కి పైగా చిన్న కుండీల్లో టమాటా, బీర, పొట్ల, సొర, దోస, గోంగూర, పాలకూర, చుక్కకూర సాగు చేస్తున్నారు. మొక్కలకు ఎండాకాలంలో మొక్కలకు షేడ్‌నెట్ వేయడానికి, కోతుల నుంచి రక్షించుకోవడానికి టైపైన పక్కాగా ఇనప ఫ్రేమ్‌ను ఏర్పాటు చేశారు. మొక్కలంటే ప్రాణం కాబట్టి కొంత ఖర్చయినప్పటికీ ఈ ఏర్పాటు చేశానని ఆయన చెప్పారు. దసరా పండుగ తర్వాత గ్రోబాగ్స్ తెచ్చి టై కిచెన్ గార్డెన్‌కు శ్రీకారం చుట్టారు. ట్రాక్టర్ ఎర్రమట్టి, అర ట్రాక్టర్ చివికిన పశువుల ఎరువుతోపాటు కోకోపిట్, వేపపిండితో కూడిన మట్టి మిశ్రమాన్ని వాడుతున్నారు. మొక్కలకు రోజ్క్యాన్తో తగుమాత్రంగా నీరు పోయడంతో శ్రీరాములు దినచర్య ప్రారంభమవుతుంది. కనీసం గంట సేపు చక్కని వ్యాయామం దొరుకుతోందని ఆయన చెప్పారు. దీంతోపాటు మొక్కలను దగ్గరగా పరిశీలించడం వీలవుతోందన్నారు. నలుగురు కుటుంబానికి అవసరమయ్యే ఆకుకూరలు, కూరగాయల్లో 60% వరకు ప్రస్తుతం తామే పండించుకుంటున్నామన్నారు. 15-20 రోజులకోసారి వేపనూనెను మొక్కలపై పిచికారీ చేస్తామని, అంతకుమించి మరేమీ అవసరం రావడం లేదని ఆయన తెలిపారు. రసాయనిక అవశేషాల్లేని ఆకుకూరలు, కూరగాయలను సొంతంగా మేడ మీద పండించుకోవడం ఆనందంగా ఉందన్నారు. కూరగాయలు, ఆకుకూరలను కోసిన 5 నిమిషాల్లోనే వండుకునే వీలుండడం, రుచి చాలా బాగుండడం సంతృప్తినిస్తోందన్నారు. ప్రగతినగర్ మాజీ సర్పంచ్ అయిన శ్రీరాములు ప్రస్తుతం ఎంపీటీసీ సభ్యుడిగా ఉన్నారు. టైలు ఖాళీగా ఉంచేకన్నా ఉన్నంతలో సహజాహారాన్ని పండించుకోవడం మేలని తన చేతల ద్వారా చాటుతున్నారు. - ఇంటిపంట డెస్క్